ఆంధ్రప్రదేశ్‌లో KGBV ప్రవేశాలు ప్రారంభం: లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV)లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినుల కోసం సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ తరగతుల వారికి అవకాశం

ఈ ప్రక్రియలో 6వ తరగతి & 11వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థినులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అలాగే 7వ, 8వ, 9వ, 10వ, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా ఈ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న బాలికలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

దరఖాస్తుల గడువు & ఎంపిక ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో KGBV ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న బాలికలు నిర్దేశిత గడువు లోపు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన విద్యార్థినుల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు. ఎంపికైన బాలికలు ఏప్రిల్ 17 వరకు తమ ధ్రువపత్రాలను సంబంధిత పాఠశాలల్లో సమర్పించి సీటును నిర్ధారించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత అధికారికంగా అడ్మిషన్ కన్‌ఫర్మ్ అవుతుంది.

అప్లై చేసుకునే విధానం!

ఆంధ్రప్రదేశ్‌లో KGBV ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన వివరాలు నమోదు చేయాలి.

దరఖాస్తు సమయంలో విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు ఇతర అవసరమైన సమాచారం సమర్పించాలి. అలాగే అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సమర్పించిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను భద్రపరచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

KGBV పాఠశాలల ప్రాధాన్యం

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలలు. ఈ పాఠశాలల్లో నివాస సదుపాయం, భోజనం, పుస్తకాలు వంటి సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు.

ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువు కొనసాగించలేని బాలికలకు KGBV పాఠశాలలు ఒక గొప్ప అవకాశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పాఠశాలలు వేలాది మంది బాలికలకు విద్యా అవకాశాలను అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం KGBV ప్రవేశాలను నిర్వహిస్తూ, మరింత మంది విద్యార్థినులకు ఉన్నత విద్యా అవకాశాలను కల్పిస్తోంది.

కేజీబీవీ స్కూల్స్ ఎలా మొదలయ్యాయి

కేజీబీవీ (KGBV) స్కూల్స్ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల బాలికలకు విద్యను అందించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పాఠశాలలే ఇవి. ఈ పథకాన్ని 2004లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. అప్పట్లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బాలికలు పేదరికం, సామాజిక సమస్యలు, దూర ప్రాంతాల కారణంగా చదువును కొనసాగించలేకపోతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం వసతి సదుపాయం ఉన్న బాలికల పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 15 రోజులు సెలవు!