బీమా కవచ్ & ప్రొటెక్షన్ ప్లస్: ఈ కొత్త ఎల్ఐసీ స్కీమ్స్ గురించి తెలుసా?

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఇప్పటికే అనేక స్కీమ్స్ అందిస్తూ.. ప్రజలకు ఉపయోగకారిగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు కొత్త బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఈ రెండు కొత్త పథకాలు ఏవి?, వీటివల్ల ఉపయోగాలేమిటి?, అనే ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కొత్త స్కీమ్స్

  • ఎల్ఐసీ బీమా కవచ్
  • ఎల్ఐసీ ప్రొటక్షన్ ప్లస్

ఎల్ఐసీ బీమా కవచ్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన కొత్త ప్లాన్లలో ఎల్ఐసీ బీమా కవచ్ ఒకటి. ఇది ప్యూర్ రిస్క్ కవరేజ్ అందించే నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీదారు అనుకోని సంఘటన వల్ల ప్రాణాలు కోల్పోతే.. అతని కుటుంబానికి ఆర్ధిక భద్రతను కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి బోనస్, లాభాలు లభించవు. తక్కువ ప్రీమియం చెల్లిస్తూ.. కొంత అధిక బీమా పొందవచ్చు. తమ తరువాత.. కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించాలని కోరుకునేవారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భారతీయులందరూ దీనికి అర్హులు. నిర్ణీత వయసు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ పాలసీకి స్టాక్ మార్కెట్లకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఇది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి మీ క్లైమ్ మీరు తప్పకుండా పొందవచ్చు.

ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రవేశపెట్టిన మరో కొత్త స్కీమ్.. ఈ ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్. ఇది నాన్ పార్టిసిపేటింగ్ అండ్ లింక్డ్ సేవింగ్స్ ప్లాన్. దీనిని ప్రత్యేకించి.. ఇండ్యూజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసమే తీసుకొచ్చారు. పేరుకు తగిన విధంగానే.. ఇది లైఫ్ + సేవింగ్స్ పాలసీ. అంటే ఇది కేవలం బీమా మాత్రమే కాదు. పెట్టుబడికి కూడా సరైన పాలసీ.

పాలసీ టర్మ్ పూర్తయినప్పుడు.. పాలసీ మెచ్యురిటీపై, మీరు చెల్లించిన ప్రీమియం అందిస్తారు. పాలసీదారు కన్నుమూసిన తరువాత కూడా నామినీకి పాలసీ డబ్బును అందిస్తారు. 18 సంవత్సరాలు నిండిన భారతీయులు ఎవరైనా ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు. ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా.. కుటుంబానికి కూడా భద్రత కల్పిస్తుంది.

అక్టోబర్ నెలలో రెండు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రవేశపెట్టిన పైన చెప్పిన రెండు ప్లాన్స్ 2025 డిసెంబర్ 3 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. కాగా 2025 అక్టోబర్ 14న జరిగిన ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో ఎల్ఐసీ బీమా లక్ష్మి, ఎల్ఐసీ జన్ సురక్ష అనే రెండు కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఇవి రెండూ ప్రత్యేకించి వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి రూపొందించాయి.

ఎల్ఐసీ క్యూ2 ఫలితాలు

2025 సెప్టెంబర్ 30న ముగిసిన రెండో త్రైమాసికంలో.. ఎల్ఐసీ నికర లాభం 31 శాతం పెరిగి 10098 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతమందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 7729 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి చూస్తే.. ఈ ఏడాది ఎల్ఐసీ మంచి లాభాలను పొందిందని స్పష్టంగా అర్థమవుతోంది.