వచ్చేస్తోంది కొత్త సంవత్సరం: సిద్ధమవుతున్నాయ్ ఈ కొత్త కార్లు

పెరుగుతున్న డిమాండ్.. వాహన వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దాదాపు చాలా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ ఏడాది.. లెక్కకు మించిన ఈవీలు దేశీయ విఫణిలో లాంచ్ అయ్యాయి. 2026లో లాంచ్ కావడానికి మరికొన్ని సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో అలాంటి కార్ల గురించి వివరంగా చూసేద్దాం.

టాటా సియెర్రా ఈవీ

భారతదేశంలో రూ. 11.49 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ అయిన సియెర్రా ఫ్యూయెల్ మోడల్.. ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇది 2026 మొదటి అర్ధభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది యాక్టి.ఈవీ ప్లస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. ఇది 55 కిలోవాట్, 65 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుందని చెబుతున్నారు. ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి.. కొత్త డిజైన్ పొందుతుంది. ఫీచర్లలో కూడా కొంత అప్డేట్ ఉండే అవకాశం ఉంటుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ

అర్బన్ క్రూయిజర్ కారును టయోటా ఎలక్రిక్ కారుగా లాంచ్ చేయనుంది. ఇది మారుతి సుజుకి ఈవిటారా రీ-బ్యాడ్జ్ ఇంజినీరింగ్ వెర్షన్ అని తెలుస్తోంది. కాబట్టి అర్బన్ క్రూయిజర్ ఈవీ ప్లాట్‌ఫామ్, బ్యాటరీ అన్నీ కూడా మారుతి ఈవీ మాదిరిగానే ఉంటాయి. అర్బన్ క్రూయిజర్ ఈవీ మోడల్ 2025 ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికగా కనిపించింది. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ

ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ కంపెనీ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని సంస్థ 2026 చివరి నాటికి దేశీయ విఫణిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. టాటా పంచ్ ఈవీకి ప్రత్యర్థిగా మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కారును కంపెనీ.. తమిళనాడు ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనుంది. ఇది 97 హార్స్ పవర్ లేదా 115 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే మోటార్‌లతో వచ్చే అవకాశం ఉంది. కాగా ఇది 42 కిలోవాట్, 49 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. కంపెనీ ఈ కారులో డ్యూయెల్ 10.25 ఇంచెస్ డిస్‌ప్లేలు, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో 360 డిగ్రీ కెమెరా వంటివన్నీ అందించనుంది.

మారుతి సుజుకి ఈ విటారా

ఈ విటారా కారును మారుతి సుజుకి కంపెనీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జనవరిలోనే సేల్స్ ప్రారంభమవుతాయి. ఇది రెండు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను పొందుతుంది. అవి ఒకటి 49 కిలోవాట్ బ్యాటరీ (428 కిమీ) కాగా.. రెండోది 61 కిలోవాట్ బ్యాటరీ (346 కిమీ). ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.

విన్‌ఫాస్ట్ లియో గ్రీన్ & వీఎఫ్3

వియత్నామీస్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పటికే.. భారతదేశంలో లిమో గ్రీన్ కారును ప్రదర్శించింది. అయితే దీనిని 2026 ఫిబ్రవరి నెలలో లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు.

2026 ప్రథమార్థంలో విన్‌ఫాస్ట్ కంపెనీ వీఎఫ్3 కారును లాంచ్ చేయాడానికి సిద్ధమవుతోంది. ఇది ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది 18.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 200 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాగా దీనిని కంపెనీ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్లాన్ ద్వారా విక్రయించే అవకాశం ఉందని సమాచారం.