రాయలసీమ స్పెషల్: రాగి సంగటిలోకి.. లొట్టలేసుకుని తినే కమ్మటి ఎర్రకారం

‘నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరుగదు’ అనేది తెలుగులో ఒక సామెత. అది వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు లోకంలో జనం అంతా కూడా ఆ సామెతకు విరుద్ధంగా నడుస్తున్నారు. ఉత్త అన్నంలో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని పిసికి తిన్న రోజులు దగ్గర నుంచి ఏం పదార్థం తిన్నా, ఏం వంట చేసిన అందులో రుచి ఉందా లేదా చూసి నచ్చితే తినడం.. లేకుంటే వదిలేయడం వరకు వచ్చారు. నాలుకకు నచ్చడం కోసం తెలిసినవి తెలియనివి రెసిపీల పేరుతో మసాలా దినుసులన్నీ తెచ్చుకుని వండుకుంటున్నారు. అది బాగలేకపోతే బయట వెళుతున్నారు లేదంటే ఇంట్లోనే ఉంటూ సులువుగా బయట నుంచి తెప్పించుకుని అవి తమ ఒంటికి పడతాయా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా పిజ్జాలని, బర్గర్లు, ఫ్రయిడ్ రైస్, చాట్ మసాలాలు ఇలా రుచులు కోసమని ఇంకా ఏవేవో తింటున్నారు.

రాయలసీమ స్పెషల్

పాతకాలపు & మన పెద్దలకాలం నాటి రుచులతో పాటు ఆరోగ్యం కూడా కలిగిన తిండి చాలా వరకు కనుమరుగైంది. ఊరికి దూరంగా ఉండటం వలన ఇప్పటి యువత పూర్తిగా మర్చిపోతున్నారు. అందుకే ఇప్పుడు రుచి, ఆరోగ్యం రెండు ఉన్న ఎర్రకారం అనే ఒక రెసిపీ గురించి చెప్పుకుందాం.

రాయలసీమ ప్రాంతం వాళ్లకి దీని గురించి బాగా తెలిసే అవకాశం ఉంటుంది. రాగిపిండి పోసి వేడి వేడిగా ఒక ముద్ద సంగటి కలుక్కుని అందులో ఈ కారం ఊరిబిండి ఏసుకొని తింటే కమ్మగా, కారంగా, కాస్త పుల్లగా ఆహా అమృతం అనుకోండి. ఇప్పుడు దానిని ఎలా చేసుకోవాలి, అందుకు ఏమేమి కావాలో చూద్దాం..

కారం తయారీకి కావలసిన పదార్థాలు..

● జీలకర్ర
● ఎండు మిరపకాయలు
● కరివేపాకు
● పాత చింతపండు
● ఉప్పు
● ఎర్ర గడ్డలు (ఉల్లి)
● తెల్ల గడ్డలు (వెల్లుల్లి)
● కొత్తిమీర
(అన్ని పదార్ధాలు కూడా మీకు సరిపోయే మొతాదులో తీసుకోవాలి)

తయారు చేసుకునే విధానం..

▸ముందుగా ఒక కూర గిన్నెలో నీళ్లు పోసి పాత చింతకాయను కాసేపు నానబెట్టుకోవాలి.
▸చింతకాయ మీరు తినేదాన్ని బట్టి.. పుల్లగా ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా సరిపోయేంత నానబెట్టుకోవచ్చును.
▸ఎండు మిరపకాయలను పెనుములో కొంచం దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది.
▸తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు (కోసి పెట్టుకోవాలి) పైనున్న పొట్టు తీసి ముందుగానే సిద్ధం చేసిపెట్టుకోవాలి.
▸కారం తయారు చేసుకునే రోలుని శుభ్రంగా ఒక చెంబుడు మంచి నీళ్లతో కడుక్కోవాలి.
▸ఆ తరువాత మనం తీసుకున్న పదార్ధాలు నూరుకోవడానికి ఉపయోగించే బడి (కొయ్య)ని కూడా శుభ్రపరుచుకోవాలి.
▸ముందు నుంచి వాడుతున్న పాత పద్ధతి ఇప్పటికీ చాలా పల్లె ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. సిటీలో అయితే మనకు రాళ్లతో తయారు చేసిన చిన్న చిన్న రోళ్లు దొరుకుతాయి వాటిలో అయినా చేసుకోవచ్చు.
▸రోళ్లు దొరకకపోతే మిక్సీ జార్‌లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు.
▸జీలకర్రని ముందుగా రొటీలో వేసి బాగా నున్నగా దంచుకోవాలి.
▸వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి పొడిపొడి అయ్యే వరకు దంచాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లుపోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి.
▸తరువాత కరివేపాకు వేసుకోవాలి.
▸ముందుగా నీళ్లలో నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు తీసుకొని.. కారంలో వేసి బాగా చింతపండు మెదిగేలాగా నూరుకోవాలి.
▸ఇక తెల్లగడ్డలు వేసి దంచుకొని, తరువాత కోసిపెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి సగం సగం దంచుకోవాలి ఎందుకంటే తినే మధ్యలో నంజుకోవడానికి బాగుంటాయి.
▸కొత్తిమీర కొంచం వేసుకొని ఊరికే అలా దంచి రోటీలో నుంచి తీసేసుకోవాలి. అంతే ఎర్రకారం సిద్దమైనట్టే.
▸తయారు చేసిన కారాన్ని గట్టిగా లేదా నీళ్లలో కలుపుకొని అయినా వేడివేడి సంగటిలో అద్దుకుని తినొచ్చు.
▸కారాన్ని రోటీలో నూరితే వచ్చే రుచి వేరు, మిక్సీలో తయారు చేసినప్పుడు రుచి వేరు. అది మీ వీలును బట్టి చేసుకోవచ్చు.

ఈ ఎర్రకారాన్ని చాలా సులువుగా మన ఇంటిలో చేసుకునే రెసిపి. ఇది ఏ వంటా రానివాళ్లు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోటికి కారం తగలాలి, కాస్త రుచి, ఆరోగ్యం కావాలనుకుంటే ఈ ఎర్రకారం (కొన్ని ప్రాంతాల్లో చింతకాయ పచ్చడి అని కూడా అంటారు) చేసుకోవచ్చు.