ఇటీవల కాలంలో డీజిల్, పెట్రోల్ కార్ల కంటే కూడా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో చాలామంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త కారు కొనుగోలు చేయడానికి సాధారణంగా కొంత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు లేదా ఉపయోగించిన కారు కొనడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈ కథనంలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేవారు తప్పకుండా.. కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఎలక్ట్రిక్ కారు అంటేనే.. అది మొత్తం బ్యాటరీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్యాటరీ లైఫ్ గురించి ముందుగా ఆలోచించాలి లేదా చెక్ చేసుకోవాలి. డీజిల్ లేదా పెట్రోల్ కారు అయితే.. ఇంజిన్ జీవితకాలం కొంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉపయోగించిన ఫ్యూయెల్ కారును కొనుగోలు చేయడానికి పెద్దగా సంకోచించాల్సిన పనిలేదు. ఎలక్ట్రిక్ కారు విషయంలో మాత్రం తప్పకుండా కొంత ఆలోచించాల్సిందే.
గమనించాల్సిన విషయాలు
- బ్యాటరీ వారంటీ: ఎలక్ట్రిక్ కారు అనగానే బ్యాటరీ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఉపయోగించిన ఎలక్ట్రిక్ కారును కొనేటప్పుడు కూడా దీన్నే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కార్ల తయారీ సంస్థలు.. బ్యాటరీపై 8 సంవత్సరాలు వారంటీ అందిస్తాయి. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ వ్యారంటీ అనేది మొదటి యజమానికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఉపయోగించిన కారును కొన్న వ్యక్తి లేదా రెండో యజమానికి ఆ వారంటీ లభించదు. ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి.
- బ్యాటరీ హెల్త్ (బ్యాటరీ ఆరోగ్యం): ఎలక్ట్రిక్ కారులో ఉన్న బ్యాటరీ హెల్త్ 80 శాతం కంటే ఎక్కువ ఉంటే మంచిది. అప్పటికే ఎలక్ట్రిక్ కారును ఉపయోగించిన వ్యక్తి దానిని ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసి ఉంటే.. అది బ్యాటరీ లైఫ్ తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ కారును చెక్ చేసేటప్పుడు.. దానిని తయారు చేసిన సంవత్సరం నుంచి పరిగణలోకి తీసుకుంటే, దాని బ్యాటరీ లైఫ్ మనకు ఇట్టే అర్థమవుతుంది. మీరు ఉపయోగించిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు.. అది ఎంత రేంజ్ ఇస్తుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. కారును హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేస్తున్నారా? ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేస్తున్నారా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
- బ్యాటరీ రెంటల్: ఒకప్పుడు ఈ బ్యాటరీ రెంటల్ అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు బాస్ (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) కింద ఈ విధానం ప్రారంభించాయి. కాబట్టి కొనుగోలుదారు కారును కొనుగోలు చేసినప్పటికీ.. బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చన్నమాట. కాబట్టి మీరు ఉపయోగించిన ఎలక్ట్రిక్ కారును కొనేటప్పుడు ఈ విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. దీనివల్ల ధర కూడా చాలా తగ్గుతుంది.
పరిశీలించాల్సిన ఇతర అంశాలు
బ్యాటరీకి సంబంధించిన అంశాలను మాత్రమే కాకుండా.. కారు సర్వీస్ హిస్టరీ, డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా?, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) ఉందా?, యాక్సిలరేషన్ ఎలా ఉంది?, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఉందా?, వార్నింగ్ లైట్స్, హజార్డ్ లైట్స్ పనిచేస్తాయా?, ఇన్సూరెన్స్ ప్రీమియం ఎలాంటిది తీసుకున్నారు? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా తెలుసుకోవాలి.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.