మొబైల్ యాప్‌తో.. ఆధార్ అడ్రస్ మార్చుకోండి: సింపుల్ ప్రాసెస్ ఇదే..

భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా ముఖ్యం. చాలా విషయాల్లో లేదా లావాదేవీల్లో ఆధార్ కార్డే ఆధారం అని చెప్పాలి. అలాంటి ఈ ఆధార్ కార్డులో చిరునామా, పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటివి మార్చుకోవాలంటే.. మీసేవా కేంద్రాలకు కాళ్లరిగే వరకు తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే.. ఆన్‌లైన్‌లోనే మొబైల్ యాప్ ద్వారా చిరునామా మార్చుకోవచ్చు. ఇంతకీ ఎలా మార్చుకోవాలి?, ఎక్కడ మార్చుకోవాలి?, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే విషయాలను పూర్తిగా ఇక్కడ వివరంగా చూసేద్దామా..

యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..

యూఐడీఐఏ (యునిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) తీసుకొచ్చిన ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అడ్రస్ మార్చుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో అందుబాటులో ఉంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుని.. ఐయామ్ రెడీ విత్ మై ఆధార్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. కంటిన్యూపై క్లిక్ చేయాలి. తరువాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలి.

ఫేస్ స్కాన్ చేయండిలా..

యాప్ లాగిన్ చేసిన తరువాత చేసే ప్రాసెస్ సమయంలో ఫేస్ అథెంటికేషన్ చాలా ముఖ్యమైన అంశం. ఈ ఫేస్ స్కాన్ చేసే సమయంలో మంచి లైటింగ్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. రెండు చెవులు కనిపించాలి, కళ్లు బ్లింక్ చేస్తూ ఉండాలి. ఫేస్ స్కాన్ చేయగానే ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతారు. మళ్లీ మళ్లీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఉండాలంటే.. మీరు ఎంపిన్ సెట్ చేసుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత.. డ్యాష్ బోర్డులో మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్ ద్వారా చిరునామాను మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇతర అంశాలు (నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మొదలైనవి) అప్డేట్ చేసుకోలేము.

కావలసిన డాక్యుమెంట్స్

ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఓటర్ ఐడీ / ఈ ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్, కరెంట్ బిల్ లేదా వాటర్ బిల్, ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్ (ఫొటోతో పాటు చిరునామా ఉండాలి)లలో ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు, స్కాన్ చేసి 2ఎంబీ సైజ్ కంటే తక్కువే ఉండేలా.. జేపీజీ / పీఎన్జీ / పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. డాక్యుమెంట్ మీ పేరుమీద ఉండాలి.

ఫీజు వివరాలు

ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి రూ. 75 ఫీజును.. యూపీఐ, డెబిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. డబ్బు చెల్లించిన తరువాత సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే.. విజయవంతంగా అడ్రస్ చేంజ్ (30 రోజుల్లో) అవుతుంది.