Tuesday, January 27, 2026

జాతీయ ఓటర్ల దినోత్సవం: ఇదేనా అంబేద్కర్ కోరుకుంది?.. ప్రజలు చేస్తున్నదేమిటి!

ఈ రోజు (ఆదివారం) భారత జాతీయ ఓటర్ల దినోత్సవం. దేశం అంతటా ఇవాళ ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించుకుని.. అన్ని చోట్లా ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. 1950 జనవరి 25న మనకు భారతదేశంలో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడింది. దానిని పురష్కరించుకుని 2011 నుంచి ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాము. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అన్నిటిలోనూ వేడుకగా నిర్వహిస్తారు. కొంతమంది ప్రముఖులు ఓటు ఆవశ్యకతను, ప్రయోజనాన్ని ఈ సందర్బంగా తెలియజేస్తారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఓటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు ఓటు కార్డును అందజేస్తారు. ఇవాళ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

చదువుకున్నవారికే ఓటు హక్కు!

బ్రటీషర్స్ రాకముందు రాచరిక వ్యవస్థ అమలులో ఉండేది. కాబట్టి ప్రజలు తమ ప్రతినిధిని.. అంటే తమ పరిపాలనను చూసుకునే బాధ్యతాయుతమైన నాయకున్ని ఎన్నుకునే అవకాశం లేదు. ఎవరో ఒకరి కింద, ప్రజలు బానిసలుగా బతికిన కాలాలు ఉన్నాయి. ఆ తరువాత భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు.. బ్రిటిష్ ఇండియా కాలంలో కేవలం చదువుకున్న వారికి, డబ్బు ఉన్నవారికి అలా ఒక అర్హత కలిగిన వారికి మాత్రమే ఓటు హక్కు వుండేది. అందులోనూ మహిళలకు గానీ తక్కిన నిమ్నవర్గాల ప్రజలకు గానీ ఓటు వేసే హక్కు లేకుండా ఉండేది. ఇక్కడ చదువులేని, సంపదలేని, అధికారం లేని వ్యక్తులు తమ బాగోగులు చూసుకునే మనిషిని ఎంచుకోవడంలో హక్కును కోల్పోయారు. దాంతో వారు ఎవరికి పట్టనివారిగా ఉండిపోయారు. తమని పరిపాలిస్తున్న వారిని తాము ఎన్నుకోరు కాబట్టి మహిళలు, అణగారిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకోలేరు. ఎప్పటికి వారి సమస్యలు తీరవు.

అంబేద్కర్ పోరాటం..

వీటిని గమనించినటువంటి అత్యంత విద్యావంతుడైన మేధావి, లాయర్, భారత స్వాతంత్ర సమర యోధుడు, హక్కుల ప్రధాత, రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త, ప్రొఫెసర్, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమకారుడు, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అప్పుడు జరిగిన ప్రతి సమావేశంలో కూడా ఓటు హక్కు కోసం విపరీతంగా పోరాటం చేశారు.

మహిళలకు, నిమ్నవర్గాల ప్రజలకు చదువు, సంపద, హోదాతో సంబంధం లేకుండా వయోజనులు అయినటు వంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలి అని సైమన్ కమిషన్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, రాజ్యాంగ పరిషత్తు సభలో కావచ్చు, అవకాశం ఉన్న ప్రతి చోట ఓటు హక్కు కోసం అంబేద్కర్ తన యొక్క మాటలతో, రాతలతో అనేక విధాలుగా అలుపెరుగని పోరాటం చేశారు. చివరికి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కుల, మత, ప్రాంత, వర్గ, లింగ బేధాలు లేకుండా ఓటు హక్కును తీసుకురావడంలో ఎనలేని కృషి చేసి మొత్తానికి తమని పాలించేవారిని తామే ఎన్నుకునే అవకాశాన్ని సాధించారు అంబేద్కర్. భారత రాజ్యాంగం ద్వారా ఓటు కు ఒక సుస్థిర స్థానం కల్పించారు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్.

ఓటు యొక్క ముఖ్య ఉద్దేశ్యం

భారత రాజ్యాంగ సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటుతో ప్రజలు తమ యొక్క భవిష్యత్తు నిర్మించే నాయకున్ని లేదా ప్రతినిధి నిర్ణయించడం కోసం ఉపయోగించాలి. తమని ఎవరు పరిపాలించాలి, ఎవరు తమ యొక్క మంచి చెడులు చూసుకుంటారు, తమ జీవితాలకు ఎవరు సరైన భరోసా ఇవ్వగలరు, తమ ప్రాంతం అభివృద్ధిని ఎవరు సరిగ్గా సమర్థవంతంగా నడిపించగలరు అనేది ప్రజలు వారికి కల్పించిన ఓటు హక్కు ద్వారా నిర్ణయించుకోగలరు. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉండాలో ఎవరు దిగిపోవాలో ఓటు నిర్ణయిస్తుంది. ఇక్కడ ఓటు వేయకుండా ఉండటం అనేది ఒక రకంగా నేరం అనే చెప్పాలి. ఎందుకు అంటే తమ భవిష్యత్తుకు సంబంధించిన పోరులో పాల్గొనకపోవడం వలన ఆ నిర్ణయం వేరొక్కరు తీసుకుంటారు. నువ్వు సరైన ప్రతినిధిని ఎన్నుకోకపోవడం వలన సమాజం తప్పు దారిలో నడిచే అవకాశం ఉంటుంది. అందుకు ఓటు వేయని వారంతా బాధ్యులవుతారు. కాబట్టి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అనేది ఓటు ఉన్నవారి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి అప్పుడే ప్రజాస్వామిక దేశంగా మారుతుంది.

అంబేద్కర్ భావించింది ఇదేనా?

ఓటు హక్కు పొందడం ద్వారా అణగారిన వర్గాలు, మహిళలు వారికి ఉన్న అనేక రకాలైన సమస్యలను, బాధలను తీర్చే వారి సమూహాలకు చెందిన నాయకులను ఎన్నుకుంటారు. ఓటు హక్కు ఉండటం కారణంగా నాయకులు కూడా ప్రజల యొక్క నివాస ప్రాంతాలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటారని అంబేద్కర్ భావించారు. తద్వారా బడుగు, బలహీన, దళిత వర్గాల ప్రజలు తమలోనుంచే ఒక నాయకున్ని తయారు చేసుకుని అధికారం వైపు అడుగులు వేస్తారు అని అంబేద్కర్ అనుకున్నారు. కానీ ఆయన ఏమి ఆశించారో అది నెరవేరలేదు. ఈ నిమ్నవర్గాల జనాలు తమ వేలితో తమ కంటినే పొడుచుకుంటున్నారు.

తమ హక్కును సక్రమంగా ఒక్కరోజు వినియోగించుకున్నా చాలు దేశంలో ఒక సంచలనం సృష్టించబడుతుంది. తమ హక్కులు ఏమిటి, అవి ఎవరికోసం సృష్టించబడ్డాయి, దేనికోసం అనేది తాము తెలుసుకోలేనంత కాలం అధికారం పొందలేరు, అణిచివేతను ఆదిగమించలేరు. అంబేద్కర్ కోరుకున్న సమసమాజాన్ని, సమానత్వాన్ని నిర్మించలేరు. నీ ఓటును నీవు (మీకు)వేసుకుంటే నువ్వు రాజువు అవుతావు, లేకుంటే ఎప్పటికి ఒకరి కింద బానిసగా మిగిలిపోతావు. అంబేద్కర్ కోరుకున్నది జరగాలి అంటే మొదట ఓటు హక్కు ఎప్పుడు, ఎందుకు, ఎలా మనకు వచ్చిందో దాని చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారు!

కొంత వరకు అది సాధ్యం అయినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం అమలు కాలేకపోయింది. ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు ఇప్పటికీ సరైన విద్యను అందించలేదు, దాని కారణంగా సరైన జ్ఞానం మరియు అవగాహన జనాలకు అందలేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిపక్వత లేనికారణంగా ఎవరు తమ సరైన ప్రతినిధి అనేది నేటికీ తెలుసుకోలేని స్థితిలోకి నెట్టివేయబడ్డారు. నాయకులు నైతికత కోల్పోయారు, చట్టపరంగా నడుచుకోవాల్సిన రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంగించి అక్రమంగా ప్రజలను భయపెట్టి, ప్రలోబపెట్టి ఓటును కొనుక్కుంటున్నారు.

ప్రజాస్వామ్యం యొక్క అసలు స్వరూపాన్ని మార్చివేశారు. డబ్బుకు, మందుకు, చీరలుకు, ఉంగరాలుకు, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక ప్రలోభాలకు లోనయ్యి ప్రజలు తమ ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఓటును కొనడం అమ్మడం చేసి జీవితాలను తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పొచ్చు. వ్యవస్థ మొత్తంలో ఒక పెను తుఫాన్ లాగా విప్లవాత్మకమైన మార్పు సంభవిస్తే తప్పా ఈ పరిస్థితి మారే స్థితిలో లేని విధంగా ఈరోజు సంస్థలు, వ్యవస్థ బ్రష్టు పట్టిపోయాయి.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.