జాతీయ రహదారులపై వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను 2014లో ప్రారంభించింది. ఆ తరువాత 2019 నుంచి ఫోర్ వీలర్స్ అన్నీ కూడా తప్పకుండా ఫాస్ట్‌ట్యాగ్ కలిగి ఉండాలని ఆదేశించింది. ఆ తరువాత కాలక్రమంలో టోల్ కలెక్షన్ విధానంలో చాలా మార్పులే వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 1 నుంచి మరో కీలక మార్పు రానున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.
2026 ఏప్రిల్ 1 నుంచి..
ఎన్‌హెచ్‌ఏఐ ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని జాతీయ రహదారులలో ఉన్న టోల్ ప్లాజాలలో నగదు లావాదేవీలు ఉండవు. ఈ రకమైన లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇది అమలులోకి వచ్చిన తరువాత అన్ని టోల్ ప్లాజాలలో.. టోల్ చెల్లింపులు కేవలం యూపీఐ లేదా ఫాస్ట్‌ట్యాగ్ ద్వారానే జరుగుతాయి.
ప్రస్తుతం టోల్ కలెక్షన్ ఇలా..
రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుతం 98 శాతం కంటే ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్ ద్వారానే టోల్ వసూలు జరుగుతోంది. ఈ విధానం చాలా సులభం, టోల్ గేటు వద్ద వేచి ఉండాల్సిన సమయం తగ్గుతుంది. కాగా యూపీఐ సౌకర్యాలు కూడా ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ గేటులోకి ప్రవేశించాలంటే లేదా టోల్ ఫీజును క్యాష్ రూపంలో చెల్లించాలంటే.. సాధారణంగా చెల్లించాల్సిన రుసుము కంటే రెండింతలు చెల్లించాలి. ఒకవేళా యూపీఐ ద్వారా చెల్లించాలంటే 1.25 శాతం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
నగదు చెల్లింపుల నిషేధానికి కారణం!
మంత్రిత్వ శాఖ ప్రకారం.. టోల్ ప్లాజాలలో క్యాష్ చెల్లింపులు స్వీకరిస్తే వెనుక ఉన్న వాహనాలు వేచి ఉండాల్సి వస్తుంది. తద్వారా రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఇది వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది. రద్దీని పూర్తిగా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి తెచ్చింది. డిజిటల్ చెల్లింపులు (యూపీఐ) వల్ల కూడా ఆలస్యం (నెట్ వర్క్ సమస్యల కారణంగా) అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని కూడా భవిష్యత్తులో నిషేధిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఫాస్ట్‌ట్యాగ్ టోల్ కలెక్షన్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. టోల్ గేట్ల దగ్గర వాహనాలు వేచి ఉండాల్సిన సమయం చాలా తగ్గిపోయింది. టోల్ చెల్లింపులు సులభమైపోయాయి. టోల్ చెల్లింపుల్లో జరిగే అవకతవకలకు ఫులుస్టాప్ పడింది. ఇలా ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత చాలా అనుకూలంగా మారిపోయింది.
యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్
ఫాస్ట్‌ట్యాగ్ విధానంలో కూడా కొన్ని అప్డేట్స్ జరిగాయి. ఇందులో భాగంగానే యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ ఫాస్ట్‌ట్యాగ్ కోసం ఏడాదిలో మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు యాన్యువల్ ఫాస్ట్‌ట్యాగ్ కోసం ఏడాదికి ఒకసారి 3000 చెల్లించి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరచుగా హైవేల్లో ప్రయాణించేవారికి ఇలాంటి ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగకరంగా ఉంటుంది. కొంత సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి వాహనదారులు తమ అవసరాల దృష్ట్యా.. ఏ ఫాస్ట్‌ట్యాగ్ కావాలో ఎంచుకోవచ్చు. టోల్ ప్లాజాలలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.