తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రవీంద్రభారతి కళా ప్రాంగణం ఎదురుగా.. ఈ నెల 15వ తేదీన సినిమా పాటల గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని, విగ్రహాన్ని తన చేతుల మీదుగానే ప్రారంభించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విగ్రహావిష్కరణపై వ్యతిరేఖత!
ఒకపక్క విగ్రహావిష్కరణకు కావాల్సిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతుండగా.. ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహం ఇక్కడ మా తెలంగాణలో పెట్టడానికి వీలులేదు అనే నినాదం మొదలయింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ నడుస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వారివారి ఆలోచనలకు తగినట్టు, ఎవరికి తోచిన విధంగా వారు భిన్న అభిప్రాయాలను వెళబుచుతున్నారు. ఇందులో సామాన్య ప్రజానికమే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకీ చెందిన వాళ్లు, సామాజిక ఉద్యమ కారులు ఇలా అందరూ కూడా రెండుగా చీలిపోయి పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణను వ్యతిరేకిస్తున్నవారు, మద్దతిస్తున్నవారు ఉన్నారు.
మీడియా ప్రతినిధులతో గొడవ!
ఈ వివాదం ఇప్పుడు ఎక్కడ మొదలయింది, ఎందుకు చర్చకు వచ్చింది, ఎవరు లేవనేత్తారు అనేది ఒక్కసారి చూస్తే.. విషయం పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహాన్ని ముందుగానే అక్కడ తీసుకొచ్చి ఒక దిమ్మే మీద పరదా కప్పి ఆవిష్కరణకు సిద్ధంగా ఉంచడం జరిగింది. ఆ విగ్రహం చుట్టూ ఇంకా గోడ కట్టే కార్యక్రమాలు ఏవో జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఆ క్రమంలో వాటిని పర్యవేక్షించే పనిలో భాగంగా ఎస్పీ బాల సుబ్రమణ్యం బావమరిది సినిమా నటుడు శుభలేక సుధాకర్ అక్కడకు చేరుకోవడం జరిగింది.
అయితే అప్పటికే అక్కడే ఉన్నటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు కెమెరాతో వీడియో తీస్తున్నట్టుగా సమాచారం. ఆ సమయంలో వీడియో తీయొద్దు అని శుభలేఖ సుధాకర్ కెమెరాను గుంజుకున్నట్టగా చెబుతున్నారు. అదే సందర్బంలో అక్కడే ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ క్రాంతిదళ్ పార్టీ అధ్యక్షుడు సంగం రెడ్డి పృథ్విరాజ్ యాదవ్ సుధాకర్‌తో వాగ్వాదానికి దిగారట. ఆ తరువాత అసలు ఎస్పీ బాల సుబ్రమణ్యం విగ్రహం మా తెలంగాణలో ఎందుకు, ఆయన ఈ ప్రాంతం వాడు కాదది చెప్పుకొస్తున్నారు.
ఎందుకు వ్యతిరేఖిస్తున్నారంటే?
మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో రచయిత, గాయకుడు అందెశ్రీ రాసిన జయ జయ జయహే అనే తెలంగాణ జాతీయ గేయాన్ని అప్పట్లో ఎస్పీ బాల సుబ్రమణ్యం చేత పాడించాలని అనుకున్నారంట. అప్పుడు రసమయి బాలకిషన్ లాంటి వారు చెన్నైకు వెళ్లి బాలసుబ్రమణ్యంని కలిసి పాట పాడమని అడిగి అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. అయితే ఆ గేయంలో ఉన్న “స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి” అనే కొన్ని పదాలు తొలగిస్తేనే తాను పాడుతానని.. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో పాడను అని ఖరాకండిగా చెప్పారన్నదీ.. ఇప్పుడు వారు చెబుతున్నమాట.
ముదిరిన వివాదం
తెలంగాణ రాష్ట్ర సాధనను ఇష్టపడని వ్యక్తి, తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించిన వ్యక్తి, సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చినటువంటి మనిషి విగ్రహాన్ని ఇక్కడ ఎలా ప్రతిష్టిస్తారు అన్నది పృథ్విరాజ్ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడిండ్రో గద్దర్, బెల్లి లలిత, మారోజు వీరన్న, గూడ అంజన్న, బండి యాదగిరి, అందెశ్రీ ఇంకా అనేక మంది ఉన్నారు. అటువంటి వారి విగ్రహాలు పెట్టాలని ఆయన కోరుతున్నారు. మరి ఇప్పుడు ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.