‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’: బీఆర్ఎస్ నేతల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో పొలంలో పంటలు పండించడంలో నిమగ్నమవ్వాల్సిన రైతన్న.. యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద పడిగాపులు కాస్తున్నారు. వారి వంతు ఎప్పుడొస్తుందో తెలియక గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా వినూత్న నిరసన చేపట్టారు.

బీఆర్ఎస్ నేతల నిరసన

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సమయంలో.. తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్ఎల్ఏలు, ఎమ్ఎల్సీలతో పాటు.. పార్టీ ముఖ్య నాయకులు అందరూ అమరవీరులకు నివాలులు అర్పించారు. ఆ తరువాత రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు నిదర్శనంగా ఖాళీ యూరియా సంచులను, ప్లకార్డులను చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. ”గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా” అంటూ నినాదాలు చేశారు.

రాష్ట్రంలోని రైతన్నలకు వెంటనే యూరియా సరఫరా చేయాలని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్ఎల్ఏ సుధీర్ రెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు. రైతన్నకు సకాలంలో యూరియా అందించాలని.. అన్నదాతకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.

యూరియా కొరత

రాష్ట్రంలో వర్షాలు పడుతున్న సమయంలో.. అన్నదాత యూరియా కొరతను ఎదుర్కొంటున్నాడు. రైతులకు అవసరమైనంత యూరియా.. రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రభుత్వం కూడా కావాల్సిన ఏర్పాట్లను చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో చేసిన జాప్యం కారణంగానే.. యూరియా సరఫరాకు అంతరాయం ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. యూరియా కోసం ఇబ్బందులు పడిన రైతులు మా ప్రభుత్వ హయాంలో ఒక్కరుకూడా లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత చాలామంది రైతులను ఒకింత భయానికి గురిచేస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలో కూడా యూరియా కొరత సమస్యను.. కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని.. కేంద్రం కూడా తగిన సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణాలో త్వరలోనే యూరియా కొరత తీరుతుందని పలువురు భావిస్తున్నారు.

యూరియా అవసరం ఏమిటి?

అధిక దిగుబడి కావాలంటే.. ఎరువులు కొంత ఎక్కువమోతాదులో ఉపయోగిస్తారు. ఇందులో సహజ ఎరువులు ఉంటాయి, కృత్రిమ ఎరువులు ఉన్నాయి. అయితే యూరియా అనేది నైట్రోజన్ ఎక్కువ మోతాదులో ఉన్న ఎరువు. నైట్రోజన్ శాతం ఎక్కువ ఉన్నప్పుడే.. దిగుబడి కొంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి యూరియా ఎరువులో 46 శాతం నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి దాదాపు చాలా పంటలకు ఇది ప్రధాన ఎరువు. ఈ కారణంగానే రైతులు యూరియాను ఎక్కువగా ఉపయోగిస్తారు.

యూరియా వల్ల ఉపయోగాలు మాత్రమే కాకుండా.. ఇతర ఎరువులతో పోలిస్తే, దీని ధర కూడా తక్కువ. నీటిలో సులభంగా కరిగిపోయే గుణం ఉన్న ఈ ఎరువు పంటలకు త్వరగా పోషకాలను అందించడంలో ఉపయోగపడుతుంది. వరి, గోధుమ, పత్తి, మిర్చి, మొక్కజోన్న పంటలకు యూరియా చాలా అవసరం. అయితే సహజ ఎరువులను యూరియాను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవడానికి రైతులు అలవాటుపడాలి. ఎందుకంటే యూరియా కొరత వచ్చినప్పుడు.. ఆ ప్రత్యామ్నాయమే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని రైతన్నలు గుర్తుంచుకోవాలి.

Leave a Comment