Tuesday, January 27, 2026

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం: ఎవరీ నవీన్ యాదవ్?

మొత్తానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హడావుడికి తెరపడింది. నవంబర్ 14న తమ అభిమాన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు వేసిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ముగిసింది. ఎలక్షన్ కమిషన్ ఫలితాలకు సంబంధించిన తుది తీర్పుని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అధిక మెజారిటీతో గెలుపొందాడు. తమ అభ్యర్థి విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించాడు. నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 98,988.

భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతకు 74259 ఓట్లు రావడంతో ఓటమితో ఆమె రెండో స్థానానికి సరిపెట్టుకునింది. ఇక మూడో స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన లంక దీపక్ రెడ్డికి ప్రజలు 17,061 ఓట్లు వేశారు. తర్వాత నోటా నాలుగో స్థానంలో నిలిచినది, దానికి 924 ఓట్లు వేశారు. బీజేపీ లంక దీపక్ రెడ్డితో సహా ఇండిపెండెంట్ కాండిడేట్స్ మరియు ఇతర పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు.

2009 తర్వాత మళ్లీ ఇన్నేళ్ళకి..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డి 54,519 (39.84%) ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో రెండు సార్లు మళ్ళీ అతనే పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ జెండా ఎగరేయలేకపోయింది. అనూహ్యంగా ఒక సారి టీడీపీ తరపున, రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు గెలుపొందటం జరిగింది. తర్వాత ఆయన అకాలమరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక రావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు  అక్కడ నిలబడిన నవీన్ యాదవ్ విజయం సాధించి ఇన్నాళ్లకి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు.

ఎవరీ నవీన్ యాదవ్..?

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో పుట్టి పెరిగిన నవీన యాదవ్.. తన రాజకీయ జీవితాన్ని ఏఐఎంఐఏం పార్టీతో ప్రారంభించాడు. మొదట రెండు సార్లు జిహెచ్ఏంసీ ఎన్నికల్లో యూసుఫ్‌గూడ (2009) నుంచి 2016లో రహమాత్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో ఏంఐఏం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.

2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. అప్పుడు కూడా.. రెండు సార్లు కూడా ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2025లో ఈసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇన్ని ఓటముల తర్వాత చివరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. ఈయనకు తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, తల్లి కస్తూరి. భార్య వర్ష యాదవ్, కుమారుడు అన్ష్ యాదవ్ ఉన్నారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉండటం కారణంగా.. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపులో ఆయన ముఖ్య పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles