24 గంటలు టైమిస్తున్నా.. ఇక సహించలేను: రష్మిక హెచ్చరిక

సినీ నటి రష్మిక మందన్నా కుటుంబానికి సంబంధించినట్లు చెబుతున్న ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వ్యక్తిగత సంభాషణను అనుమతి లేకుండా.. రికార్డ్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఇది ప్రైవసీకి భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో చర్చ

ఈ వివాదం.. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించిన ఒక ఆడియో క్లిప్‌తో మొదలైంది. ఆ క్లిప్‌లో రష్మిక కుటుంబ సభ్యుడి మాటలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఆమె గతంలో నటుడు రక్షిత్ శెట్టి‌తో ఉన్న సంబంధంపై వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ ఆడియో నిజమా? కాదా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. వ్యక్తిగత సంభాషణలను అనుమతి లేకుండా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. సెలబ్రిటీల ప్రైవసీ పరిరక్షణపై కూడా చర్చ మొదలైంది.

ఎనిమిదేళ్ల క్రితం సంభాషణ

రష్మిక మందన్నా తన అధికారిక సోషల్ మీడియా వేదికలో చేసిన ప్రకటనలో ఈ ఆడియో క్లిప్ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన వ్యక్తిగత సంభాషణకు చెందినది తెలిపారు. ఆ సంభాషణను తమకు తెలియకుండా రికార్డ్ చేసి ఇప్పుడు బయటకు తెచ్చారని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా.. పూర్తి సంభాషణను కాకుండా, కేవలం చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అసలు విషయం పూర్తిగా తప్పుగా అర్థమవుతోందని రష్మిక తెలిపారు.

తనపై గత ఎనిమిదేళ్లుగా తప్పుడు సమాచారం, ట్రోలింగ్, వ్యక్తిగత దాడులు కొనసాగుతున్నాయని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆపాదించిన కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా తప్పుగా ప్రచారం అయ్యాయని ఆమె పేర్కొన్నారు.

ఇక మౌనం వహించలేను

ఇప్పటి వరకు ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ తాను సహనంగా మౌనం పాటించానని రష్మిక తెలిపారు. కానీ గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు మాత్రం తాను ఇక పట్టించుకోకుండా ఉండలేని స్థితికి తీసుకువచ్చాయని చెప్పారు. ప్రత్యేకంగా ఈ ఘటన వల్ల తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయానికి వారికేమీ సంబంధం లేకపోయినా వారిని కూడా ఈ వివాదంలోకి లాగడం బాధాకరమని చెప్పారు.

లీక్ ఆడియోను ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, అది పరువు నష్టం కలిగించేలా ఉందని రష్మిక మండన్నా స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా సంస్థలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. 24 గంటల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత కూడా కంటెంట్ కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

పెళ్లి తర్వాత వివాదం

ఇదిలా ఉండగా కొన్ని రోజులకు ముందు రష్మిక మందన్నా, నటుడు విజయ్ దేవరకొండను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు. తరువాత హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం.. ఘనమైన రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆడియో వివాదం వెలుగులోకి రావడం గమనార్హం.

రష్మిక మందన్నా తన ట్వీట్ చివరలో తన మాతృభాష కొడవా టక్‌లో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రిసెప్షన్‌లో ధరించిన తన దుస్తుల ఫోటోను కూడా ఆమె పంచుకున్నారు. ఆ దుస్తులపై కొడవా సంస్కృతికి సంబంధించిన ఎంబ్రాయిడరీ చిహ్నం ఉండటం ఆమె మూలాలను గుర్తు చేస్తుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి.. విడాకులు తీసుకున్న నటి హన్సిక