ప్రపంచంలో ఎంతోమంది జన్మిస్తారు.. కానీ సమాజంలో కొంతమంది మాత్రమే తాము ఎంచుకున్న రంగంలో సరికొత్తగా తమదైన పంథాలో జీవిస్తారు. అటువంటి వ్యక్తులు అప్పటి వరకు ఉన్న కట్టుబాట్లని, మూసపద్ధతులని, సంఘం బిగించిన బంధనాలని బద్దలుకొట్టుకొని మరఫిరంగుళ్లాగా బయటకొస్తారు. నూతన సామాజిక, రాజకీయ విప్లవాత్మక బాటలు వేస్తారు, గతిని మార్చి చరిత్రని తిరగరాస్తారు. అణచివేతలని, అవమానాలని భరించినవాళ్లే వాటిని త్యజించగలరు, అసమానతల నిచ్చెనమెట్ల విష సంస్కృతిని అనుభవించినవారే దానిని ధిక్కరించగలరు, అటువంటి వారే అజ్ఞానపు అంధకారంపై జ్ఞాన దీపాలను వెలిగిస్తారు. రాబోయే తరాల అధైర్యపు అనుమానాలను తొలగించి సాహసోపేతమైన ఆలోచనల ఉదయకాలపు నిప్పుకనికల్ని రగిలిస్తారు, దిక్సూచిలై ప్రసవిస్తారు. ఆ కోవలో పుట్టుకొచ్చినవాడే ప్రపంచం గర్వించదగ్గ భారతదేశ దిగ్గజ దర్శక, నిర్మాత పా. రంజిత్. ఈ రోజు దేశ చలన చిత్ర రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన రెవెల్యూషనరీ ఫిలిం డైరెక్టర్ పా. రంజిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
డైరెక్టర్‌గా పా. రంజిత్ సినిమాలు
- అట్టకత్తి
- మద్రాస్
- కబాలి
- కాలా
- సార్పట్టా (పరంపర)
- నచ్చతిరం నగర్ గిరతు
- దమ్మం (వెబ్ సిరీస్)
- తంగలాన్
- వెట్టువమ్ (చిత్రీకరణ దశలో ఉంది)
నిర్మాతగా పా.రంజిత్ సినిమాలు
- పరియేరుమ్ పెరుమాళ్
- ఇరండం ఉలగపోరిన్ కడైసి గుండు
- రైటర్
- బ్లూ స్టార్
- బాటిల్ రాధ
- సెతత్తుమాన్
- బొమ్మై నాయగీ
- కుత్తిరైవాల్
- నచ్చితరం నగరిగరదు
- జే. బేబీ
- పాపా బుకా
- తండకారణ్యం
- బైసన్ (కాలమాడన్) తదితర చిత్రాలను కొన్ని సొంతంగా, మరికొన్ని సంయుక్తంగా నిర్మించారు.
సొంత నిర్మాణ సంస్థ & కొన్ని ఆర్గనైజషన్స్
- నీలం స్టూడియోస్
- నీలం సోషల్ (ఛానెల్)
- క్యాస్ట్లెస్ కలెక్టివ్ వాయిస్
- నీలం కల్చరల్ సెంటర్
- వానమ్ ఆర్ట్ ఫెస్టివల్ లాంటి వాటిని రంజిత్ నడిపిస్తున్నాడు.
మద్రాస్ సినిమాతో గుర్తింపు
పా. రంజిత్.. 2012 సంవత్సరంలో మెయిన్ డైరెక్టర్‌గా అట్టకత్తి అనే చిత్రంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అయితే అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేశారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఆ తరువాత కార్తీ, కేథరిన్, కళయరసన్లతో “మద్రాస్” అనే చిత్రం తీసి అందరి కళ్లలో పడ్డారు.
చెన్నై సిటిలోని ఒక కాలనీలో ఒకరి ఏరియాలో ఇంకొక రాజకీయ నాయకునికి చెందిన నాయకుల ముఖ చిత్రాలను ఒక గోడపైన ఉంచడంతో రెండు వర్గాల మధ్యలో వైషమ్యాలు, గొడవలు దగ్గర నుంచి చివరికి ఒకరిని ఒకరు హత్యలు చేసుకునేంత తారాస్థాయికి వెళ్తారు. ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా మద్రాస్ సినిమా తీశాడు. ఆ తరువాత అతను వెనక్కితిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆ చిత్రం అంతటి గుర్తింపుని తీసుకొచ్చింది.
రజనీ కాంత్ మెచ్చిన డైరెక్టర్
ఇది చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రజనీకాంతే పా.రంజిత్‌ను తన ఇంటికి పిలిపించుకోని మంచి కథ ఉంటే చెప్పు నీతో సినిమా చేయాలనుంది అని అడిగేదాకా ఎదిగాడు. తాను తీసిన సినిమాతో సూపర్ స్టార్‌ను మెప్పించాడు. దాంతో ఆ తరువాత కబాలి అనే సినిమాను రంజిత్, రజినీకాంత్‌తో తీశాడు. ఆ చిత్రం రజనీ జీవితంలో అప్పటి వరకు ఎప్పుడు లేని కొత్త లుక్, స్టైల్ ఆఫ్ యాక్షన్, డైలాగ్ మాడ్యులేషన్ అన్నీ కూడా యువతలో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. సంతోష్ నారాయణ్ అనే సంగీత దర్శకుడితో ర్యాప్ మ్యూజిక్ ఇలా అన్నీ రకాలుగా ఇండస్ట్రీనే కొత్తపుంతలు తొక్కించాడు రంజిత్. కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంటూనే సోషల్ ఇష్యూని కూడా మేళవించి చెప్పాడు.
దీంతో వెంటనే రాజనీకాంత్, పా. రంజిత్ కాంబినేషన్‌లో మరొక్క సినిమా ప్రకటించారు అదే కాలా. సామాజిక, రాజకీయ ఐడియాలజితో తీశారు. ముంబైలోని స్లమ్ ఏరియా ధారావి అనే ప్రాంతాన్ని, అక్కడ ప్రజల జీవన స్థితిగతుల్ని, పేదరికాన్ని, మత రాజకీయ నాయకులు చూపించే అణచివేతలని, వివక్షని చూపించారు. ఒక మతతత్వ పార్టీ రాజకీయ నాయకుడు (నానాపటెకర్) పేద జనం జీవించే స్లం ఏరియాను ఆ ప్రజలనుంచి బలవంతంగా లాక్కొవాలని చూస్తాడు, అయితే కాలా (రాజనీకాంత్) ఆ ప్రజలకు అండగా ఉండి దీనిని అడ్డుకుంటుంటాడు. ఇందులో ప్రతి సన్నివేశం అద్భుతంగా చూపించాడు రంజిత్. డ్రావిడ, కామ్యూనిస్ట్, దళిత్, కాషాయ రాజకీయాన్ని తనదైన శైలిలో తీశాడు. అప్పటికే తన సినిమాల ద్వారా రంజిత్ ఏం చెప్పదల్చుకున్నాడో పూర్తిగా అర్థమైపోయింది.
విక్రమ్‌తో తంగలాన్
తరువాత వచ్చిన సినిమాలు సార్పట్ట పరంపర (ఆర్య), నార్త్ చెన్నైలో బాక్సింగ్ నేపథ్యంలో సాగే కుల, సామాజిక, రాజకీయ, తిరుగుబాటుని, వివక్షని, వెనకబడిన మనుషుల అస్థిత్వ ఉద్యమాలను ఇందులో చూపించారు. తంగలాన్ (చియాన్ విక్రమ్) బ్రిటీష్ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ కోసం అప్పటి బ్రిటిష్ మరియు ఇండియా అధికారులు ఏ విధంగా దళితులను ఉపయోగించుకున్నారు. అందులో వారు ఏరకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగారం తవ్వి తీయడానికి పడ్డకష్టాలను చుపిస్తూ అందుకు ఇక్కడ ఉన్న ఈ దేశ సొంత మతం బౌద్దాన్ని, బుద్ధుడి ఆనవాళ్లను ఎలా ధ్వంసం చేశారు. ఆ స్థానంలో హిందూ మతాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అనేది స్పష్టంగా చెప్పాడు. దీని ద్వారా దళితులు, ఆదివాసులు వారి మూలాలు, చరిత్ర తెలుసుకొని తిరిగి వాటిని పునర్నిర్మించాలని తన చిత్రం ద్వారా పిలుపునిచ్చాడు. ఈ సినిమాలతో పా. రంజిత్ గౌరవం మరింత పెరిగింది.
సమాజంకోసం పా. రంజిత్ సినిమాలు
వెట్టువమ్ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. తరువాత వెంటనే ఆర్యతో సార్పట్ట -2 చేయనున్నాడు. ఇప్పటికీ వెండితెరపై చూపని కథలని, జీవితాలను, వారి త్యాగాలను అణగారిన, అణచివేయబడిన దళిత, బహుజన ప్రజల యొక్క జీవిత అస్థిత్వాన్ని, ఉనికిని, పోరాటాలను, బాధలను, ఆనందాలను, వారి చరిత్రను, భవిష్యత్తు కార్యాచరణను తన సినిమాల ద్వారా ప్రపంచానికి చెప్పదలచుకున్నాడు, అదే అతను చేస్తున్నాడు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
సంఘంలో ఉన్న వాస్తవాలను ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేయడానికి ఎంతోమంది ఉన్నారు. కానీ సమాజం ప్రయోజనం కోసం మూవీ చేయడానికి కేవలం పా.రంజిత్ వంటి దర్శకులు మాత్రమే ఉన్నారు. తను మాత్రమే అటువంటి సినిమాలు చేయడం కాకుండా తన భావజాలం కలిగిన మారీ సెల్వరాజ్ లాంటి అనేకమంది దర్శకులను, రచయితలను ఇండస్ట్రీకీ పరిచయం చేస్తూ వస్తున్నాడు. భారతదేశంలో చలన చిత్ర రంగం అంటే కేవలం కొన్ని కులాలు, వర్గాలు వరకే పరిమితం ఐయ్యుంటుంది. వారి కథలను, చరిత్రను ఈ దేశ సంస్కృతిగా చూపిస్తుంటారు. అలాంటిది మొదటిసారి పా. రంజిత్ దానిని బ్రేక్ చేసి తనదైన ముద్ర వేశాడు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయ్యాడు.
తమిళ చిత్ర పరిశ్రమకే కాక.. ఇండియా ఫిలిం ఇండస్ట్రీకే నూతన మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు చాలా వరకు అందరు సినిమాను చూసే పద్ధతులనే మార్చివేశాడు. పా. రంజిత్ ప్రత్యేకమైన అభిమాన ఘానాన్ని సృష్టించుకున్నాడు. ఇటువంటి టార్చ్ బ్యారర్ మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇంకా ఎన్నో మంచి మంచి చిత్రాలు తెరకేక్కించాలని, నిర్మించాలని, తనలాంటి వ్యక్తులను మరింతమందిని తయారు చేయాలని ఆశిస్తూ.. పా. రంజిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.