Tuesday, January 27, 2026

మదనపల్లె కాదు.. అన్నమయ్య జిల్లానే!: కీలక మార్పులివే..

ప్రజల ఆకాంక్షల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం మూడు కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం విధితమే. మదనపల్లె, మార్కాపురం, పోలవరం ఈ ప్రాంతాలను జిల్లాలుగా ఉంటాయి అని చెప్పారు. వాటితో కలుపుకొని మొత్తం 29 జిల్లాలు కానున్నాయని ప్రచారం అయితే జరిగింది. ఆదివారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో మంత్రుల సూచనలను పరిగణలోకి తీసుకొని ముందే ప్రకటించిన జిల్లాల అంశంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

తిరుపతిలోకి… రైల్వే కోడూరు

ప్రకాశంలోకి… అద్దంకి నియోజకవర్గం
అన్నమయ్యలోనే… రాయచోటి నియోజకవర్గం
తిరుపతిలోకి… రైల్వే కోడూరు నియోజకవర్గం
కడపలోకి… రాజంపేట నియోజకవర్గం
నెల్లూరులోకి… గూడూరు

జిల్లాకు మదనపల్లె ప్రధాన కేంద్రం!

మదనపల్లెని జిల్లాగా మార్చనున్నట్టుగా చెప్పిన తరువాత ఆ ప్రాంతవాసులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఆనందాన్ని కనీసం కొన్నిరోజులు ఉండనివ్వలేదు. మదనపల్లె పేరుని జిల్లాకు పెట్టడం లేదు అని, కానీ మదనపల్లె నగరం జిల్లాకు ప్రధాన కేంద్రం (హెడ్ క్వార్టర్స్)గా ఉంటుంది అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. మదనపల్లె అని కొత్తగా ప్రకటించబడిన జిల్లా అయితే ఉండదు. ముందు ఉన్న అన్నమయ్య జిల్లా అనే పేరును అలాగే కొనసాగించునున్నారు. ఇంతకు ముందు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్ రాయచోటిని మదనపల్లెకి మార్చానున్నారు అంతే.

భౌగోళిక స్వరూపంలో మార్పు!

అయితే ఇందులో భౌగోళిక స్వరూపంలో మాత్రం భారీ మార్పులు జరిగాయి అనే చెప్పాలి. అన్నమయ్య జిల్లాలో ఇది వరకు ఉన్నటువంటి రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలు తారుమారు అయ్యాయి. రాజంపేట ప్రాంతం పక్కనే ఉన్న కడప జిల్లాలోకి వెళ్లిపోనుంది. అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కలిసిపోతుంది. రాయచోటి నియోజకవర్గం మాత్రం అన్నమయ్య జిల్లాలోనే ఉండనుంది. పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ విధమైన చేర్పులు మార్పులు కారణంగా కొత్తగా మరొక్క జిల్లాను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ముందు చెప్పిన దాని ప్రకారం పోలవరం, మార్కాపురం ఈ రెండు కొత్త జిల్లాలుగా ఏర్పడుతాయి. 29 జిల్లాలు ఉంటాయి అనుకున్న తరుణంలో మొత్తం 28 జిల్లాలకే కుదించబడింది.

తిరుపతి విషయానికి వస్తే..

ఇక తిరుపతి జిల్లా విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అలాంటి మార్పులే జరిగాయి. గూడూరుని తిరిగి నెల్లూరు జిల్లాలోకి కలిపేశారు. బాపట్లలో ఉన్న అద్దంకి నియోజకవర్గం ప్రకాశంకి వెళ్లిపోయింది. ఇంకా కొన్ని మండలాల విషయంలో కూడా చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి. మొత్తంగా అన్నమయ్య (మదనపల్లె హెడ్ క్వార్టర్స్), మార్కాపురం, రంపచోడవరంతో కలుపుకొని 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరగనుంది. ఆ మేరకు కాబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తున్నది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా జనవరి 01, 2026 నుంచి అమలులోనికి రానున్నాయి.

కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే

అయితే రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోటి జిల్లాగా ఉండాలన్న వారి కోరికలు ఆవిరవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కూడా క్యాబినెట్ సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల ఇష్టం ప్రకారం & సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా, కేవలం ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయడం కుదరదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీకున్నామని అధిష్టానం నచ్చచెప్పినట్టు సమాచారం.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles