ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు చెల్లించాలి. దీనికోసం సంబంధిత అధికారులు చలాన్స్ జారీ చేస్తారు. అయితే కొందరు వాహనదారులు ఎప్పటికప్పుడు వీటిని క్లియర్ చేసుకుంటారు. ఇంకొందరు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ (50 శాతం రాయితీ) కట్టేద్దాం అని వేచి చూస్తారు. కానీ వీటికి చరమగీతం పాడటానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
రేవంత్ రెడ్డి సూచనలు
తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన 10 రోజుల రోడ్డు భద్రతా ప్రచార కార్యక్రమం ‘అరైవ్ అలైవ్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై పెండింగ్ చాలన్స్ ఉండకూడదని అన్నారు. దీనికోసం వాహనదారుల బ్యాంక్ ఖాతా నుంచే ఆటోమాటిక్‌గా డిడెక్ట్ (కట్) అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పెరిగిపోతున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
టెక్నాలజీ ఉపయోగించుకోండి!
వాహన వినియోగదారులు.. వాహనాలను కొనుగోలు చేసినప్పుడే, రిజిస్ట్రేషన్లను.. బ్యాంక్ అకౌంట్ వివరాలతో సమీకరించాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల మాన్యువల్ కలెక్షన్ లేదా చెల్లింపులలో ఆలస్యం వంటి వాటిని నిరోధించవచ్చని అన్నారు. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే.. బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి, టెక్నాలజీ ద్వారా వాటిని ఖాతా నుంచే చలానా కట్ అయ్యే విధంగా ట్రాఫిక్ విభాగానికి అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించింది.
ఇకపై పెండింగులో ఉన్న చలానాలకు వసూలు చేయడానికి డిస్కౌంట్స్ పద్దతి అవసరం లేదు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి ఎలాంటి మినహాయింపులు లేకుండా మొత్తం చెల్లించేలా సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాకముందు.. పెండింగ్ ట్రాఫిక్ చాలన్స్ మీద 50 శాతం రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి.. ఇప్పుడు మాట మారుస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. సీఎం చెబుతున్న ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఫైన్ విధించడానికి ముందే.. వాహన వినియోగదారులకు వివరించాలని, అప్పీల్ చేయడానికి లేదా పరిష్కారం కోరుకోవడానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అన్నారు.
ఆటోమాటిక్ డెబిట్ విషయంలో.. బ్యాంకులు కస్టమర్ అనుమతి తీసుకోవాలి. లేకుంటే ఆర్ధిక పరమైన సమస్యలు తలెత్తుతాయని ప్రజలు చెబుతున్నారు. ఓ కొత్త విధానం అమలు చేసే సమయంలో.. అది ప్రజలకు ఉపయోగపడుతుందా?, లేదా? అని విషయాన్ని ఆలోచించాలని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అందుకే చలానాల విషయంలో కఠినంగా!
హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న.. రేవంతా రెడ్డి రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారిపోయిందని అన్నారు. ఒక యుద్ధంలో కన్నుమూసి సైనికుల కంటే కూడా.. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువ ఉన్నారని చెప్పారు. దేశంలో నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం.. మూడు నిమిషాలకు ఒకరు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. రోడ్డు ప్రమాదాల వచ్చే సమస్యలు కూడా వివరించారు. అందుకే చలానాల విషయంలో కొంత కఠినంగా ఉండాల్సి వస్తోందని అన్నారు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.






