ఇరాన్ – అమెరికా వార్ ఎఫెక్ట్: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారతదేశంలో మాత్రం.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యూఢిల్లీలోని అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ & డీజిల్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మార్కెట్లపై ప్రభావం!

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉన్న కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ముందుగానే చమురు దిగుమతులను విభిన్న దేశాల నుంచి పొందే విధంగా చర్యలు చేపట్టిందని సమాచారం.

హోర్ముజ్‌పై ఆధారాన్ని తగ్గించిన భారత్!

గతంలో భారత్ చమురు సరఫరాను సుమారు 60 శాతం హోర్ముజ్ మార్గం ద్వారా పొందేది. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పుడు 70 శాతం చమురును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేలా మార్పులు చేసింది. దీంతో మధ్యప్రాచ్య దేశాలపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ అమెరికా, రష్యా, ఆఫ్రికా & ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు పెంచింది. ఈ చర్యల వల్ల మధ్యప్రాచ్యంలో ఏవైనా అంతరాయాలు వచ్చినా దేశీయ మార్కెట్‌పై ప్రభావం తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రజలపై ప్రభావం ఎలా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరల ప్రభావాన్ని కొంతవరకు తమపై భరించడంతో పంపుల వద్ద ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నాయి. ఇది సాధారణ వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే అంశం. ముఖ్యంగా రవాణా ఖర్చులు, సరుకు రవాణా ధరలు పెరగకుండా ఉండటానికి ఇది కీలకం. పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావం కూరగాయలు, ఆహార వస్తువులు సహా అనేక రంగాలపై పడే అవకాశం ఉంటుంది.

LPG ధరలపై వివరణ

ఇటీవల దేశంలోని కొన్ని నగరాల్లో LPG గ్యాస్ ధరలు స్వల్పంగా పెరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ వర్గాలు, ఈ పెరుగుదల పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేదని స్పష్టం చేశాయి. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, అన్ని LPG డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరా నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు

ఇంధన సరఫరా విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ మరియు LPG బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక మెకానిజం అమలు చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత అధికారుల ప్రకారం.. దేశీయ వినియోగదారుల అవసరాలే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యం. అందుకే ఎలాంటి సంక్షోభ పరిస్థితులు వచ్చినా ప్రజలకు ఇంధన సరఫరా నిలిచిపోకుండా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హోర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత

ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు వస్తున్న థాయ్ జెండా కలిగిన ఓ కార్గో నౌకపై హోర్ముజ్ సమీపంలో దాడి జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం రవాణా అవుతుంది.

భారత్ మొత్తం LPG అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారా పొందుతుంది. అందులో 80 నుంచి 90 శాతం వరకు మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. అందుకే హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగితే భారత ఇంధన మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్ల ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Also Read: ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు: నేను అనుకుంటే..