అల్లు అర్జున్ ఫ్యామిలీకి నోటీస్.. కూల్చేయాలంటున్న జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, కట్టడాలకు అడ్డుకట్ట వేయడానికి ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (జీహెచ్ఎంసీ) నడుం బిగించింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడినవారు.. ఎంతటివారైనా వారిని వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ కుటుంబానికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎందుకు నోటీసులు జారీ చేశారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

జూబ్లీహిల్స్ (హైదరాబాద్) రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ భవనం ఉంది. అయితే ఈ భవనంపై అక్రమంగా పెంట్ హౌస్ నిర్మించారని.. జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు సోమవారం షో-కాజ్ నోటీసు జారీ చేసారు. అంతే కాకుండా.. దానిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్నారు.

అనుమతులను అధిగమించిన నిర్మాణం

రెండు సంవత్సరాల క్రితం.. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినెస్ పార్క్ భవనం నిర్మించారు. ఈ భవనంలో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు రెండు సెల్లార్లు మరియు ఒక గ్రౌండ్ ఫ్లోర్ + నాలుగు అంతస్థులకు సుమారు 1226 చదరపు గజాల స్థలంలో నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించింది. అయితే ఇటీవల నాలుగో అంతస్తుపైన ఇంకో నిర్మాణం చెప్పారు.

నాలుగో అంతస్తుపై నిర్మించిన ఈ అక్రమ నిర్మాణం గురించి విచారణ జరపడానికి సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య విచారణకు ఆదేశించారు. ఈ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకుడదో వివరించాలని షో-కాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఈ నోటీసుపై అల్లు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అల్లువారి కుటుంబంపై పడింది. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారు ఎంత పెద్దవారైనా.. ఒకే న్యాయం అంటూ, గతంలో అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్) పేరుతో ఒక బృందం ఏర్పాటు చేసి.. అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ వచ్చింది.

హైడ్రా అక్రమ నిర్మాణాలను దాదాపు అంతమొందిస్తూ వచ్చింది. ఇందులో కొందరు ప్రజలు ఆవాసం లేకుండా.. నిలువ నీడ లేకుండా పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. డబ్బులేని వాళ్ళు బాధపడుతూ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు అక్రమ కట్టడాల తొలగింపులో కొన్ని మార్పులు చేస్తూ.. కారకులను ముందుగా విచారించడం వంటివి చేస్తున్నారు. దీంతో నిర్మాణాల తొలగింపులు ముందుంత లేదు.

ఇప్పటివరకు.. హైడ్రా ఏర్పాటు అయిన తరువాత సుమారు 300 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు సమాచారం. తద్వారా 120.22 ఎకరాల భూమిని పొందింది. అక్రమ నిర్మాణాల కారణంగా అకాల వర్షాల సమయంలో ఇబ్బందులకు గురవుతారని, నీటి ముంపులో చుక్కుకునే ప్రమాదం ఉందని.. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఈ కఠినమైన చర్యలకు పూనుకోవలసి వచ్చింది. ఈ చర్య ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను కూడా కలిగించింది.

Leave a Comment