కాలుష్యం గుప్పిట్లో ఢిల్లీ: షియోమి ఇండియా మాజీ చీఫ్ ఎక్స్‌పీరియన్స్‌

ఢిల్లీలో వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. పరిష్కారం మాత్రం అగమ్యగోచరంగా ఉంది. అక్కడి ప్రజలు గాలి కాలుష్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో షియోమి ఇండియా మాజీ చీఫ్ & టెక్ గ్రూప్ జీ42 ప్రస్తుత సీఈఓ మను కుమార్ జైన్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో పలువురిని ఆకట్టుకుంది. దీనిపై చాలామంది స్పందించారు.

కొన్ని గంటలు ఉండలేకపోయాను!

సీఈఓ కుమార్ జైన్ మాస్క్ ధరించి, విమానంలో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ఇటీవల కొన్ని సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. నేను నగరంలో ఉన్న కేవలం కొన్ని గంటల్లోనే కళ్ల నుంచి నీరు కారడం, దగ్గు, గొంతుమంట వంటివి వచ్చాయి. తేలికపాటి తలనొప్పిని కూడా భరించాను. దీనికి కారణం అక్కడి గాలి నాణ్యత సరిగ్గా లేకపోవడమే అని అర్థమైంది. నేను నా ఎన్95 మాస్క్ మర్చిపోవడం కూడా నా పరిస్థితికి ఒక కారణం అని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే.. అక్కడ గాలి కాలుష్యం తీవ్రత ఎంత ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

మీరట్‌లో పెరిగి, ఐఐటీ ఢిల్లీలో చదివాను. ఆ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడి ప్రజల అతిపెద్ద సమస్య కూడా బహుశా ఇదే అని కుమార్ జైన్ అన్నారు. విపరీతమైన గాలి కాలుష్యం కారణంగా నేను ముందుగానే ఢిల్లీ వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ సమస్యకు ఒకరే కారణం అని మనం నిందించలేమని ఆయన అన్నారు.

నెటిజన్ల రియాక్షన్

కుమార్ జైన్ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఆరోగ్యంగా ఉన్న ఒక యువకుడే.. కొన్ని గంటలు ఢిల్లీలో ఉండలేకపోతే.. ప్రతిరోజూ అదే గాలి పీలుస్తున్న పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అని ఒకరు అంటే.. గత వారంలో నాకు కూడా ఇదే అనుభవం ఢిల్లీలో కలిగిందని మరొకరు అన్నారు. అధికారులు ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం అని ఇంకొందరు చెబుతున్నారు.

”నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చాను. ఉదయం బయట వాకింగ్ చేయడానికి వెళ్తే కొన్ని గంటలు కూడా ఉండలేకపోయాను. కారులో తిరిగి ఇంటికి వచ్చాను. నా కుటుంబంపై ప్రేమతో ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది.. నా వాళ్లను భారతదేశం నుంచి తీసుకెళ్లిపోవడమే ఉత్తమం అని” నాలుగో వ్యక్తి పేర్కొన్నారు. కాలుష్యంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేకుంటే ప్రజల ఆరోగ్యం చాలా క్షిణిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో గాలి కాలుష్యం

శీతాకాలం మొదలైనప్పటి నుంచి ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువైంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రభుత్వం గాలి కాలుష్యాన్ని అరికట్టడానికి ఇప్పటికే కొన్ని పాత వాహనాల వినియోగాన్ని పూర్తిగా నిషేదించింది. కాగా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హైబ్రిడ్ విధానం అమలు చేశాయి. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ చూస్తుంటే.. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్థానిక ప్రజలు కూడా వాయు కాలుష్యం తగ్గించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయాలి. అప్పుడే దీనిని అరికట్టడం సాధ్యమవుతుంది.