అదే నా ధ్యేయం: సినిమా పరిశ్రమ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

గత కొన్ని రోజులుగా తెలంగాణాలో సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. వేతనాలు పెంచాలని కోరుతూ.. చేస్తున్న ఈ సమ్మెపై పలువురు స్పందించారు. కార్మికులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవికి కూడా తమ ఇబ్బందులను విన్నవించుకున్నారు. ఈ విషయం మీదనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సినీ నిర్మాతలు, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు.

కార్మికుల సమ్మె విరమణకు చర్యలు

సినిమా పరిశ్రమలో వాతావరణం బాగుండాలని, మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు తమ సమ్మెను విరమించుకునేలా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అందరూ చట్టం పరిధిలోనే పనిచేయాలని, చట్టాన్ని అతిక్రమించకూడదని అన్నారు. పరిశ్రమలో గుత్తాధిపత్యం చేయడానికి లేదా నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

సినీ నిర్మాతలు.. కార్మికులతో మానవత్వంతో వ్యవహరించాలి. నిర్మాతలు, డైరెక్టర్లు, కార్మికులు & ప్రభుత్వంతో కూడిన సమగ్ర విధానాన్ని మనం రూపొందించుకోవలసిన అవసరం గురించి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం తప్పకుండా అందరికీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కార్మికులను కూడా ఆహ్వానించి వారితో తప్పకుండా మాట్లాడతాను. సమ్మెను నియంత్రించడానికి నేను జోక్యం చేసుకున్నాను. ఎందుకంటే వివాదాలు పరిశ్రమను దెబ్బతీస్తాయి. కాబట్టి వివాదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్ల బృందం ఆదివారం (ఆగస్టు 24) సీఎం నివాసంలో కలిసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ వేదికపై టాలీవుడ్

సినిమా పరిశ్రమకు పర్యవేక్షణ అవసరం. కాబట్టి తెలుగు సినిమా భవిష్యత్తు కోసం కొన్ని సిద్ధాంతాలను రూపొందించుకోవాలి. హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. మరిన్ని తెలుగు సినిమాల షూటింగ్ కూడా రాష్ట్రంలో చిత్రీకరించబడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అంతే కాకుండా ప్రపంచ వేదికపై టాలీవుడ్‌ను నిలబెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇదే నా ధ్యేయం అని స్పష్టం చేశారు. దీనికి మీరు కూడా కృషి చేయాలని సూచించారు.

పరిశ్రమను ఎప్పటికప్పుడు వృద్ధి చేయాలి. దీనికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని సీఎం హామీ ఇచ్చారు. సినిమా సంబంధిత శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీలో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరైనా చట్టం పరిధిలోనే పనిచేయాలి. చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. టాలీవుడ్ సినిమాకు మేము తప్పకుండా అండగా ఉంటామని చెప్పారు.

సమావేశానికి హాజరైన నిర్మాతలు & డైరెక్టర్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశానికి.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మెన్ దిల్ రాజుతో పాటు.. అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమినీ కిరణ్, స్రవంతి రవికిశోర్ హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల మొదలైన దర్శకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు.

Leave a Comment