Tuesday, January 27, 2026

మహీంద్రా థార్ రాక్స్ ‘స్టార్ ఎడిషన్’ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

మహీంద్రా థార్ కారుకు దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అటు అమ్మకాల్లో.. ఇటు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్న ఈ ఆఫ్ రోడర్‌ను కంపెనీ ఇప్పుడు రాక్స్ స్టార్ ఎడిషన్ పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 16.85 లక్షల నుంచి రూ. 18.35 లక్షల మధ్య ఉంది. ఈ సరికొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సరికొత్త మహీంద్రా రాక్స్ థార్ స్టార్ ఎడిషన్.. సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ గ్రాఫిక్ డిజైన్స్ పొందింది. డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు.. మెటాలిక్ ఫినిషింగ్ పొందుతుంది. చూడటానికి ఇది కొంత స్టాండర్డ్ టాప్ ఎండ్ మోడల్ మాదిరిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి.

డిజైన్ & కలర్ ఆప్షన్స్!

గ్రిల్, బంపర్, లైటింగ్ సెటప్ అన్నీ కూడా సాధారణ థార్ మాదిరిగానే ఉన్నాయి. అయితే రాక్స్ థార్ స్టార్ ఎడిషన్ వెనుక భాగంలో.. ప్రత్యేకమైన బ్యాడ్జ్ కనిపిస్తుంది. కాగా ఈ మోడల్ టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. లోపలి భాగం దాదాపు నలుపు రంగులో ఉంది. లెదర్ సీట్లు కనిపిస్తాయి. రూప్ లైనింగ్ గోధుమ రంగులో ఉంది. డోర్ ప్యానెల్స్ బేజ్ కలర్ పొందుతాయి. అంటే ఇది డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ పొందుతుందన్నమాట.

ఇంటీరియర్ ఫీచర్స్ ఇలా..

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమాటిక్ టెంపరేచర్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, టైర్ డైరెక్షన్ మానిటరింగ్ సిస్టం, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఉన్నాయి.

అదే ఇంజిన్

సరికొత్త థార్ రాక్స్ స్టార్ ఎడిషన్.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఈ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ రెండూ కూడా మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. కాగా ఇది రియర్ వీల్ డ్రైవ్ సిస్టం ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా ఇది సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

పెరిగిన థార్ ధరలు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. తన ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ థార్ ధరలను రూ. 20,000 పెంచింది. పెరిగిన ధరలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ఇప్పటికే కారును బుక్ చేసుకున్నవారికి పాత ధరలే వర్తిస్తాయి. ఇకపై థార్ కొనాలంటే.. అదనంగా రూ. 20వేలు చెల్లించాల్సిందే. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల.. థార్ ధరలను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

కాగా ఇప్పటికే మన దేశంలోని చాలా కంపెనీలు (టయోటా, మారుతి సుజుకి, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ, హీరోమోటోకార్ప్ మొదలైనవి) తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఇందులో కార్లు మాత్రమే కాకుండా.. బైకులు ఉన్నాయి. ఏడాది మారిన తరువాత లేదా కొత్త ఏడాది పుట్టినప్పుడు ప్రతిసారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పద్దతిని పాటిస్తూ.. ధరలను పెంచడం జరిగింది.

Sourya Vardan
Sourya Vardan
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.

Related Articles