అందరికీ ఇష్టమైన బంగారం.. ఇప్పుడు ఆ పేరు వింటేనే చాలామందికి దడ పుట్టేస్తోంది. దీనికి కారణం రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతున్న రేట్లు. మారుతున్న కాలంతో పాటు.. లోహాల ధరల్లో భారీ మార్పు వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా గోల్డ్ రేటు మరీ ఎక్కువైపోయింది.
బంగారం ధరల్లో మార్పు!
ప్రస్తుతం భారతదేశంలో 22 క్యారెట్ల.. తులం బంగారం ధర రూ. 1.3 లక్షలు దాటేసింది. 24 క్యారెట్ల గోల్డ్ తులం కొనాలంటే రూ. 1.4 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఒకప్పుడు వేల రూపాయల్లో ఉన్న గోల్డ్ రేటు.. ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. ఈ ధరలు మరింత పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని.. నిపుణులు కూడా చెబుతున్నారు.
బంగారం ధరలు భారతదేశంలో.. అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ఢిల్లీలో ఒకలా ఉంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో మరోలా ఉన్నాయి. చెన్నైలో ఒకలా ఉంటే.. ముంబైలో మరోలా ఉన్నాయి. వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ధరల్లో పెద్ద తేడా కనిపించదు. కాబట్టి బంగారం కొనుగోలు చేయడం అనేది.. ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది.
ఏ మాత్రం తగ్గని వెండి!
వెండి విషయానికి వస్తే.. నేను ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లు, సిల్వర్ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. ఏడాది కిందట.. ఇదే సమయంలో రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో ఉన్న కేజీ వెండి రేటు.. ఇప్పుడు రూ. 2.50 లక్షలు దాటేసి చాలా రోజులు అయింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రేటుకు చేరినా.. ఏ మాత్రం ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని కియోసాకి వంటి ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.
ప్లాటినం, రాగి కూడా..
ఇక ప్లాటినం, రాగి వంటి లోహాల విలువ కూడా పెరుగుతూనే ఉన్నది. బంగారం వెండికి ప్రత్యామ్నాయంగా కొందరు ప్లాటినం కొనుగోలు చేస్తున్నారు. రాగిని కొన్ని పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ఈ మెటల్స్ రేటు కూడా పెరిగిపోయింది. వీటి ధరలు కూడా అందనంత ఎత్తుకు చేరుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు
లోహాల (బంగారం, వెండి, ప్లాటినం, రాగి మొదలైనవి) ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. డిమాండ్ పెరిగిందనే. అంటే వీటిని కొనుగోలు చేసేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరగడం. కొనుగోలుదారుల సంఖ్య పెరగడంతో.. వారికి కావలసినంత అందుబాటులో లేదు. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.
ఇది కాకుండా.. బంగారం, వెండి వంటి లోహాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే సమయంలో.. ఆ దేశాలు విధించే ట్యాక్స్, రవాణా ఖర్చులు, మన దేశంలో జీఎస్టీ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్నాయి.
ధరలు తగ్గాలంటే?
బంగారం, వెండి ధరలు ఒక్కసారి పెరిగితే.. మళ్లీ తగ్గడం అనేది చాలా కష్టం. ఎదో సామెత చెప్పినట్లు రేటు బార పెరిగితే.. మూరెడు మాత్రమే తగ్గుతోంది. ఒకవేళా తగ్గినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు తగ్గుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు. కానీ ధరలు తగ్గాలంటే.. గోల్డ్, సిల్వర్ కొనేవాళ్ల సంఖ్య తగ్గాలి. లేదా ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్లు కొంతకాలం వేచి ఉండాలి. డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో.. ఖచ్చితంగా రేటు తగ్గుతుంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.