సోషల్ మీడియా ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వినియోగ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితిని మాత్రమే కాకుండా.. వారి భవిష్యత్తు భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలను కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల చిన్నారుల్లో డిజిటల్ వ్యసనం, సైబర్ బుల్లీయింగ్, అనుచిత కంటెంట్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే దిశగా అడుగులు వేయడానికి సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే చట్టాన్ని మరో 90 రోజుల్లో తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో భారతదేశంలో పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం అనే అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం!
పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం అనే అంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా గత సంవత్సరం తీసుకొచ్చిన చట్టం ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. అక్కడి (ఆస్ట్రేలియా) ప్రభుత్వం సోషల్ మీడియా వాడకానికి కనీస వయస్సును 16 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించకుండా ప్లాట్‌ఫామ్‌లు చర్యలు తీసుకోవాలి.
ఇదే విషయాన్ని ఇటీవల ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్ కూడా ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో కూడా 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. స్పెయిన్ సహా మరికొన్ని యూరోప్ దేశాలు కూడా ఇదే విధానం అనుసరించనున్నట్లు తెలిపారు.
ఇండియాలో మొదలైన చర్చలు
భారతదేశంలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అనే అంశం.. కేంద్ర స్థాయిలో ఇంకా స్పష్టమైన చట్టం లేకపోయినా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా కంపెనీలతో వయస్సు ఆధారిత పరిమితులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 2025–26 ఆర్థిక సర్వేలో కూడా పిల్లల కోసం సోషల్ మీడియా వినియోగంపై వయస్సు పరిమితులు పెట్టాలని సూచించారు. చిన్నారుల్లో పెరుగుతున్న ‘డిజిటల్ వ్యసనం’ ప్రధాన ఆందోళనగా ఈ నివేదిక పేర్కొంది.
పిల్లల కోసం సాధారణ మొబైల్ ఫోన్లు లేదా విద్య కోసం మాత్రమే ఉపయోగించే టాబ్లెట్లు ప్రోత్సహించాలని సర్వే సూచించింది. దీంతో చిన్నారులు హింసాత్మక, అసభ్య లేదా జూదం సంబంధిత కంటెంట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది.
అమలు ఎంతవరకు సాధ్యం?
రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయడం సాంకేతికంగా అతిపెద్ద సవాలుగా ఉంటుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాలు నిషేధం అమలు చేసి, మరికొన్ని రాష్ట్రాల్లో అమలుచేయకపోతే నిషేధం చేయడం కష్టం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ దేశవ్యాప్తంగా సమానంగా ఉండటంతో.. ఒక రాష్ట్రంలో మాత్రమే జియో-రిస్ట్రిక్షన్ అమలు చేయడం కష్టమని చెబుతున్నారు. కాబట్టి కేంద్ర స్థాయిలో ఒకే విధమైన చట్టం ఉంటే అమలు చేయడం సులభమవుతుందని వారు సూచిస్తున్నారు.
సంస్థల అభిప్రాయం ఇలా..
ఢిల్లీకి చెందిన డిజిటల్ హక్కుల సంస్థ ”ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్” ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సోషల్ మీడియా పూర్తిగా నిషేధించడం సమస్యకు సరైన పరిష్కారం కాకపోవచ్చని సంస్థ పేర్కొంది. ప్లాట్‌ఫామ్ డిజైన్, డేటా రక్షణ వ్యవస్థలు, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను మెరుగుపరచడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో లింగ అసమానతలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా మొదటి చట్టం
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా సోషల్ మీడియా ఉపయోగించడానికి కనీస వయస్సు నిర్ణయించిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. అక్కడి చట్టం ప్రకారం.. 16 సంవత్సరాల లోపు పిల్లల ఖాతాలను గుర్తించి వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయకుండా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. సోషల్ మీడియా వల్ల వచ్చే ప్రెజర్, హానికర కంటెంట్ నుంచి యువతను రక్షించడమే అని సంబంధింత అధికారులు చెబుతున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి చట్టాలు అమలు చేస్తే పిల్లల ఆన్లైన్ భద్రతకు సహాయపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also read: HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్.. పెరిగిన FD వడ్డీ రేట్లు
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.