ఉద్యోగులకు మార్క్ జుకర్‌బర్గ్ భరోసా!

మెటాలో భారీ ఉద్యోగ కోతలు.. 8 వేల మందికి షాక్ ఇచ్చిన సంస్థ. AI పెట్టుబడుల మధ్య మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు.

Meta సంస్థలో మరోసారి భారీ ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ ద్వారా వారి సేవలు ఇక అవసరం లేదని తెలియజేసినట్లు సమాచారం. ఈ ఉద్యోగ కోతలు మెటా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఉద్యోగాల కోతల తర్వాత.. మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు అంతర్గత మెమో పంపినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇకపై కంపెనీ స్థాయిలో మరిన్ని లేఆఫ్స్ ఉండవని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో మరో 8,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందన్న వార్తల మధ్య ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మెటా ప్రస్తుతం సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల బదిలీలు, మేనేజ్‌మెంట్ స్థాయిల తగ్గింపు వంటి చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయాల వెనుక ప్రధాన కారణంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పెట్టుబడులు చెబుతున్నారు.

8000 మందికి ఉదయం షాక్

బుధవారం తెల్లవారుజామున మెటా ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో వారి సేవలు ఇక అవసరం లేదని తెలియజేసినట్లు సమాచారం. ఒక్కసారిగా వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడంతో టెక్ రంగంలో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ లేఆఫ్స్‌తో పాటు మరో 7,000 మంది ఉద్యోగులను కొత్త టీమ్‌లకు బదిలీ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదనంగా కంపెనీ ఇప్పటికే ఖాళీగా ఉన్న 6,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా నిలిపివేసింది. టెక్ రంగంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఖర్చుల నియంత్రణ చర్యల్లో భాగంగా మెటా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఉద్యోగులకు జుకర్‌బర్గ్ భరోసా!

మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు పంపిన మెమోలో ఇకపై ఈ ఏడాది కంపెనీ స్థాయిలో మరిన్ని లేఆఫ్స్ ఉండవని పేర్కొన్నారు. “ఈ ఏడాది కంపెనీ వ్యాప్తంగా మరిన్ని ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను” అని ఆయన మెమోలో పేర్కొన్నట్లు రిపోర్టులు వెల్లడించాయి. అలాగే ఉద్యోగులతో కమ్యూనికేషన్ విషయంలో మెటా ఆశించిన స్థాయిలో వ్యవహరించలేకపోయిందని ఆయన అంగీకరించారు. భవిష్యత్తులో ఆ అంశంలో మెరుగుదల తీసుకువస్తామని తెలిపారు.

AI కారణంగానే మార్పులు?

మెమోలో జుకర్‌బర్గ్ కృత్రిమ మేధస్సు ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. AI మన జీవితకాలంలో అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ అని పేర్కొన్నారు. “విజయం ఎప్పటికీ హామీ కాదు. AI తదుపరి తరాన్ని నిర్వచించే టెక్నాలజీ” అని ఆయన వ్యాఖ్యానించారు.

మెటా ప్రస్తుతం AI రంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ ఏడాది కంపెనీ సుమారు 125 బిలియన్ నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే ప్రణాళికలో ఉందని సమాచారం. ఇందులో ఎక్కువ భాగం AI అభివృద్ధికే వెళ్తుందని తెలుస్తోంది. AI ఆధారిత ఉత్పత్తులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సూపర్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలపై మెటా దృష్టి పెట్టినట్లు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.

చిన్న టీమ్‌లు.. తక్కువ మేనేజ్‌మెంట్

ఉద్యోగాల కోతల తర్వాత మెటా సంస్థాగత నిర్మాణంలో మార్పులు చేపడుతోంది. ఉద్యోగులను చిన్న టీమ్‌లలో పనిచేసేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించి నిర్ణయాలు వేగంగా తీసుకునే విధంగా కంపెనీ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ బ్యూరోక్రసీతో ఉద్యోగులు ఎక్కువ బాధ్యతలు తీసుకునేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు.

ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజ్

ఉద్యోగాలు కోల్పోయిన వారికి మెటా సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటించింది. కనీసం 16 వారాల జీతం అందించనున్నట్లు సమాచారం. అదనంగా కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి మరో రెండు వారాల వేతనం ఇవ్వనున్నారు. అయితే ఈ ప్యాకేజీ అనేది ఉద్యోగి పనిచేసిన ప్రాంతాన్ని బట్టి మారవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

టెక్ రంగంపై ప్రభావం

ఇటీవల గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి టెక్ దిగ్గజాలు భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి. ఖర్చుల తగ్గింపు, AI పెట్టుబడులు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం AI రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో టెక్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈ మార్పుల ప్రభావం ఉద్యోగులపై స్పష్టంగా కనిపిస్తోంది. మెటా తాజా నిర్ణయాలు టెక్ పరిశ్రమలో మరో కీలక మలుపుగా భావిస్తున్నారు.

Also read:కేరళ సీఎం ప్రమాణ స్వీకారం: ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే!

Mahesh
Maheshhttp://marthatelugu.com
మహేష్ - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.

Related Articles

Latest Articles