బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన!

పగలు ఎండలు, రాత్రి చలి.. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా వర్షం కురిసే సమయంలో రైతులు, ప్రజలు కొంత జాగ్రత్త వహించాలని తెలియజేసింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏ జిల్లాలపై ఉండనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

తుఫాను పేరు సెన్యార్

మలక్కా జలసంధి.. దానిని అనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రపై ఏర్పడిన అల్పపీడనం.. బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు పేరు పెడితే సెన్యార్ (సింహం) అని పిలుస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఈ పేరును సమర్పించింది. అల్పపీడనం పశ్చిమ – వాయువ్య దిశలుగా కదులుతూ ఈ రోజు (నవంబర్ 24) ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం

వాయుగుండంగా మారిన తరువాత 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తరువాత ప్రతి ఆరు గంటలకు.. తుఫానుగా మారిన తరువాత ప్రతి మూడు గంటలకు బులెటిన్స్ జారీచేయనున్నట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అయితే ముందస్తు హెచ్చరికలుగా.. మత్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నవంబర్ 27 వరకు..

తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను దాటేసిన తరువాత.. పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని స్కైమెట్ అధ్యక్షుడు జీపీ శర్మ సూచించారు. అయితే ఈ మార్గాలను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని అన్నారు. నవంబర్ 27వరకు కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో 40 కిమీ నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఈ గాలి తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంటుందని సూచిస్తున్నారు.

ఈ జిల్లాలపై ప్రభావం!

భారత వాతావరణ శాఖ ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) ప్రకారం.. నెల్లూరు, వైఎస్ఆర్ కడప, తిరుపతి, చింతూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడం కూడా ప్రారంభమైంది. బహుశా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మోంథా అంత ప్రభావం చూపుతుందా?

ఇటీవల వచ్చిన మోంథా తుఫాను.. పలు రాష్ట్రాల్లో భీబత్సం సృష్టించింది. ఇప్పుడు మరోమారు తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇప్పుడు వచ్చే తుఫాను బహుశా మోంథా అంత ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచనలు జారీ చేశారు. ఒక మోస్తరు వర్షాలు పడితే.. వాతావరంలో కొంత మార్పు ఏర్పడుతుంది. తద్వారా చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రైతన్నలకు పంటలు బాగా పెరగడానికి దోహదపడే అవకాశం ఉంటుంది. ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా నైరుతి బంగాళాఖాతం, శ్రీలంకలపై ఉంటుందని చెబుతున్నారు.