Apple CEO: అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కీలక నిర్ణయం ప్రకటించింది. కంపెనీ సీఈఓగా ఉన్న Tim Cook ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవి నుంచి తప్పుకుంటారని తెలిపింది. ఆయన స్థానంలో కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ John Ternus బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రకటనతో ఆపిల్ నాయకత్వ మార్పుపై నెలకొన్న అనుమానాలకు ముగింపు లభించింది.
సిలికాన్ వ్యాలీ టెక్ ప్రపంచంలో కీలక మలుపు తిరిగిన ఈ పరిణామం.. Apple భవిష్యత్ దిశపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న టిమ్ కుక్, సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నట్లు కంపెనీ తెలిపింది. తన పదవీకాలాన్ని “జీవితంలో గొప్ప గౌరవం”గా పేర్కొన్న కుక్, సంస్థను ముందుకు నడిపే బాధ్యతలు నిర్వహించడం తనకు గర్వకారణమని అన్నారు.
యాపిల్ ఎదుగుదలలో టిమ్ కుక్ పాత్ర
Tim Cook 1998లో యాపిల్‌లో చేరి, మొదట ఆపరేషన్స్ విభాగంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఐఫోన్ తయారీ సంస్థకు చెందిన సప్లై చైన్‌ను సమర్థంగా నిర్వహించడం ద్వారా కంపెనీ లాభదాయకతను పెంచారు. 2011లో కంపెనీ సహ వ్యవస్థాపకుడు Steve Jobs ఆరోగ్య సమస్యల కారణంగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత, కుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
తన నాయకత్వంలో ఆపిల్ కంపెనీ ఉత్పత్తుల విస్తరణతో పాటు మార్కెట్ విలువను భారీగా పెంచుకుంది. ప్రస్తుతం కంపెనీ విలువ దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం కుక్ నాయకత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, మ్యాక్ వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందాయి.
కొత్త CEOగా జాన్ టెర్నస్
John Ternus 2001లో ఆపిల్‌లో చేరి ప్రోడక్ట్ డిజైన్ విభాగంలో పనిచేశారు. తరువాత హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు వంటి ప్రధాన ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కొత్త బాధ్యతలపై స్పందిస్తూ, టెర్నస్ ఆపిల్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లో Steve Jobs మరియు టిమ్ కుక్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని చెప్పారు.
AI యుగంలో యాపిల్‌కు కొత్త సవాళ్లు!
ఈ సంవత్సరం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న Apple కు కొత్త నాయకత్వం కీలక దశలో బాధ్యతలు చేపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెరుగుతున్న పోటీ కంపెనీకి పెద్ద సవాల్‌గా మారింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు AIలో ముందంజలో ఉండగా, ఆపిల్ కూడా వినూత్న ఆవిష్కరణలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
1976లో Steve Jobs మరియు Steve Wozniak ప్రారంభించిన ఈ సంస్థ, వ్యక్తిగత కంప్యూటింగ్ ప్రపంచాన్ని మార్చింది. స్మార్ట్‌ఫోన్ యుగాన్ని ప్రారంభించిన ఐఫోన్, డిజిటల్ లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది.
నాయకత్వ మార్పు ప్రభావం
ఈ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టిమ్ కుక్ స్థిరమైన, వ్యాపార దృష్టితో పోలిస్తే, టెర్నస్ టెక్నాలజీ మరియు ప్రోడక్ట్ డెవలప్‌మెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బోర్డు చైర్మన్ Arthur Levinson మాట్లాడుతూ, కుక్ నాయకత్వం యాపిల్‌ను ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. ఆయన విలువలు సంస్థలో ప్రతి నిర్ణయంలో ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు.
Also Read: రోడ్డు పక్కనున్న షాపుకెళ్లిన పీఎం నరేంద్ర మోదీ (వీడియో)

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్సైట్లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
