పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలోనే పాక్ & ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు మూతపడింది. ఈ చర్య అక్కడి నిత్యావసరాల ధరలను భారీగా పెంచేసింది. టమోటా రేటు ఐదు రెట్లు పెరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
మూతపడిన సరిహద్దులు
ఈ నెలలో (2025 అక్టోబర్) రెండు దేశాల మధ్య (పాక్ & ఆప్ఘనిస్తాన్) పోరాటం మొదలైంది. ఈ కారణంతోనే ఈ దేశాల సరిహద్దులు మూతపడ్డాయి. రెండు ఇరుగుపొరుగు దేశాలు. కాబట్టి నిత్యావసరాలు ఎగుమతి, దిగుమతులు జరిగేవి. అయితే సరిహద్దులు మూత పడటంతో ఇవన్నీ ఆగిపోయాయి. అంతే కాకుండా ఈ సరిహద్దుల వద్ద సుమారు 5000 కంటైనర్లు ఉన్నట్లు, సరైన సమయానికి సరఫరా ఆగిపోవడంతో అందులోని కూరగాయలన్నీ చెడిపోయినట్లు కొందరు చెబుతున్నారు.
స్తంభించిన వాణిజ్యం
2021లో తాలిబన్లు.. కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఈ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2600 కిమీ (1600 మైల్స్) సరిహద్దులో.. భూపోరాటం, పాకిస్తాన్ వైమానిక దాడుల తరువాత.. 2025 అక్టోబర్ 11 నుంచి సరిహద్దులు మూసేసారు. దీంతో వాణిజ్యం, రవాణా వంటివన్నీ స్తంభించిపోయాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు పాక్ – ఆఫ్ఘన్ వాణిజ్య మండలి అధిపతి ఖాన్ జాన్ ఆలోకోజాయ్ పేర్కొన్నారు.
ఒక రోజు గడిస్తే.. రెండువైపులా (పాకిస్తాన్ & ఆప్ఘనిస్తాన్) సుమారు 1 మిలియన్ డాలర్ల నష్టాన్ని చూడాల్సి వస్తోంది. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు స్తంభించిపోయాయి. వాణిజ్య పరంగా ఇవే అధికంగా ఉన్నాయని ఖాన్ జాన్ ఆలోకోజాయ్ స్పష్టం చేశారు.
400 శాతం పెరిగిన టమోటా ధరలు
ప్రత్యేకమైన టమోటాల ధరలు సుమారు 400 శాతం పెరిగాయి. దీంతో కేజీ టమోటా ధరలు పాకిస్తాన్ దేశంలో 600 పాకిస్తానీ రూపాయలకు చేరింది. అంతే కాకుండా ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే ఆపిల్స్ ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆలోకోజాయ్ స్పష్టం చేశాయి. సరిహద్దులు మూతపడటం వల్ల అక్కడ చాలా కంటైనర్లు నిలిచిపోయాయి. అందులోని కూరగాయలు, ఆహార పదార్థాలు చెడిపోయాయని ఆయన అన్నారు. ఇప్పటికే మార్కెట్లో టమోటాలకు మాత్రమే కాకుండా.. ఆపిల్, ద్రాక్ష వంటి వాటికి కూడా కొరత చాలానే ఉంది. కాబట్టి దీనిపై అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది తెలియాల్సి ఉంది.
అక్టోబర్ 25న తదుపరి చర్చలు
పాకిస్తాన్‌పై.. తమ ఉమ్మడి సరిహద్దు దాటుకుని వచ్చి దాడిచేస్తున్న ఉగ్రవాదులను కాబూల్ నియంత్రించాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేయడంతో ఈ ఘర్షణలు తలెత్తాయి. దీనిని తాలిబన్లు ఖండిస్తూ.. తాము ఆప్ఘనిస్తాన్ స్వర్గధామాల నుంచి పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా ఖతార్, టర్కీ మధ్య నిర్వహించిన చర్చల కారణంగా.. గొడవలు కొంత సద్దుమణిగాయి. అయితే వాణిజ్యం మూసివేయబడింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో.. ఈ విషయంపైనే తదుపరి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకుని.. ప్రజల ఇబ్బందులను తొలగిస్తారా? లేదా?, ధరల నియంత్రణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.