ప్రతి పేదవాడి కల.. ఇస్తున్నా హామీ: సీఎం చంద్రబాబు

ప్రతి మనిషికి జీవితంలో కూడు, గూడు, గుడ్డ చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండేలా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశానికి అన్నమయ్య జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కొంతమంది లబ్దిదారులకు కొత్త ఇళ్ల తాళాలు అందించారు. సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు.

పేదవాడి కల సాకారం కోసం..

పేదవాడు సొంత ఇల్లు ఉండాలని కలలు కంటాడు. ఆ కల నెరవేర్చుకోవడానికి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటాడు. అప్పు తీర్చడానికి చాలా ఇబ్బందులు పడతాడు. కొన్నిసార్లు అప్పు చెల్లించలేక అప్పులపాలవుతాడు. ఇలాంటి వాళ్ల కష్టం చూసిన రాష్ట్ర ప్రభుత్వం.. వారి కలను నిజం చేసే బాధ్యతను తీసుకుంది. పేదవాడి ఇల్లు కల సాకారం చేయడానికి ప్రభుత్వం సహాయం చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత అని సీఎం పేర్కొన్నారు.

ఉగాది నాటికి 5.9 లక్షల ఇల్లు!

ప్రస్తుతం మూడు లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందిస్తున్నాము. వచ్చే ఉగాది నాటికి 5.9 లక్షల గృహ ప్రవేశాలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని కూడా ఆయన అన్నారు. కొత్త ఇల్లు కావాలనుకునే లబ్ధిదారులు పేర్లు నమోదు చేసుకోండని సీఎం పేర్కొన్నారు. అంతే కాకుండా ఇద్దరు పెళ్ళైన పిల్లలు ఉంటే.. అలంటి వారికోసం రెండిళ్ళు ఇస్తామని, దానికి ఒకే గోడ ఉంటుందని, ఇలా కుటుంబాలను కలపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పుకొచ్చారు. కుటుంబాలను విడగొట్టాలని కొందరు చూస్తారు. కానీ కుటుంబాలను కలపాలనే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్న అని స్పష్టం చేశారు.

2029 నాటికి అందరికీ ఇల్లు!

కలిసుంటే కలదు సుఖం, కుటుంబం ఐకమత్యంగా ఉండాలి. మొత్తం మీద 2029 నాటికి రాష్ట్రంలోని అందరికీ (అవసరమైన వారికి) ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ బాధ్యతలను సంబంధిత మంత్రికి, ఇతర అధికారులకు అప్పగిస్తూ.. చెప్పిన సమయానికి పని పూర్తయిపోవాలని.. ఆలా అవ్వకపోతే ఊరుకునేది లేదని ఆయన గట్టిగ చెప్పారు. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోండి, దీనికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. పట్టణాల్లో కూడా వీలైనంత వరకు ఆకాంబినేట్ చేస్తామని అన్నారు. అవసరమైతే అపార్ట్మెంట్స్ నిర్మించి అందులో ఇల్లు మంజూరు చేస్తామని ఆయన తన వినూత్న ఆలోచనను వెల్లడించారు.

ఇప్పటికి అమలు చేసిన పథకాలు

చంద్రబాబు నాయుడు ముఖ్యంమత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు, అమ్మ ఒడి కింద ప్రతి బిడ్డకు డబ్బు అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.

మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కూడా.. ప్రజలకు చేరువగా ఉంటూనే తనదైన రీతిలో ప్రజాసేవ చేస్తున్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే.. విద్యారంగాన్ని కూడా బలపరచడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్నారు.