తెలుగు చలన చిత్ర రంగంలో నేడు జీవమున్న మనుషుల జీవితాలను గురించి చెప్పే కథకుడు, సారవంతమైన చిత్రాలను దిద్దే దర్శకుడు వేణు ఊడుగుల. మొదటిసారి తనలాంటి ఒక కొత్త దర్శకుడి తెర వెనుక కథను తెర ముందుకు తీసుకుని రావడానికి ఒక సారథిగా, వారథిగా, నిర్మాతగా వ్యవహరించారు. ఆయన ప్రారంభించిన తన సొంత నిర్మాణ సంస్థ డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజు వెడ్స్ రాంబాయి అనే ఒక అద్భుతమైన, స్వచ్ఛమైన పల్లెటూరు ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.
దూసుకెళ్తున్న రాజు వెడ్స్ రాంబాయి..
వేణు ఊడుగుల తన దర్శకత్వంలో రెండు సినిమాలు తీశాడు. నాది నీది ఒకే కథ (శ్రీ విష్ణు), విరాటపర్వం (రానా, సాయిపల్లవి). ఆయన సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడో తెలియాలంటే ఈ రెండు సినిమాలు చాలు. అయితే ఈ చిత్రాల తరువాత చాలా సమయం తీసుకుని ఈటీవీ విన్ సంస్థ కారణంగా నిర్మాతగా మారాడు. వీరితో పాటు మాన్సూన్ లైట్స్ సహకారంతో తన సంస్థ డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్‌లో.. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీసి విజయం సాధించాడు. తెలుగు ప్రేక్షకులు వేణుని అతి గొప్ప తమిళ దర్శకుడు పా. రంజిత్తో పోలుస్తున్నారు. ఆయన లాగా తాను కూడా మంచి రూటెడ్ కథలు చెప్పాలని ఆశపడుతున్నారు.
యదార్థ జీవితాల ఆధారంగా..
చాలా చిన్న చిత్రంగా ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన.. రాజు వెడ్స్ రాంబాయి రోజు రోజుకి థియేటర్ స్క్రీన్‌లు పెంచుకుంటూ అత్యంత ప్రేక్షకాదరణతో నేటికీ కొనసాగుతున్నది. ఈ మూవీ ద్వారా కొత్త దర్శకుడిని సాయిలు కంపాటి అనే వ్యక్తిని కూడ.. వేణు ఊడుగుల తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అతను తనకు తెలిసిన, తన చుట్టుపక్కల ఊరిలో జరిగిన కొన్ని యదార్థ జీవితాలని ఆధారంగా చేసుకొని సరికొత్త పద్ధతిలో కథను చెప్పాడు. ఇది ఇప్పటి వరకు ఏ పత్రికలోను, ఏ ఛానెల్లోను రాలేదు. ప్రపంచానికి అస్సలు తెలియని ఒక సంఘటనను తనదైన శైలిలో లోకానికి తెలియజేసి అందరి మన్ననలు పొందుతున్నాడు.
ట్రెండింగ్‌లో ఇవే..
మిట్టపల్లి సురేంద్ర ఈ సినిమాకి అన్ని పాటలు రాశారు. కానీ అందులో ఈ “రాజ్యమేది లేదు గానీ రాణిలాగా చూసుకుంటా, కోటలన్నీ కట్టలేను కళ్లలో నిన్నే దాచుకుంటా, రాత ఎట్ల రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా సొర్గమంటూ ఏమిటున్నా ప్రతి రోజు నీతోనే పంచుకుంటా” అని సాగే ఈ పాట మాత్రం ప్రచారంలో హైలెట్ అనే చెప్పాలి. రాంబాబు నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిను వీడిపోని నీడైతనే.. అంటూ ఎక్కడ చూసినా మారుమోగుతున్నది. ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం కూడా అంతే బలంగా, హృద్యంగా, శ్రావ్యంగా వాయించాడనే చెప్పాలి.
చరిత్రలో మరుగున పడిన జీవితాలను తెరపైకి!
తెలుగు చలన చిత్ర రంగంలో కేవలం ఓకే రకమైన భావజాలంతో, కొన్ని వర్గాల ప్రజల జీవన విధానాన్నే కథలుగా, సినిమాలుగా తీస్తువస్తున్నారు. కొందరి అలవాట్లు, సంస్కృతి మాత్రమే ఇక్కడ గొప్పవిగా చూపించడం జరుగుతోంది. అయితే.. రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ సంధర్బంగా.. మూవీ టీమ్ అనేక ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ.. డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ చరిత్రలో మరుగున పడిన జీవితాలను, ఇప్పటి వరకు తెలుగు సినిమా చెప్పని కథలను చెబుతుందని, మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో చూపించే సంస్కృతే ఆ ప్రాంతం కల్చర్‌గా చలామణి అవుతుంటుంది. అదే ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇండియాలో కూడా అదే జరుగుతోంది.
పల్లెటూరు అంటే కేవలం గోదావరి, పెద్ద పెద్ద బంగళాలు ఇలాంటివే ఉంటాయి. అలా చూపించడం తప్పేమి కాదు. కానీ సినిమా అంటే అన్ని కులాల, మతాల, జీవితాలను కూడా కథలుగా చెప్పినప్పుడే భిన్నత్వంలో ఏకత్వం ఏర్పడుతుందని, అప్పుడే సినిమా ఇండస్ట్రీ వికసిస్తుంది, ఎదుగుతుంది అని చెప్పుకొచ్చారు. అందుకే తమిళ, మలయాళ సినిమాలు వాస్తవానికి బాగా దగ్గరగా, సహజంగా ఉంటాయని అన్నారు. డోలాముఖి సంస్థ కూడా అలాంటి కథలే చెబుతుందని అన్నారు.
మంచి సినిమా ఖచ్చితంగా ఆడుతుంది!
రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా నడుస్తోంది. ఒక మంచి సినిమాను ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. ఇలాంటి మూవీకి ఆర్థికంగా ప్రోత్సహం అందివ్వగలిగితే భవిష్యత్తులో మరిన్ని కొత్త కథలు, దర్శకులు ముందుకు వస్తారు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.