Tuesday, January 27, 2026

గుంటూరులో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు: హైలెట్స్ ఇవే!

తెలుగు.. కేవలం ఒక భాష కాదు. పురాణాలు, గ్రంధాలు, శాసనాలు ఇలా తవ్వుకుంటూ పోతే దీనికి ఓ పెద్ద చరిత్రే ఉంది. విదేశీయులు సైతం కొనియాడిన భాష. రాజుల చేత కీర్తించబడిన బాష. కానీ నేడు ఈ భాష కనుమరుగైపోతోంది. చాలామంది తెలుగులో మాట్లాడితే నామోషీగా ఇబ్బందిపడుతున్న రోజుల్లో బతుకుతున్నాం. అయితే ప్రభత్వాలు మాత్రం అప్పుడప్పుడు తెలుగు మహాసభల పేరుతో.. పెద్దపెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు మొదలయ్యాయి.

జనవరి 3న గుంటూరులో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు.. మూడు రోజులపాటు, అంటే 5వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భాషాభిమానులు హాజరయ్యాయి. ఈ జాబితాలో గజల్ శ్రీనివాస్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీనరసింహ, ఆంధ్రప్రదేశ్ శాసన సభాధిపతి అయ్యన్నపాత్రుడు, జేడీ లక్ష్మి నారాయణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మొదలైనవారు పాల్గొన్నారు.

పాటతో ప్రారంభమైన సభ

గజల్ శ్రీనివాస్ తన పాటతో తెలుగు భాషాభిమానులు అలరింపచేయగా.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి, తెలుగు భాష గొప్పదనం గురించి వివరిస్తూ.. ఇంత పెద్ద తెలుగు మహాసభలు జరుగుతాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. భాష కేవలం భావాలను తెలియజేయడానికి మాత్రమే కాదు, ఒక ప్రపంచాన్ని సృష్టించగలదని అన్నారు. మన భాషవల్ల మనకు ఒక గుర్తింపు ఉంది. అధికారిక కార్యకలాపాలను తెలుగులోనే జరపాలి. జిల్లా స్థాయి కోర్టుల వరకు తమ కార్యకలాపాలను తెలుగులోనే ఉండేలా చూసుకోవాలని అన్నారు.

జేడీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా జేడీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానం ప్రకారం 5వ తరగతి వరకు తప్పకుండా మాతృభాషలోనే చదవాలి. మాతృ భాష వచ్చినప్పుడే.. మనం ఇతర భాషలు నేర్చుకోగలం. నాకు తెలుగు వస్తుంది కాబట్టే.. ఐదు భాషలు నేర్చుకోగలిగానని అన్నారు. కేవలం ఇంగ్లీష్ వల్ల మాత్రమే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటు, విషయపరిజ్ఞానం ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..

శాసన సభ అధిపతి అయ్యన్నపాత్రుడు తెలుగు విశిష్టతను గురించి మాట్లాడుతూ.. ఈ రోజు చాలామంది తల్లులు తమ పిల్లలకు చందమామ కథలు చెప్పడం లేదు. మొబైల్ ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారని అన్నారు. పల్లెల్లో కూడా తెలుగు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మనమే మన భాషను ఆదరించాయి. లేకుంటే.. కాలగర్భంలో కలిసిపోతుంది. సంక్రాంతి, ఉగాది పండుగలకు పూర్వ వైభవం తీసుకురావాలి. ఆంగ్ల భాష అవసరమే.. కానీ తెలుగు భాషను మరిచిపోకూడదు అని చెప్పారు.

తెలుగు మహాసభలు ఎప్పుడు.. ఎలా ప్రారంభమయ్యాయి!

నిజానికి ప్రపంచ తెలుగు మహా సభలు ఇప్పటివి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1913లో బాపట్లలో మొదటి తెలుగు సభలు జరిగాయి. ఆ తరువాత 1914లో ఏలూరులో.. ఆ తరువాత 1915లో గుంటూరులో తెలుగు సభలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరోమారు గుంటూరులోనే తెలుగు మహా సభలు నిర్వహిస్తున్నారు.

తెలుగు భాషను కాపడం ఎలా?

ఏడాదికి ఒకసారి.. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి, పండితులను.. ఇతరత్రా గొప్పవాళ్లను సన్మానించి.. వారితో ఉపన్యాసాలు ఇచ్చినంతమాత్రాన తెలుగు భాషను కాపాడినట్లు, ఉద్దరించినట్లు కాదు. తెలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా తెలుగులో చదివినప్పుడు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా జీవోలు తీసుకురావాలి. తప్పనిసరిగా పాఠశాలలో తెలుగు పాటలు బోధించాలి, నేర్పించాలి. మనిషి ఎదగడానికి ఇంగ్లీష్ అవసరమే.. కానీ మాతృభాషను కాదని పరభాషను ప్రేమించడం, ఆదరించడం ఎంతవరకు సమంజసమో తెలుగు ప్రజలు తప్పకుండా ఆలోచించాలి.

Sourya Vardan
Sourya Vardan
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.

Related Articles