సమాజంలోని సమస్యను తెరపై చూపించేదే.. ‘సంతాన ప్రాప్తిరస్తు’

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ చిత్రం 2025 నవంబర్ 14వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ మరియు నిర్వీ ఆర్ట్స్ పతాకంపైన నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మధుర శ్రీధర్ రెడ్డి & నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, రచ్చ రవి, తాగుబోతు రమేష్ లాంటి వారందరూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కథ ఇలా..

ఇప్పటికే విడుదలయిన సినిమా ట్రైలర్ మరియు టీజర్లను బట్టి చూసినట్లయితే.. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే అబ్బాయి ఒక అమ్మాయి.. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం ఎలాగోలా.. హీరోయిన్ నాన్నకు తెలుస్తుంది. వారి ప్రేమ వివాహాన్ని ఆయన ఒప్పుకోడు, ఈ పరిస్థితుల్లో కనీసం పిల్లల్ని కంటే అయిన వారిని చూసి అయినా తల్లిదండ్రులకు, దగ్గర అవ్వచ్చు అనే ఒక సలహా తరుణ్ భాస్కర్ హీరోకి చెబుతాడు. అప్పటి నుంచి భార్య, భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఈ విషయంలో డాక్టర్‌ను కన్సల్ట్ అవుతారు. అయితే అందులో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. హీరోకి స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ కారణంగా హీరో చాలా బాధపడుతూ కనిపిస్తాడు. అయితే ఆ తర్వాత ఏమి జరుగుతుంది అనేది మనం థియేటర్లలో చూడాలి.

సంతానలేని సమస్యే కాన్సెప్ట్

హీరోకి ఉండే ఈ సమస్యల మధ్యలో వచ్చిపోయే ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉండనున్నట్టు అర్థమవుతోంది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్ వీళ్లందరి కామెడీ.. ఈ సినిమాకు ప్లస్ అవ్వనుంది. అభినవ్ గోమటం ట్రైలర్‌లో హీరో స్టోరీ చెప్పేవాడిలాగా కనిపించాడు. తరుణ్ హీరోకి స్టోరీ చెప్పమంటే అభినవ్ ఎంటర్ అయ్యి వీడియో ప్రారంభంలోనే.. దేవర కథ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా అనే డైలాగ్ బాగుంటుంది.

సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి సంబంధించిన కథ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమాజంలో ఒక పెళ్లైన జంటకు ఉన్నటువంటి సంతానలేమి సమస్యలనే డైరెక్టర్ ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఆ విషయాన్నే కాస్త ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాలనుకున్నట్టు ఉన్నాడు. దానితో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చేటట్టే అనిపిస్తుంది.

ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తోంది. మొత్తం కామెడీ స్టార్స్ ఇందులో ఉండటం కారణంగా మొత్తం నవ్వులు పండిస్తున్నారు. సొసైటీలో ఉన్న ఈ సంతాన సమస్యని ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలాగా తీర్చిదిద్దినట్టు మూవీ టీమ్ చెప్పుకొచ్చారు. కుటుంబం అంతా చూడగలిగే ఒక మంచి సమస్యని, సందేశాన్ని కలిపి రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

హీరోకి ఇది తన మొదటి చిత్రం. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్‌కు చాలా సంవత్సరాల తర్వాత నిర్మాతగా ఇది రెండో సినిమా. అయితే ఇంతకాలం ఆయన డిస్ట్రిబ్యూషన్, ఆడియో మ్యూజిక్, ఇతరత్రా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకో నిర్మాత నిర్వి హరిప్రసాద్‌కు ఇది మొదటి సినిమా. వీరందరికి సంతాన ప్రాప్తిరస్తు మూవీ సక్సెస్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.