2026లో సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు.. గుర్తుంచుకోవాల్సిన 10 విషయాలు!

ఎప్పుడైనా కొత్త కార్లకు మాత్రమే కాదు, పాత కార్లకు లేదా సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అంటే.. చాలామంది పాత కార్లను కూడా కొంటున్నారన్నమాట. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే?, పాత కారు కొనేటప్పుడు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కథనంలో అలాంటి అంశాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.

బడ్జెట్

పాత కారు అయినా.. కొత్త కారు అయినా బడ్జెట్ అనేది ముఖ్యమైన అంశం. ఎందుకంటే మీ బడ్జెట్ ఎంత?, కారు కోసం ఎంత కేటాయించాలనుకుంటున్నారు? అనే విషయాలను తప్పకుండా ముందుగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కేవలం కారు కోసం మాత్రమే కాకుండా.. రీ-రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇన్సూరెన్స్ బదిలీ కోసం, చిన్న చిన్న సర్వీసింగ్ కోసం కూడా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. సీటు కవర్లు మార్చుకోవడం, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అల్లాయ్ వీల్స్ వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నింటినీ బడ్జెట్లోనే చూసుకోవాలి.

అవసరం

మీరు ఎలాంటి అవసరం కోసం కారును కొనుగోలు చేస్తున్నారో ముందుగానే ఆలోచించాలి. నగరంలో తిరగడానికా?, లాంగ్ డ్రైవ్ వెళ్లడానికా? అని నిర్దేశించుకుంటే.. మైలేజ్, క్యాబిన్ స్పేస్ ఎలా ఉండాలో ముందుగానే నిర్దేశించుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ మోడల్ కావాలా మాన్యువల్ లేదా ఆటోమాటిక్ కావాలా అనేది కూడా ఎంచుకోవచ్చు.

రీసెర్చ్

కారు కొనేముందు రీసెర్చ్ చేయడం మర్చిపోవద్దు. రివ్యూలు చదవండి, పాత కార్ల విలువ మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోండి. ఎక్కువగా కార్లలో ఉండే సమస్యలను తెలుసుకోండి. మీరు కొనే కారుకు సంబంధించిన యాక్ససరీస్ లేదా విడిభాగాలు మీకు దగ్గరలోనే లభిస్తున్నాయా? లేదా? అని తెలుసుకోండి. కారు ఏ కండిషన్లో ఉందనే విషయం గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

చెక్ చేయడం & టెస్ట్ డ్రైవ్

కేవలం ఆన్‌లైన్‌లో కనిపించే ఫోటోలు చూసి మోసపోవద్దు. మీరు దగ్గరుండి కారును చెక్ చేయండి. ఎక్కడైనా తుప్పు పట్టిందా?, డెంట్స్ ఏమైనా ఉన్నాయా? అనే విషయాలు చెక్ చేసుకోండి. విండోస్, లైట్స్,డాష్‌బోర్డ్ వంటి వాటిని తనిఖీ చేయాల్సి ఉంటుంది. అంతటితో ఆగిపోకుండా.. కనీసం నాలుగు లేదా ఐదు సార్లు టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇంజిన్, బ్రేక్స్, సస్పెన్షన్స్ వంటి వాటిని చెక్ చేసుకోండి. క్లచ్, గేర్లు, స్టీరింగ్ కూడా చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే.. నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

వెహికల్ హిస్టరీ

కారు కొనేముందు.. ఆ కారు వయసు ఎంత అనేది తప్పకుండా తెలుసుకోవాలి. మీరు కొనే కారుమీద నేరపూరితమైన కేసులు ఉన్నాయా?, ఇన్సూరెన్స్ ఉందా? అప్పటికే ఏమైనా ప్రమాదాల బారిన పడిందా?, అనే విషయాలు తనిఖీ చేసుకోండి. కారులో ఏదైనా సమస్యను గుర్తించకపోతే.. అది చాలా పెద్ద ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి.

మైలేజ్

కారును కొన్నప్పుడు ఇచ్చే మైలేజ్.. రాను రాను లేదా ఉపయోగిస్తున్న సమయంలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మైలేజ్ చెక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. అంతే కాకుండా భారతదేశంలో సగటు వినియోగం ఏడాదికి 12000 కిమీ నుంచు 15000 మాత్రమే. కాబట్టి దీనిని గమనించాలి. కారు ఎక్కువ దూరం ప్రయాణించి ఉంటే.. ఇంజిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

సర్వీస్ రికార్డ్స్ & మెయింటెన్స్

ఒక కారు ఎంత బాగుంది అనే విషయాన్ని చెప్పేది సర్వీస్ రికార్డ్స్ మాత్రమే. కాబట్టి మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా వీటిని గమనించాల్సి ఉంటుంది. బ్రేకింగ్ చెక్, ఆయిల్ చెకప్, తరువాత షెడ్యూల్ చేసిన సర్వీస్ వంటి వాటిని చెక్ చేసుకోవాల్సిందే. రికార్డ్స్ తప్పిపోయాయని చెబితే.. ఆ విషయంలో తప్పకుండా కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇది భవిష్యత్తులో సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇన్సూరెన్స్ & మెయింటెనెన్స్ ఖర్చులు

కారు ధరకంటే కూడా.. మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటే తప్పకుండా ఒకింత ఆలోచించాల్సిందే. ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివ్‌గా ఉందో లేదో అనే విషయం కూడా ముందుగానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర కవరేజ్ ఉంటే బెస్ట్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే.. అది చెల్లుబాటు అయ్యేదిగా ఉండేలా చూసుకోవడం మంచిది. మెయింటెనెన్స్ ఫీజులు కొంత తక్కువగా ఉండేలా లేదా ఉండేటువంటి వాహనాలను ఎంచుకోవడం మంచిది.

మార్కెట్ వాల్యూ

మీరు కేనుగోలు చేయబోతున్న కారుకు మార్కెట్లో ఎంత ధర ఉంది అనే విషయం గమనించాలి. కొనుగోలు చేసేటప్పుడు మధ్యవర్తులను అస్సలు నమ్మకూడదు. నేరుగా విక్రేతతోనే మాట్లాడండి. ఎక్కువ ధర ఉంటే.. ఇతర కార్లతో దాని ధరను పోల్చుకోండి.

డాక్యుమెంట్స్

ఎక్కడైనా.. యూజ్డ్ కారును కొనుగోలు చేస్తున్నామంటే దానికి కావాల్సిన లేదా సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా?, లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆర్సీ ఛాసిస్, ఇంజిన్ నెంబర్ సరిపోలుతున్నాయా? అని చూడాలి. పొల్యూషన్ సర్టిఫికెట్. ఇన్సూరెన్స్ పత్రాలు ఉన్నాయా? చూడాలి. కారు మీద ఏదైనా లోన్ ఉంటే.. అది పూర్తిగా చెల్లించారా? లేదా చూసుకోవాలి.