Tuesday, January 27, 2026

ఇదేం ట్విస్ట్ మామా.. వేణు ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవి శ్రీ ప్రసాద్!

బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎలదండి దర్శకత్వం చేయబోతున్న రెండో చిత్రం పేరు ఎల్లమ్మ. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (డిఎస్పీ) కథానాయకుడిగా మొదటిసారి తెర ముందు నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన మూవీ గ్లింప్స్ ఈ రోజు (జనవరి 15) సంక్రాతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రెండు విధాలా న్యాయం చేయగలడా?

దేవి శ్రీ ప్రసాద్  ఒక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌గా మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి నుంచి ఒక యాక్టర్‌గా కూడా మనం చూడబోతున్నాము. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటో రెండో సినిమాల్లో పాటల్లో లేదా ఒక చిన్న సన్నివేశంలో అలా కనిపించి ఇలా వెళ్లిపోవడం తప్పితే.. ఎప్పుడు కూడా పూర్తి స్థాయి నటుడుగా చేసింది లేదు. సంగీత దర్శకుడిగా తను ఎలాంటి అద్భుతాలు చేయగలడు అనేది దేశమంతటికీ తెలుసు. మరి ఇప్పుడు ఈ చిత్రంతో నటన పరంగా ఏ మేరకు మెప్పించగలుగుతాడు?, అనేది చూడాల్సి ఉంది. ఈ ఎల్లమ్మ చిత్రానికి హీరోగా చేస్తూ మరియు సంగీతం కూడా దేవి శ్రీనే అందిస్తుండటం.. ఒకింత సాహసోపేత నిర్ణయంగా చెప్పొచ్చు. రెండింటికి ఏ విధంగా న్యాయం చేస్తాడో ఏమో.. అనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది.

మొదటి సినిమాతోనే సత్తా చూపిన వేణు

అది కూడా బలగం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వేణు దర్శకత్వంలో చేస్తున్నారు. బలగం సినిమా 2023 సంవత్సరంలో విడుదల అయింది. ఆ తరువాత చాలా విరామం తీసుకొని ఇన్నాళ్లకు 2026 ఏడాదికి గ్లింప్స్ రూపంలో అప్డేట్ అయితే ఇచ్చాడు. ఈ చిత్రం కోసం ఎంతో మంది హీరోలను అనుకున్నారు. వారందరికీ కథ వినిపించడం కూడా జరిగింది. చివరి దశ వరకు వచ్చి మళ్లీ ఎందుకో వెనక్కి వెల్లిపోయినోళ్లు ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎల్లమ్మ సినిమాని పట్టాలెక్కించారు. మొదటి చిత్రంతో తన సత్తా ఏమిటి అనేది నిరూపించుకున్నాడు.

రెండో మూవీ విషయంలో కూడా అంతే శ్రద్ధ, పట్టుదలను ప్రదర్శిస్తూ తన శక్తియుక్తులన్నిటిని ప్రయోగిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. కాకపొతే ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ను హీరోగా ఎంచుకోవడమే ఆలోచించాల్సిన విషయం. నటనను ఎలా రాబట్టుకోవాలి, ఏ విధంగా చూపించాలి అనేదాని పట్ల వేణుకు ఒక స్పష్టత ఉంటుంది. కాబట్టి బాగనే ఉంటుంది అనేది ఒకవైపు ప్రేక్షకుల వాదన.

గ్రామీణ నేపథ్యంలోనే!

గ్రామ దేవత ఎల్లమ్మ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది అని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం వాటిని వాడుకుని పల్లెల్లో కొంత మంది చేసే అధికార దోపిడీ, అణచివేతలను ఎదిరించేవాడి కథగా ప్రచారంలో ఉన్నది. టీజర్ మొదటల్లోనే చిన్న వేపాకుతో వీడియో మొదలవుతుంది. పొట్టేలును చూపిస్తూ, రెండు కాళ్లకు గజ్జెలు కట్టుకుని పరిగెత్తడం ఒక పక్కన, రెండు కాళ్లకు షూ వేసుకొని పరిగెత్తడం మరో పక్కన మనకు కనిపిస్తుంది. రాత్రి పూట జోరు వానలో, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు కురుస్తుండగా ఒక చెట్టుకింద రాతి మీద ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ చెట్టు మొదలుకి రక్తంతో ఉన్న కొడవలి చెక్కబడి ఉంటుంది. ఆ కూర్చొని ఉన్న వ్యక్తి చొక్కా లేకుండా ఎడమ పక్కన భుజానికి డప్పు వేలాడదీసుకొని రక్తపు మరకలతో, పొడువాటి జుట్టు వేసుకొని మెరుపుల వెలుతురులో ముఖం చూపిస్తారు. అతడే సినిమా హీరో దేవి శ్రీ ప్రసాద్. చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడం కలిసొచ్చే విషయం. డబ్బులు పెట్టడంలో గానీ.. మూవీకి ఎక్కువ థియేటర్లను అందించడంలో గానీ ఎక్కడ లోటు ఉండదు. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు, షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే సంగతి ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles