ఈ రోజు ప్రపంచం అంతా కూడా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్నది. క్యాలెండర్ ప్రకారం.. 2025 డిసెంబర్ 31వ తేదీతో ఏడాది ముగిసిపోయి 2026 జనవరి 01తో కొత్త సంవత్సరం ప్రారంభం అయింది. భారతదేశంలో కూడా ప్రతి ఏటా పాఠశాలలకు, కళాశాళలకు, కొన్ని చోట్ల కార్పొరేట్ & ప్రభుత్వ సంస్థలు కూడా సెలవులు ప్రకటించి, కొంతమంది వ్యక్తిగతంగా సెలవు పెట్టి ఆ రోజంతా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ప్రేమికులతో, తోటి ఉద్యోగులతో, ఉద్యానవనాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, బీచ్‌లు తిరిగేస్తారు. ఇంకొందరు ఇతర పర్యాటక ప్రాంతాల దగ్గర.. కేక్స్ కట్ చేస్తూ, టపాసులు పేలుస్తూ, విపరీతంగా మద్యం సేవిస్తూ, అర్థరాత్రి వరకు మేలుకుని వీధుల్లో విచిత్రమైన అరుపులు, కేకలతో బైక్ రైడ్స్ పేరుతో వీరంగం సృష్టిస్తుంటారు. మరికొంత మంది గుడులు, చర్చిల వద్ద పూజలు, ప్రార్థనలతో కిక్కిరిసిపోయి ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు న్యూ ఇయర్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటుంటారు.
..అయితే నూతన సంవత్సరం యొక్క ఉద్యేశం ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, ఎలా మొదలయింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నూతన సంవత్సర చరిత్ర..
జనవరిలో నూతన సంవత్సరాన్ని వేడుకగా జరుపుకోవడం అనే సంప్రదాయం.. పాశ్చాత్య దేశాల నుంచి వలస వచ్చింది. దీని యొక్క చరిత్రలోకి తొంగిచూస్తే సాధారణంగా మొదటగా దాదాపు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల అప్పుడు బాబిలియోన్లు అనే వారు అఖితు అనే పండుగ పేరుతో పడుకొండు రోజుల పాటు నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారంట. అయితే దాని ఉద్యేశం మంచిగా వ్యవసాయ పంటలు పండటం ఇంకా పాలనపరమైన బాధ్యతలు మారడం, సృష్టిలో ఉన్న ప్రకృతి మరియు మనిషి మధ్య ఒక బలమైన సత్సంబంధాన్ని సూచించేదిగా ఉండటమే.
ఇంకా చెప్పుకుంటే ఈజిప్ట్ ప్రాంతంలో అయితే నైలు నది పొంగడం వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభం అయినట్టుగా భావించేవారు. చైనా దేశస్తులకు మాత్రం నేటికీ జనవరి ఒకటితో సంబంధం లేకుండానే చంద్ర అనే ఒక క్యాలెండర్ బట్టి నూతన సంవత్సరాన్ని వేడుక చేసుకునే సాంప్రదాయం ఉంది. ఆధునిక కాలానికి వచ్చేసరికి భారతదేశంలో అయితే.. ఒక్కో చోట ఒక్కో రకమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. తెలుగులో ఉగాది, మహారాష్ట్రలో గుడిపడవ, పంజాబ్ రాష్ట్రంలో అయితే వైశాఖి, అదే తమిళనాడులో అయితే పొంగల్ అనే పేరుతో వారి వారి కాలాలకి ప్రాంతాలకి అనుగుణంగా ఆ యొక్క పండుగలను కొత్త సంవత్సరంగా భావిస్తున్నారు.
జనవరి ఒకటి న్యూ ఇయర్ ఎలా అయింది?
మనకి రోమ్ నుంచి ఈ జనవరి ఒకటికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం 46వ సంవత్సరంలో జానూస్ అనే ఒక దేవుడి పేరుతో జనవరి 01 క్యాలెండర్ మొదలయినట్టు చెబుతారు. అయితే ఆ తరువాత జానూస్ అనేదే జనవరిగా రూపాంతరం చెందినట్టుగా తెలుస్తోంది. అందులో చాలా తప్పిదాలు ఉండటం కారణంగా అది కొనసాగాలేక పోయింది.
అయితే అందులో కొన్ని చిన్న చిన్న మార్పులతో పూర్తిగా ఒక పరిపక్వత చెందిన క్యాలెండర్ రూపొందించుకున్నారు. అది మాత్రం క్రీస్తు శకం1582 సంవత్సరంలో పోప్ గ్రిగోరి అనే వ్యక్తి తన పేరు వచ్చేలాగా ఒక క్యాలెండర్ తీసుకొచ్చాడు. నేడు ప్రపంచం అంతా కూడా ఉపయోగిస్తున్న లేదా అనుసరిస్తున్న క్యాలెండర్ అతను ప్రెవేశపెట్టిందే. బ్రిటిషర్స్ వ్యాపారాల నిమిత్తం అనేక దేశాలు తిరగడం వలన వారి దగ్గర ఉన్న తేదీల పట్టికను అనుసరించే వారు. దాని ప్రకారమే ఎక్కడికైనా వెళ్లడం, ఏదైనా చేయడం అనేది జరిగేది. మిగిలిన దేశాల్లో ఉన్న వారికి బ్రిటీష్ వాళ్లతో వాణిజ్య సంబంధాలు ఏర్పారుచుకోవాలంటే వారి క్యాలెండర్ తప్పనిసరి అయ్యింది. ఆ సమయంలో అనేక దేశాలు వాళ్ల ఏలుబడిలో ఉండేటివి కాబట్టి పరిపాలన కార్యకలాపాలు అన్నీ కూడా వారి క్యాలెండర్ ప్రకారమే జరిగేవి. ఈ వలసల మూలాన అన్నీ చోట్లా అదే క్యాలెండర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. నేడు విశ్వామంతా అదే దిక్కయింది.
ఒక్కరోజుతో అంతా మారిపోతుందా?
జానూస్ అనే దేవున్ని గతం మరియు భవిష్యత్తుకు సంబంధించిన వ్యక్తిగా భావిస్తారు. కొత్త సంవత్సరం అనేది అక్కడ నుంచి మొదలై ప్రకృతి, రుతువులు, కాలాలు, ఖాగోళ శాస్త్రం వీటన్నింటి ఆధారంగా మనుషుల జీవితాల్లో పాత రోజులు పోయి కొత్త జీవితం ప్రారంభం అయినట్టుగా భావించి దానిని వేడుక చేసుకోవడం ఆచారంగా, సాంప్రదాయంగా వచ్చింది. అయితే క్యాలెండర్‌లో అంకెలు మారగానే మనుషుల్లో మార్పులు సంభవిస్తాయా..? గడిచిపోయిన కాలమంతా మళ్ళీ తిరిగి ముందుకు వస్తుందా..? రోజంతా చేసే పనుల్లో, పాటించే పద్ధతుల్లో, అవలంబించే విధానాల్లో ఉన్నట్టుండి నూతన ఒరవళ్లు ఊడిపడతాయా..? నిన్నటి వరకు మనుషుల మనసుల్లో, జీవితాల్లో ఉన్న డబ్బులేనితనం, ఎక్కువ.. తక్కువ అనే తేడాలు, కుల, మతాల వివక్షలు, చిన్నపెద్ద అనే తేడాలు, ఉన్నోడు.. లేనోడు అనే వర్గాలు, వైషమ్యాలు, కోపాలు, ద్వేషాలు, ఇవన్నీ ఒక్కరోజులో మారిపోతాయా..? వయసు మళ్లీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందా?, ఇవేవి పొరపాటున కూడా జరగవు.
అంకెలు మారినంత మాత్రాన ఎవరి జీవితాల్లో ఏ మార్పులు దరిచేరవు. వర్తమానంలో చెయ్యాల్సినవి చేయకుండా భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అనుకోవడం తప్పా.. మరొక్కటి లేదు. మనలో మార్పు రానంత వరకు ఏది మారదు. మారబోయే సంవత్సరం మనల్ని మార్చదు. కొత్తగా ఏదో మారుతుందనే భ్రమలో అనవసరంగా రాత్రుళ్లు మేలుకోవడం, వేడుకలు పేరుతో కొత్త బట్టలు, బీచ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, సినిమాలు, గిఫ్ట్స్, గ్రీటింగులు, గుడులు, చర్చిల పేరుతో లేనిపోని అనవసరమైన ఖర్చులు పెట్టడం, టపాసులు పేల్చి.. కేకలు, అరుపులు పెట్టి ప్రశాంత వాతావరణాన్ని కాలుష్యం చేయడం, ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం.
ఇదంతా వ్యాపారంగా మారిపోయింది!
ఇవేవి కూడా కొత్త జీవితాలకు నాంది పలకవు. ప్రకృతితో సంతోషంగా ఆరంభం అయ్యి.. ఇప్పుడు ఇదంతా కొన్ని వేల కోట్ల వ్యాపారంగా మారిపోయింది, కానీ కొత్తదనం ఏమి ఉండదు. ఇక్కడ ప్రతి రోజు ప్రతి క్షణం బతుకు ఒడిదుడుకులకు లోనవుతుంటుంది. కాబట్టి పరిస్థితులను బట్టి జీవితాన్ని చక్కదిద్దుకుంటూ వెళ్లాలి. జీవితంలో మనకు మనంగా మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి, ‘ఒక క్యాలెండర్ బతుకు మార్చదు, మన క్యారెక్టర్ మనల్ని మారుస్తుంది’. మనం చేసే పనిలో నిజాయితిగా మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది. మన ఎదుగుదలకు కారణం అవుతుంది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.