కారుకు రెడ్ కలర్ నెంబర్ ప్లేట్.. ఎందుకో తెలుసా?

భారతదేశంలో రోడ్లపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్లు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ముఖ్యంగా ఎరుపు నెంబర్ ప్లేట్ కనిపించినప్పుడు చాలామందికి అది ఎందుకు వాడతారో అనే అనుమానం వచ్చి ఉంటుంది. నిజానికి ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ అనేది కొత్త కార్లకు ఇచ్చే తాత్కాలిక రిజిస్ట్రేషన్ గుర్తు.

అందుకే రెడ్ కలర్ నెంబర్ ప్లేట్

భారతదేశంలో ప్రతి వాహనం రోడ్డుపై నడవడానికి ముందు, ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే కొత్త కారును కొనుగోలు చేసిన వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ పొందడానికి కొంత సమయం పడుతుంది.

ఈ మధ్య కాలంలో వాహనం చట్టబద్ధంగా రోడ్డుపై నడవడానికి ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. కొత్త వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఇది వాహనం కొత్తదని మాత్రమే కాదు, ఇంకా శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదని కూడా సూచిస్తుంది.

30 రోజుల చెల్లిబాటు

తాత్కాలిక నంబర్ ప్లేట్ అనేది సాధారణంగా 30 రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ కాలంలో వాహన యజమాని కారు ఇంటికి తీసుకెళ్లడం, అవసరమైన పత్రాలు సమర్పించడం, శాశ్వత రిజిస్ట్రేషన్ పొందడం వంటి పనులు పూర్తి చేయాలి.

చాలా సందర్భాల్లో ఎరుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు అక్షరాలతో తాత్కాలిక నెంబర్ ముద్రిస్తారు. అయితే ఇటీవల నిబంధనల ప్రకారం కొన్ని ప్లేట్లలో పసుపు బ్యాక్‌గ్రౌండ్‌పై ఎరుపు అక్షరాలు కూడా కనిపించవచ్చు.

ముఖ్యమైన నియమాలు & పరిమితులు

ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రోడ్డుపై నడవడానికి అనుమతి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి.

గడువు పరిమితి: తాత్కాలిక రిజిస్ట్రేషన్ సాధారణంగా 30 రోజుల వరకు మాత్రమే చెల్లుతుంది. గడువు ముగిసిన తర్వాత కూడా అదే ప్లేట్‌తో వాహనం నడిపితే అది చట్ట విరుద్ధం.
జరిమానా ప్రమాదం: రవాణా శాఖ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో వాహనం నడిపితే రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
రాష్ట్ర పరిమితులు: సాధారణంగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాన్ని అదే రాష్ట్రంలోనే ఉపయోగించాలి. ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరం కావచ్చు.
బీమా తప్పనిసరి: తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ వాహనానికి చెల్లుబాటు అయ్యే వాహన బీమా తప్పనిసరి.

ఇలాంటి వాహనాలకు రెడ్ కలర్ ప్లేట్స్

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ మరో ప్రత్యేక సందర్భంలో కూడా ఉపయోగిస్తారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవులు నిర్వహించే వ్యక్తుల వాహనాలకు ప్రత్యేక ఎరుపు ప్లేట్లు ఉంటాయి.

ఉదాహరణకు.. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు మొదలైనవారు అన్నమాట. ఈ వాహనాలపై సాధారణ నెంబర్ బదులుగా జాతీయ చిహ్నం (అశోక సింహం) ఉండే ఎరుపు ప్లేట్ ఉంటుంది. ఇది ఆ వాహనం అధికారిక ప్రభుత్వ వాహనం అని సూచిస్తుంది.

దేశంలో నెంబర్ ప్లేట్ కలర్స్: భారతదేశంలో వాహనాల ప్రయోజనాన్ని బట్టి నెంబర్ ప్లేట్ల రంగులు వేర్వేరుగా ఉంటాయి.

తెలుపు రంగు ప్లేట్: వ్యక్తిగత వాహనాలకు
పసుపు రంగు ప్లేట్: ట్యాక్సీలు, బస్సులు వంటి కమర్షియల్ వాహనాలకు
ఆకుపచ్చ రంగు ప్లేట్: ఎలక్ట్రిక్ వాహనాలకు
ఎరుపు రంగు ప్లేట్: తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న కొత్త కార్లకు

మొత్తం మీద ఈ కథనం చదివిన తరువాత, పబ్లిక్ రోడ్డుపై ఏ రంగు నెంబర్ ప్లేట్ కలిగిన వాహనం కనిపించిన, అది దేనికి కేటాయించారు, అనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది.

Also Read: వాహనదారులకు శుభవార్త.. ఇకపై NOC అవసరం లేనట్టే?