ఈయనే లేకుంటే.. గణేష్ ఉత్సవాలు ఉండేవా?: ఆ ఒక్క ఆలోచనే నేడిలా..

ప్రస్తుతం భారతదేశంలో గణేష్ చతుర్థి వేడుకలు.. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏ వీధిలో చూసినా.. ఏ వాడాలో చూసిన చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ప్రజలందరూ కలసి.. కులమత బేధాలు లేకుండా, ఈ పండుగను గొప్పగా జరుపుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇళ్లలోనే జరుపుకునే గణేష్ పూజలు.. వీధుల్లోకి ఎలా వచ్చాయి?, ఇది బ్రిటీష్ వారిలో ఎందుకు భయం పుట్టించిందనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

తిలక్ ఆలోచన & నిమజ్జనం వేడుకలు

భారత స్వాతంత్య్ర సమరం సమయంలో ప్రజలందరినీ ఏకం చేయాలని బాల గంగాధర్ తిలక్ ఆలోచిస్తూ ఉండేవారు. అప్పట్లో మహారాష్ట్రలోని పీష్వాలు.. వినాయకునికి ఇళ్లలోనే పూజలు చేసేవారు. ఈ వేడుకలను బయట ఎందుకు చేయకూడదు అని అలోచించి, గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇలా ఇళ్లలో జరిగే పండుగ వీధిలోకి వచ్చింది.

గణేష్ ఉత్సవాల సమయంలో భారతీయులంతా ఏకమై.. రోడ్ల మీదకు వచ్చి పండుగ చేసుకున్నారు. పది రోజుల తరువాత వినాయక నిమజ్జనం వంటివి కూడా తిలక్ మొదలుపెట్టింది కావడం గమనార్హం. అప్పుడు మొదలైన సంబరాలు.. కాలక్రమంలో మరింత ఊపందుకున్నాయి.

బ్రిటీష్ వారిలో పుట్టిన భయం

బాల గంగాధర్ తిలక్.. గణేష్ ఉత్సవాలను ప్రారంభించినప్పుడు చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది స్వాతంత్య్ర సమరయోధులు మద్దతు లభించడంతో.. తిలక్ ముందుకు సాగిపోయారు. గణేష్ ఉత్సవాల పేరుతో.. ప్రజలంతా ఒక్క చోటుకు చేరారు. ఇది బ్రిటీష్ వారిలో ఒకింత భయం పుట్టించింది. ఇదే ఆ తరువాత ఉద్యమానికి పురుడు పోసింది.

గణేష్ ఉత్సవాల సమయంలో ప్రజలంతా గుమిగూడి.. బ్రిటీష్ వారికి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరినీ ఏకంగా చేయడానికి మాత్రమే కాకుండా.. భారత స్వాతంత్య్ర సమరానికి ఒక బీజం పడేలా చేసింది. తిలక్ కంటే ముందు.. శివాజీ మహారాజ్ కూడా గణేష్ ఉత్సవాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు

ఇప్పుడు కూడా భారతదేశంలో గణేష్ ఉత్సవాలు చాలా గొప్పగా నిర్వహిస్తారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా.. ప్రధానంగా యువకులు ఇందులో భాగస్వాములై ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకుంటారు. చిత్ర, విచిత్రమైన వినాయక ప్రతిమలకు ప్రతి రోజూ పూజలు చేసి ఆనందపడిపోతుంటారు. ఇక నిమజ్జనం వేడుకలైతే అంబరాన్ని అంటుతాయనే చెప్పాలి.

ముంబై, హైదరాబాద్ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. ఈసారి (2025) హైదరాబాద్‌లోని ఖైతారాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాగణపతి పేరుతో 69 అడుగుల మూర్తి కొలువై ఉన్నాడు. ఈ గణేష్ విగ్రహాన్ని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ గణనాధుణ్ని దర్శించుకోవడానికి ప్రతి వేలాదిమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.

నేడు గణేష్ ఉత్సవాలు అంటే భక్తి మాత్రమే కాదు, యూనిటీ కూడా. ఏ పండుగ ఎలా ఉన్నా.. వినాయక చవితి మాత్రం అందరిని కలుపుతుంది. ఇది అందరిలో ఐక్యతను పెంచే పండుగ అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద గణేష్ ఉత్సవాలు అలా వచ్చాయన్న మాట..

Leave a Comment