తెలంగాణాలో ఈ రోజు (ఫిబ్రవరి 11) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుష ఓటర్లు 72.63 శాతం (18,51,829 మంది), మహిళా ఓటర్లు 73.39 శాతం (19,57,226 మంది), ఇతరులు 55.02 శాతం (351 మంది) ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం!
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాదిస్తుందని.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం.. అధికార పార్టీ 68-76 మునిసిపాలిటీలలో (మొత్తం 116 మునిసిపాలిటీలలో 60 శాతం) గెలుస్తుందని సమాచారం. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 29-39 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీజేపీ (భారతీయ జనతా పార్టీ) 3-5 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. అయితే ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) పార్టీ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్స్.. మున్సిపల్ వార్డులకు సంబంధించి!
మున్సిపల్ వార్డులకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ 1210 నుంచి 1290 వార్డులలో గెలుస్తుందని చెబుతున్నాయి. బీఆర్ఎస్ 860 నుంచి 930 వార్డులు, బీజేపీ 250 నుంచి 270 వరకు, ఏఐఎంఐఎం పార్టీ 35 నుంచి 44 వార్డుల మధ్య గెలుచుకునే అవకాశం ఉంది.
కార్పొరేషన్స్ వారీగా తీసుకుంటే.. రామగుండం (30-34 వార్డులు), మంచిర్యాల (39-43 వార్డులు), కొత్తగూడెం (28-34 వార్డులు), నల్గొండ (21-26 వార్డులు), మహబూబ్ నగర్ (26-30 వార్డులు)లలో కాంగ్రెస్ ఆధిక్యతను చూపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కరీంనగర్ (24-29 వార్డులు), నిజామాబాద్ (26-31 వార్డులు)లలో బీజేపీ గెలుస్తుందని సమాచారం.
పీపుల్స్ పల్స్ ప్రకారం ఓట్ల వాటా.. కాంగ్రెస్ పార్టీకు 39 శాతం, బీఆర్ఎస్ పార్టీకు 29.7 శాతం, బీజేపీ పార్టీకి 19.3 శాతం, ఏఐఎంఐఎం పార్టీకి రెండు శాతం అని తెలుస్తోంది.
తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్
రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలింగ్ జరిగింది. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం.. 123 పట్టాన స్థానిక సంస్థలలో 2981 వార్డులలో 25.50 లక్షల మంది పురుషులు, 26.67 లక్షల మంది మహిళలతో సహా.. మొత్తం 52,17,413 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. కాగా ఈ రోజు (బుధవారం) జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13(శుక్రవారం)న జరుగుతుంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. అయితే ఇప్పటికే తొమ్మిది మున్సిపాలిటీలలో 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే మొత్తం 10719 మంది మున్సిపాలిటీలకు అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 2358 మంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2478 మంది, బీజేపీ పార్టీ నుంచి 2252 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఓటు వేసిన ప్రముఖులు
మున్సిపల్ ఎన్నికల్లో.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్‌లో ఓటు హక్కును ఉపయోగించుకోగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో ఓటు వేశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవరంలో ఓటు వేశారు.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.