Tuesday, January 27, 2026

బోగి మంటల్లో ఇవన్నీ వేస్తే.. కాలుష్య మండలి హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ప్రారంభమైంది. ప్రతి ఏటా.. జనవరి మాసంలో బోగి, సంక్రాతి, కనుమ పండుగలను వరుసగా జరుపుకుంటారు. అందరూ కూడా ఈ సందర్బంగా తెల్లవారుజామున వీధుల్లో లేదా ఇంటి ముందు బోగి మంటలు వేయడం ఆనవాయితీ. పాత వస్తువులును ఆ మంటలలో వేసి కొత్త దనాన్ని జీవితంలోకి ఆహ్వానించడం దీని ఉద్యేశంగా చెబుతారు. అయితే ఈ బోగి మంటలు వేసే క్రమంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పీ. కృష్ణయ్య ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు అందించారు.

ఏపీ కాలుష్య మండలి చైర్మన్ సూచనలు

బోగి పండుగను ప్రజలందరికి ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు కూడా మంటల్లో వేయకూడదని ఆయన తెలిపారు. మంచు కురిసే కాలంలో గాలిలో దూళి కణాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ తరుణంలో మంటలలో విషపూరిత వస్తువులు వేయడం కారణంగా వచ్చే పొగలు వలన జనం ఆరోగ్య పరిస్థితులపైన దాని ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. పొద్దు పొద్దున్నే అన్ని ఊర్లల్లో కూడా మంచు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏవిపడితే అవి తీసుకొచ్చి మంటపెట్టి.. అది గాలిలో కలిసి ప్రజలకు హాని కలిగిస్తాయి.

ఉపయోగించకూడని వస్తువులు

కొంతమంది అయితే.. అందరూ మంటలు వేస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆత్రుతలోనో సరదాకోసమే ఏది దొరికితే అది తీసుకొచ్చి బోగి మంటల్లో వేస్తుంటారు. అలాంటి వారిని ఆయన హెచ్చరించారు. వాడని వాహనాల టైర్లు, ఎన్నో రకాల కెమికల్ కలిసిన ప్లెక్సీలు, బ్యానర్లు, అనేక రకాల ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, బిందెలు, చెప్పులు, మనం ఎలాగో వాడటం లేదు కదా అని వాటన్నింటిని బోగి మంటల్లో పడేస్తుంటారు. ఇవి కాలి కార్బన్ , మెర్క్యూరి, సల్ఫర్, నైట్రోజన్ లాంటి యాసిడ్స్, ఆక్సిజన్స్ వాతావరణంలో కలిసి మొత్తం కాలుష్యం విషం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇది గుర్తించి అటువంటి వ్యర్థ పదార్థాలను ఉపయోగించకూడదని వారు కోరడం జరిగింది.

ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం!

ఈ విధంగా విడుదలయ్యే ప్రమాదకర వాయువులు మనుషుల అనారోగ్యానికి తీవ్ర కారణం అవుతాయి. క్యాన్సర్ రావడం, ఒళ్లంతా దురదలు పుట్టడం, కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలన్నింటికి సంబంధిత శాశ్వతమైన అనేక రకాల వ్యాధులు రావడానికి, భవిష్యత్తులో మరింతగా పెరగడానికి దారి తీస్తాయని చైర్మన్ హెచ్చరించారు. కొంత మంది తెలిసి, ఇంకొంత మంది తెలియక చేసే కొన్ని తప్పిదాల వల్ల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. వీలైనంత వరకు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటే సమాజానికి ఎంతో కొంత మేలు చేసినవాళ్లము అవుతాము.

బోగి ఇలా జరుపుకోండి!

అయితే ఇక్కడ బోగి పండుగ చేసుకోవద్దా అనే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ పండగైనా మనం జరుపుకోవచ్చును కానీ అది మనలో సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను కలిగించే విధంగా ఉండాలి. ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా పదికాలాల పాటు పచ్చగా బతకాలి. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ చెప్పిదాని ప్రకారం మన ఇంటి దగ్గర దొరికే సహజమైన కట్టెలు, చెట్లలోని ఆకులు, సేధ్యానికి ఉపయోగపడని పాత పనిముట్లు, హానికరం కానీ ఏ వస్తువులు అయినా వాడుకోవచ్చు అని తెలిపారు. మన ఇంట్లో పాతబడిపోయిన వాటిని తీసుకొచ్చి వీధుల్లో వేసి మంట పెట్టకుండా దయచేసి చెత్తను తీసుకెళ్లే పారిశుధ్య శాఖ వాహనాల వారికి వాటిని అప్పజెబితే వారు తీసుకెళ్తారని ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ప్రజల అందరినీ కూడా మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles