Tuesday, January 27, 2026

దేశభక్తి చాటుకున్న విద్యార్థులు: అట్టహాసంగా జరిగిన ‘వెరిటాస్’ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ (ప్రైవేట్ సైనిక్ స్కూల్) ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. అదే విధంగా ఈ రోజు (జనవరి 26) 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. పది ఎకరాలపైన విస్తీర్ణం కలిగిన వెరిటాస్ పరేడ్ గ్రౌండ్‌లో దాదాపు పదిహేడు వందల మంది విద్యార్థులతో భారీ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మేజర్ జనరల్ డాక్టర్ అఫ్తాబ్ ఆలమ్ (రిటైర్డ్) & గౌరవ అతిధిగా ఎయిర్ కమాండర్ డాక్టర్ అంజలి ఆలమ్ (రిటైర్డ్) హాజరయ్యారు.

కార్యక్రమ విశేషాలు

ఉదయం 7:30 గంటల నుంచి 11:30 వరకు ఆద్యంతం అట్టహాసంగా ఎంతో ఆసక్తిగా ఈ వేడుక కొనసాగింది. మొదటగా మేజర్ జనరల్ అప్తాబ్ ఆలమ్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థులు అతిధికి గౌరవ సలామ్ చేశారు. ఆ తరువాత  వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు అందరూ పరేడ్ గ్రౌండ్‌లో కవాతు చేశారు. సుమారు ముప్పై నిముషాల పాటు సాగిన ఈ మార్చింగ్‌లో పదిహేడు వందలమంది విద్యార్థులు దేశం పట్ల వారికున్న ప్రేమని, అభిమానాన్ని, దేశభక్తిని చాటుకున్నారు.

హౌస్‌వైజ్ ఎవరికి వారు పోటాపోటీగా వారిలో దాగున్న శ్రద్ధ, పట్టుదలను ప్రదర్శించారు. చూసేంతసేపు చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా అనిపించింది. వీక్షకులు కూడా విద్యార్థుల కవాతును ప్రశంశిస్తూ చప్పట్లతో సభా ప్రాంగణం అంతా మారుమ్రోగించారు. మార్చింగ్‌లో మాణిక్ష హౌస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, 2025-26 సంవత్సరానికి సంబంధించిన అబ్దుల్ కలామ్ హౌస్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అందుకునింది.

మేజర్ జనరల్ అప్తాబ్ ఆలమ్ మాట్లాడుతూ..

మన దేశానికి 76 సంవత్సరాల క్రితం పరిపాలన, రాజకీయ పరమైన ఎటువంటి అధికారాలు, హక్కులు లేకుండా ఉండేవని ఆ తరువాత డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే మనకు అన్నీ లభించబడ్డాయని చెప్పుకొచ్చారు. అబ్దుల్ కలామ్ చెప్పినట్టు కోట్ల మంది యువ శక్తి భారతదేశంలో ఉందని.. వారే రేపటి భవిష్యత్తు అన్నారు. విద్యార్థుల గురించి చెబుతూ అందరూ కూడా ఐకమత్యంతో అద్భుత ప్రదర్శన చేశారన్నారు. మాకు ఈ భుజాల పైన స్టార్స్, యూనిఫామ్ ఉంటాయి, కానీ.. దేశం కోసం సేవ చేయడం అనేది గొప్ప విషయంగా, అదే అంతిమ లక్ష్యంగా భావిస్తామని అన్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలని హితవు పలికారు. విద్యార్థులు అంతా చక్కటి క్రమశిక్షణ, ప్రవర్తనతో ఉన్నారని, మిమ్మల్ని చూస్తుంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో భద్రంగా ఉంటుందని నేను నమ్ముతున్నానుని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఈవెంట్ హైలెట్స్

➤పరేడ్
➤స్కూల్ ఎన్‌సీసీ బ్యాండ్
➤పిరమిడ్స్
➤సెక్షన్ బ్యాటిల్ డ్రిల్
➤రైఫిల్ డ్రిల్
➤రైఫిల్ షూటింగ్

స్టూడెంట్స్ చూపించిన ధైర్య సాహసాలు వాళ్ల నిబద్దతకి, కఠోర శ్రమకి, దేశం కోసం తమవంతు భక్తిని నిరూపించుకోవాలనే తపనకి నిదర్శనంగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన ఈ సాహసోపేతమైన కార్యక్రమాలు చూస్తే నిజమైన ఆర్మీ జవాన్లను చూసినట్టే అనిపించిందని.. చూడటానికి వచ్చిన వాళ్లు చెప్పుకొచ్చారు. అసలైన గణతంత్ర వేడుకలు ఎలా ఉంటాయో మా కళ్లారా చూసే అవకాశం ఈ విధంగా నెరవేరిందని కొనియాడారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

➤హూప్ డాన్స్
➤లెజిమ్స్
➤జుంబా డాన్స్
➤డంబెల్ డిస్‌ప్లే డాన్స్
➤చిల్డ్రన్స్ నేషనల్ లీడర్స్ ఫ్యాన్సీ డ్రెస్స్
➤పెట్రియాటిక్ సాంగ్ డాన్స్

దేశ నాయకుల ఫ్యాన్సీ డ్రెస్‌లో చిన్న పిల్లలు మాట్లాడిన ముద్దు ముద్దు మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. డ్యాన్స్‌లు అన్నీ కూడా ఉత్సహాన్ని, ఉతేజాన్ని రేకెత్తించాయి. ఈ సాంస్కృతిక  కార్యక్రమాల్లో అడుగడుగునా దేశం మీద వారి అంకితభావం మాత్రమే కనిపించింది.

ఐదు వేల మందితో..

వెరిటాస్ పాఠశాల యాజమాన్యం డైరెక్టర్స్ శ్రీకర్ రెడ్డి, సందీప్ రెడ్డి, సారిక రెడ్డితో పాటు డీన్ ఎయిర్ కమాండర్ సిజిహెచ్. ఖాన్ (రిటైర్డ్), ప్రిన్సిపాల్ పిఆర్ఎస్. చక్రవర్తి, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతే కాకుండా కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన తిరుపతి & పరిసర ప్రాంత వాసులు అందరితో కలిపి సభా ప్రాంగణం మొత్తం వేల మందితో నిండిపోయింది. ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో దాదాపుగా ఐదు వేలమంది పాల్గొన్నారని అంచనా. వచ్చిన వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ప్రతి ఒక్కరికి తాగునీరు, చిరు ఆహర పదార్థాలను అందించడమే కాకుండా, మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి ఉత్సవంలో భాగం అయినందుకు అందరూ సంతోషాన్ని, అనుభవాన్ని, అనుభూతిని వ్యక్తపరిచారు.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.