Tuesday, January 27, 2026

2026 పల్సర్ 125 లాంచ్.. ఇందులో కొత్తగా ఏముందంటే?

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. పల్సర్ బైక్ ధరలను పెంచిన తరువాత ఓ అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఇందులో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేనప్పటికీ.. కొంత కొత్తదనం కనిపిస్తుంది. ఈ కథనంలో ఆ పల్సర్ అప్డేట్ బైక్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

ప్రారంభ ధర ఎంతంటే?

బజాజ్ ఆటో లాంచ్ చేసిన అప్డేటెడ్ బైక్ పల్సర్ 125. ఇది ఇప్పుడు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ బ్లింకర్‌లతో పాటు రిఫ్రెష్ కలర్స్ మరియు గ్రాఫిక్స్ పొందుతుంది. ఈ చేంజెస్ అన్నీ.. ఈ బైకును మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. కొత్త కస్టమర్లను లేదా రైడర్లను ఆకట్టుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ చిన్న చిన్న అప్డేట్స్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 89910 (ఎక్స్-షోరూమ్).

సరికొత్త కలర్ ఆప్షన్స్

అప్డేటెడ్ పల్సర్ 125 బైక్ బ్లాక్ గ్రే, బ్లాక్ రేసింగ్ రెడ్, బ్లాక్ సియాన్ బ్లూ, రేసింగ్ రెడ్ విత్ టాన్ బీజ్ అనే రంగులలో.. కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ మరియు కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ అనే వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి సాధారణ బైక్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉందని, ఇది తప్పకుండా కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అదే ఇంజిన్..

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో ఎలాంటి అప్డేట్ లేదు. కాబట్టి అదే 124.38 సీసీ ఫోర్ స్ట్రోక్, టూ వాల్వ్, ట్విన్ స్పార్క్ బీఎస్6 కంప్లైంట్ ఇంజిన్ ఉంది. ఇది 8500 ఆర్పీఎం వద్ద 11.8 బీహెచ్పీ పవర్ మరియు 6500 ఆర్పీఎం వద్ద 10.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 15 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. కాబట్టి రోజువారీ ప్రయాణాలకు లేదా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

త్వరలో డీలర్‌షిప్‌లకు

ధరల విషయానికి వస్తే.. పల్సర్ 125 కార్బన్ డిస్క్ సింగిల్ సీట్ ఎల్ఈడీ వేరియంట్ ధరలు రూ. 89910 నుంచి ప్రారంభమవుతాయి, కాగా కార్బన్ డిస్క్ స్ప్లిట్ సీట్ ఎల్ఈడీ వేరియంట్ ధర రూ. 92046 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. సరికొత్త పల్సర్ బైకులు త్వరలోనే దేశంలోని అన్ని బజాజ్ డీలర్‌షిప్‌లలోకి అందుబాటులోకి వస్తాయి.

మార్కెట్లో ఫుల్ డిమాండ్!

ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ కూడా ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇందులో.. ఇప్పటికే అనేక వేరియంట్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా కూడా 2026 అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఇప్పటి వరకు సంస్థ తన బజాజ్ సిరీస్ బైకులను సుమారు 2 కోట్ల యూనిట్లు విక్రయించినట్లు సమాచారం. ప్రపంచంలో ఏకంగా 50 కంటే ఎక్కువ దేశాల్లో ఈ బైకులను విక్రయిస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరిన్ని కొత్త బైక్స్ లాంచ్ చేస్తూ.. తన ఉనికిని ఇంకొన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బహుశా సంస్థ కూడా అదే పనిలో ఉన్నట్టు అవగతం అవుతోంది.

Mahesh
Maheshhttp://marthatelugu.com
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.

Related Articles