అల్లు అర్జున్.. ఈ పేరు వినగానే చాలామందికి పుష్ప సినిమానే గుర్తొస్తుంది. ఇప్పటికే సంచలన విజయాలు కైవసం చేసుకుని.. భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్నాయి. పుష్ప, పుష్ప 2 సినిమాలు విజయవంతం కావడంతో.. పుష్ప 3 కూడా రానున్నట్లు డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు.
పుష్ఫ 3 వస్తుంది
నిజానికి పుష్ప సినిమా చూసిన తరువాత.. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూసారు. ఇప్పుడు పుష్ప 3 కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి దర్శకుడు శుభవార్త చెప్పారు. రాబోయే పుష్ఫ సినిమాకు ”పుష్ప 3: ది రాంపేజ్” అని పేరు పెట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేదు.
సైమా అవార్డ్ 2025
దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025 (సైమా) కార్యక్రమంలో.. పుష్ప టీమ్ ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఈ సమయంలో పుష్ప 3 సినిమా వస్తుందా?.. అనే ప్రశ్నకు తప్పకుండా వస్తుందని క్లారిటీ ఇచ్చారు. సైమా వేదికపై అల్లు అర్జున్ (బెస్ట్ యాక్టర్), రష్మిక మందన్న (ఉత్తమ నటి), సుకుమార్ (బెస్ట్ డైరెక్టర్), దేవిశ్రీ ప్రసాద్ (బెస్ట్ మ్యూజిక్ కంపోజర్), శంకర్ బాబు కందుకూరి (బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – మేల్) అవార్డులను అందుకున్నారు. ఒకే సినిమా ఇన్ని అవార్డులు అందుకోవడం గొప్ప విషయం.
సైమా అవార్డు తరువాత అల్లు అర్జున్ రియాక్షన్
నిరంతరం ప్రేమ, గుర్తింపు ఇస్తున్న సైమాకు ధన్యవాదాలు. వరుసగా మూడు సైమా అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విజేతలకు, నామినీలందరికి అభినందనలు. దీన్ని (అవార్డు గెలుచుకోవడం) సాధ్యం చేసినందుకు.. ఈ క్రెడిట్ మొత్తం నా డైరెక్టర్ ‘సుకుమార్’కు చెందుతుంది. నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాత, చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. వారి ప్రేమకు నేను ఎప్పుడు బద్ధుడను అని అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
పుష్ప 3 ఆలస్యం కావొచ్చు
పుష్ప సినిమా తరువాత పుష్ప 2 సినిమా ప్లాన్ ప్రకారం చిత్రీకరించారు. పుష్ప 3పై ముందుగా ఎలాంటి అంచనాలు లేవని తెలుస్తోంది. పుష్ప 2 భారీ విజయం సాధించిన తరువాత పుష్ప 3 కోసం ప్లాన్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నటుడు అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కూడా వేరువేరు ప్రాజెక్టులలో ఉన్నారు.
అల్లు అర్జున్.. అట్లీతో కలిసి ఏఏ22ఎక్స్ఏ6 (AA22xA6) అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్.. రామ్ చరణ్‌తో కలిసి ఆర్సీ17 (RC17) కోసం పనిచేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పుష్ప 3 షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి బహుశా ఓ రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి పుష్ప 3 షూటింగ్, రిలీజ్ వంటి విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. కాగా పుష్ప 3 సినిమా రిలీజ్ అయితే మాత్రం.. పుష్ప 2 రికార్డులను సైతం అవలీలగా దాటేసే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.