ప్రతిరోజూ ఉదయం కొబ్బరినీళ్లు తాగితే.. 30 రోజుల్లో జరిగే మార్పులు ఇవే!

కంప్యూటర్ యుగంలో ప్రతిరోజూ ఉదయం నీరు తాగడం లేదా కాఫీ, టీ వంటివి తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. అయితే కొంతమందికి ఉదయం కొబ్బరినీళ్లు తాగితేగానీ రోజు ప్రారంభం కాదు. అసలే ఎండాకాలం కూడా వచ్చేసింది. ఈ జాబితాలోకి చేరేవాళ్ల సంఖ్య ఇంకొంచెం పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం కొబ్బరినీళ్లు తాగితే ఏమవుతుంది?, 30 రోజుల్లో శరీరంలో జరిగే మార్పులు ఏవి అనే విషయాలకు ఇక్కడ సమాధానం.

రాత్రి మొత్తం నిద్రలో ఉన్న సమయంలో.. శరీరంలో కొంతమేర డీహైడ్రేషన్ జరుగుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే శరీరానికి తిరిగి ద్రవాలు అవసరం అవుతాయి. ఈ సమయంలో కొబ్బరి నీరు తాగడం వల్ల సహజ ఎలక్ట్రోలైట్స్ అయిన పొటాషియం, మెగ్నీషియం త్వరగా శరీరానికి అందుతాయి. ఇవి శరీరంలోని ద్రవ సమతుల్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియపై ప్రభావం ఇలా..

ఉదయం కొబ్బరి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా తేలికగా ఉండటంతో కడుపుపై ఒత్తిడి లేకుండా జీర్ణవ్యవస్థను మెల్లగా సక్రియం చేస్తుంది. కొన్ని వారాల పాటు ఈ అలవాటు కొనసాగిస్తే కొంతమందిలో కడుపు ఉబ్బరం తగ్గడం, మలబద్ధకం సమస్య తగ్గడం వంటి మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి సరైన హైడ్రేషన్ లభించడం వల్ల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ కూడా సులభమవుతుంది.

రక్తపోటు & గుండె ఆరోగ్యంపై ప్రభావం

కొబ్బరి నీరులో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగితే.. పొటాషియం సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో రక్తపోటు నియంత్రణకు సహాయపడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా పండ్లు & కూరగాయలు కొంత తక్కువ మోతాదులో తీసుకునే వారికి ఇది కొంత వరకు ఉపయోగపడవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సరైన ఎలక్ట్రోలైట్ సమతుల్యత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

చర్మం & జుట్టుపై మార్పులు

శరీరంలో హైడ్రేషన్ మెరుగుపడితే దాని ప్రభావం బయట కూడా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వారాల తర్వాత కొంతమందిలో చర్మం మసకబారడం తగ్గడం, పెదవులు ఎండిపోవడం తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే ఇది ఏదైనా అద్భుతం వల్ల జరిగేది కాదని, శరీరానికి సరైన నీరు, ఖనిజాలు అందడం వల్లే ఈ మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడంతో సహాయపడుతుందా?

కొబ్బరి నీరు నేరుగా కొవ్వు కరిగించదు. కానీ ఉదయం తాగితే ఆకలి తగ్గించడంలో సహాయపడవచ్చు. శరీరం సరైన హైడ్రేషన్‌లో ఉంటే ఆకలి సంకేతాలు స్పష్టంగా గుర్తించగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనవసరమైన తినుబండారాలు తగ్గి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేయడానికి అవకాశం ఉంటుంది.

తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

సాధారణంగా చాలా మంది కొబ్బరి నీరును సులభంగా తీసుకోవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమిత పరిమాణంలో మాత్రమే కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి.

నిపుణుల సూచనల ప్రకారం శరీరానికి రోజుకు 200–250 మిల్లీలీటర్లు మాత్రమే సరిపోతుంది. ముఖ్యంగా చక్కెర పానీయాలకు బదులుగా తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. తాజా సహజ కొబ్బరి నీరు తీసుకోవడం ఉత్తమ ఎంపిక అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

30 రోజుల తర్వాత కనిపించే మార్పులు

ఉదయం కొబ్బరి నీరు తాగే అలవాటు 30 రోజుల పాటు కొనసాగిస్తే ప్రధానంగా హైడ్రేషన్ మెరుగుపడటం, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఉదయం తాజాదనం పెరగడం వంటి ప్రయోజనాలు కనిపించే అవకాశం ఉంది. అయితే దీని అసలు ప్రయోజనం సమతుల్య జీవనశైలితో కలిపి.. పాటించినప్పుడే పూర్తిగా కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Also Read: సరైన ఆరోగ్యం కోసం.. ఏ వయసువారు ఎంత సమయం వాకింగ్ చేయాలి?