Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. వెనుక టైర్ పేలడంతో మంటలు చెలరేగిన ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతతో 37 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన సమయంలో బస్సులో ఒక ఎమ్మెల్యే సహా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటుచేసుకున్నట్లు సమాచారం. బస్సు ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా టైర్ పేలడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను మేల్కొలిపి బస్సు నుంచి బయటకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఈ ఘటన ప్రాణనష్టం కలిగించే ప్రమాదంగా మారే అవకాశం ఉండేది.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్సు వెనుక టైర్ అకస్మాత్తుగా పేలింది. ఆ వెంటనే మంటలు చెలరేగి క్రమంగా మొత్తం బస్సును ఆవరించాయి. కొన్ని నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే బస్సు ఎక్కువ భాగం కాలిపోయినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఈ ఘటనలో ముఖ్యంగా డ్రైవర్ సమయోచిత చర్యలు ప్రశంసనీయంగా నిలిచాయి. ప్రయాణికులు నిద్రలో ఉండగా వెంటనే వారిని లేపి బయటకు దించడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలిసింది. అందరూ క్షేమంగా బయటపడటం ఊరటనిచ్చింది.
ప్రయాణ భద్రతపై మళ్లీ చర్చ
ఈ ఘటనతో ప్రయాణ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. బస్సుల నిర్వహణ, టైర్ల పరిస్థితి, సేఫ్టీ ప్రమాణాలపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా రాత్రి ప్రయాణాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, వాహనాల రెగ్యులర్ చెకింగ్ తప్పనిసరి చేయాలని కోరుతున్నారు.
గతంలో జరిగిన బస్సు ప్రమాదాలు
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ఘోర బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల సమయంలో ఎంతోమంది ప్రయాణికులు అసువులు బాసారు. మరెందరో గాయపడ్డారు. అనుకోని ప్రమాదాలు, అతి వేగం లేదా డ్రైవర్ల అప్రమత్తత వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ట్రావెల్స్ బస్సులు నడిపే యాజమాన్యం.. వాహనం సరైన కండిషన్లో ఉందనే విషయం నిర్దారించుకోవాలి. డబ్బుకు ఆశపడి సరైన నిర్వహణ లేని బస్సులను ఉపయోగించడం, నైపుణ్యం లేని డ్రైవర్లను నియమించడం వంటివి మానుకోవాలి. ఒకరి స్వార్థం కోసం ఇంకొకరు బలైపోవడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని తప్పకుండా ఆలోచించాలి.
Also read:వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాలకు అలర్ట్!
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.