Skoda: 2026 స్కోడా కుషాక్ లాంచ్: ధర రూ.10.69 లక్షలు!

Skoda: భారత మార్కెట్‌లో స్కోడా కంపెనీ తన కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ SUVని విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.10.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.18.99 లక్షలు. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్లలో గణనీయమైన మార్పులు ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో రెనాల్ట్ డస్టర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి SUVలు బలమైన పోటీతో ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్, ఫీచర్లు, పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో SUVలకు డిమాండ్ పెరుగుతున్నందున, ఈ కొత్త మోడల్ ప్రాధాన్యం మరింత పెరిగింది.

ఆకట్టుకునే డిజైన్

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముందుభాగంలో కొత్త గ్రిల్, హెడ్‌లైట్ డిజైన్ పెద్ద కోడియాక్ SUV నుంచి ప్రేరణ పొందింది. స్లీక్ హెడ్‌లైట్లు, ఐబ్రో స్టైల్ DRLs ఈ SUVకి ఆధునిక లుక్ ఇస్తున్నాయి.

ఇక సైడ్ ప్రొఫైల్‌లో 17 అంగుళాల వీల్స్, 50 కిలోల లోడ్ మోయగలిగే రూఫ్ రైల్స్ ఉన్నాయి. వీల్ ఆర్చెస్ మరియు డోర్ దిగువ భాగంలో బ్లాక్ క్లాడింగ్ ఇవ్వడం ద్వారా రఫ్ అండ్ టఫ్ లుక్ వచ్చింది. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్, ఇల్యూమినేటెడ్ స్కోడా లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇంటీరియర్ & ఫీచర్లు

ఇంటీరియర్ విషయంలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ సౌకర్యాలను మరింత మెరుగుపరిచింది. 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు యాంబియంట్ లైటింగ్ అందుబాటులో ఉంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఇక్కడ చూడవచ్చు. అదనంగా 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా అప్‌గ్రేడ్ అయింది. పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక సీటు మసాజ్ ఫీచర్, పవర్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఈ SUVను మరింత ప్రీమియంగా మార్చాయి. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు కూడా వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచుతున్నాయి.

ధరలు & వేరియంట్లు

  • Classic+: రూ.10.69 లక్షలు
  • Signature: రూ.14.59 లక్షలు
  • Sportline: రూ.14.74 లక్షలు
  • Prestige: రూ.16.79 లక్షలు
  • Monte Carlo: రూ.17.89 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)

సేఫ్టీ & ఇంజిన్ వివరాలు

సేఫ్టీ విషయంలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మంచి ప్రమాణాలు కలిగి ఉంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం ఉన్నాయి. అయితే, 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు లేకపోవడం కొంతమంది వినియోగదారులకు నిరాశ కలిగించవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (115 hp), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (150 hp) ఆప్షన్లు ఉన్నాయి. చిన్న ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉండగా, పెద్ద ఇంజిన్‌కు 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ ఉంది.

Also read:రూ.10.49 లక్షల డస్టర్ కారు లాంచ్: ఇవిగో పూర్తి వివరాలు