తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం అని 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఓయూ వేదికగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ డబ్బులతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న వసతి గృహాలు, రహదారులు, గ్రంధాలయం, క్రీడలకు సంబంధించిన మైదానంతో పాటు ఇతర ముఖ్యమైన స్పోర్ట్స్ కట్టడాలు, క్లాస్ రూమ్స్ వాటి భవనాలు, పరిశోధన కేంద్రాలు అన్నిటిని కూడా పూర్తిగా మార్చివేయాలని తలపెట్టారు. అత్యంత అదునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించనున్నారని తెలుస్తోంది. మొత్తంగా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకి అనుగుణంగా తయారు చేయాలనే ఉద్యేశంతో ఈ వెయ్యి కోట్ల రూపాయల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
హైదరాబాద్ వేదికగా..
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా నిర్వహించారు. దీనికి ఉస్మానియాలోని పీజీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, అధ్యాపకేతర ఉద్యోగులు & తదితర సిబ్బంది హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో ఓయూ తెలుగు అధ్యయన శాఖ (తెలుగు డిపార్ట్మెంట్) హెచ్ఓడీ స్థానం పదవి నుంచి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా నియమితులైన ప్రొఫెసర్ కాశీం కూడా ఈ సభలో ముఖ్య వ్యక్తిగా పాల్గొనడం జరిగింది.
అనర్గళంగా ఉపన్యసించే వ్యక్తి!
సాధారణంగా ప్రొ. కాశీం మంచి వాక్చాతుర్యం ఉన్న వక్త, కవి. రెండు మూడు గంటలసేపు అయినా సరే ఎక్కడ తడబడకుండా, విషయాన్ని పక్కదోవ పట్టనీయకుండా చెప్పదలచుకున్న అంశాన్ని అర్థవంతంగా, అనర్గలంగా ఉపన్యసించే అంతటి జ్ఞాన సంపత్తి కలిగినవారు. తెలివి, సమయానికి తగిన సమయస్ఫూర్తి, సమాజం పట్ల ప్రేమ, బాధ్యత, సరైన ఆలోచన, సంఘం యొక్క సమస్యల పట్ల సరైన అవగాహనతో త్వరితగతిన స్పందించగలిగే హృదయం.. ఇవన్నీ కూడా మెండుగా నిండిన మనసున్న వ్యక్తి. ఉన్నత విలువలు కలిగిన మేధావి.
గొప్ప భావజాలం ఉన్న వ్యక్తి
సహజంగా ప్రొఫెసర్ కాశీం అంబేద్కరిజం, కమ్యూనిజం భావజాలం నింపుకున్న మనిషి. అనేక విషయాలను అదే కోణం నుంచి మాట్లాడే కమ్యూనిస్ట్ & అంబేడ్కరిస్ట్. ఆయన వృత్తి ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు అధ్యయన శాఖలో పీజి విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధించే ఒక ఆచార్యుడు. ప్రస్తుతం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్. కొన్ని వందల వేల వేదికలపైన సమాజానికి ఎన్నో మంచి విషయాలను నూరిపోసిన మంచి విద్యావేత్త, ఉపన్యాసకుడు.
అయితే ఎంతటి మహోన్నత వ్యక్తి అయినా సరే ఎప్పుడో ఒకనాడు, ఎక్కడో ఒకచోట కచ్చితంగా పొరపాటు లేదా తప్పు చేస్తాడు. ఎన్నో మంచి గుణాలు కలిగిన ప్రొఫెసర్ ఖాసీం కూడా అలాంటిదే చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకి వచ్చిన సందర్బంగా ఖాసీం మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా వేదికగా దుమారం రేగాయి. సామాజిక కార్యకర్తలు, విలేకరులు, రాజకీయ నాయకులు ఆ విధంగా మాట్లాడటాన్ని తప్పుబడుతూ కొంతమంది స్నేహాపూర్వకంగా.. ఇంకొందరు కోపంతో, ప్రేమపూర్వకంగా మరికొందరు ఇలా వారివారి రీతిలో వారు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు.
ప్రొ. కాశీం ఏం మాట్లాడారంటే?
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 లేదా 30 యేండ్ల కిందట గీతమ్మని ప్రేమించాడు. కానీ ఈ మధ్య ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య అనే పేరుగల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు”. విద్యకోసం ఆయన ఇచ్చిన నిధుల కారణంగా ఏమో చదువుని బాగా అభివృద్ధి పరుస్తున్నాడు అని చెప్పే సందర్భంలో ఈ విధమైన పోలికతో చెప్పాడు. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది, వివాదానికి గురైయింది. ఇంతటి వ్యక్తిత్వం ఉన్న ప్రొఫెసర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది. ఇలాగే చాలా మంది మేధావులు కొన్ని సందర్బాలలో మాట్లాడి వారినివారే దిగజార్చుకుని కనిపించకుండా పోయారు. ఖాసీం ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఇప్పుడు దాన్ని చంపుకి ముఖ్యమంత్రికి భజన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనేకమంది సోషల్ మీడియా లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన (ప్రొ. కాశీం) పరపతికి, హోదాకి తగినవిధంగా వ్యవహారిస్తే బాగుండేది అని పలువురు మాట్లాడుతున్నారు.