గ్యాస్ సిలిండర్స్ కొరత: వీటికి ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం!

దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో.. వినియోగదారులు ప్రత్యామ్నాయ వంట పరికరాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ సమయంలో ఎలక్ట్రిక్ స్టవ్ సేల్స్ భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేకపోతే వంటకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. చాలా మంది ముందుగానే ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.

300 శాతం పెరిగిన సేల్స్!

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో గత కొన్ని రోజులుగా ఈ పరికరాలకు ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా Flipkartలో మాత్రమే సుమారు 300 శాతం వరకు వీటి సేల్స్ పెరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో Amazonలో కూడా ఇండక్షన్ స్టవ్స్ & రైస్ కుకర్స్‌కు భారీ డిమాండ్ నమోదవుతోంది. ఈ పరిస్థితి మార్కెట్‌లో సరఫరాపై ఒత్తిడిని పెంచింది. చాలా మోడల్స్‌పై ‘Sold Out’ లేదా ‘Out of Stock’ బోర్డులు కనిపిస్తున్నాయి.

భారీ డిమాండ్!

గత రెండు మూడు రోజులుగా ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌లో కూడా ఎలక్ట్రిక్ వంట పరికరాల కోసం వినియోగదారులు పెద్ద ఎత్తున ఆర్డర్లు చేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్స్‌తో పాటు ఎలక్ట్రిక్ ప్రెజర్ కుకర్స్, రైస్ కుకర్స్ వంటి పరికరాలను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గ్యాస్‌పై ఆధారపడకుండా విద్యుత్‌తో వంట చేయగలగడం ఈ పరికరాల ప్రధాన ప్రయోజనం. ఆన్‌లైన్ రిటైలర్లు చెబుతున్న వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో డెలివరీ సమయం కూడా పెరిగింది. ఎక్కువ డిమాండ్ కారణంగా స్టాక్ త్వరగా ఖాళీ అవుతోంది.

షాపుల్లోనూ కూడా ఇదే పరిస్థితి

ఆన్‌లైన్ మార్కెట్ మాత్రమే కాకుండా స్థానిక ఎలక్ట్రానిక్స్ దుకాణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ స్టవ్స్ కోసం వినియోగదారులు నేరుగా షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా ఇండక్షన్ స్టవ్స్ కోసం డిమాండ్ గణనీయంగా పెరిగింది. కొంతమంది వ్యాపారులు ఇప్పటికే ఉన్న స్టాక్ పూర్తిగా అమ్ముడైందని చెబుతున్నారు. కొత్త సరుకు వచ్చే వరకు వినియోగదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ సరఫరాపై స్పష్టత వచ్చే వరకు ఎలక్ట్రిక్ స్టవ్స్ సేల్స్ ఇదే విధంగా కొనసాగవచ్చని అంటున్నారు.

పెరుగుతున్న డిమాండ్!

ఇటీవల విద్యుత్ ఆధారిత వంట పరికరాల వినియోగం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ కుకర్స్ వంటి పరికరాలు తక్కువ సమయంలో వంట పూర్తి చేయడంలో సహాయపడటంతో పాటు గ్యాస్ అవసరం లేకపోవడం వల్ల వినియోగదారులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గ్యాస్ కొరత వార్తలతో ఈ ట్రెండ్ మరింత వేగంగా పెరిగింది. చాలా మంది వినియోగదారులు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ఈ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.

ఎలక్ట్రిక్ స్టవ్స్ వినియోగానికి కరెంట్ ఉంటే సరిపోతుంది. గ్యాస్ లభించని సమయంలో దీని ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టే ప్రస్తుతం వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో.. మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే గ్యాస్ సిలిండర్ల కొరత త్వరలోనే పరిష్కారం అవుతుందని కేంద్ర మంత్రులతో పాటు, ప్రధాని మోదీ కూడా చెబుతున్నారు.

Also read: LPG గ్యాస్ కష్టాలు.. బుకింగ్ సిస్టమ్ క్రాష్!