సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. నగరాల్లో ఉండే దాదాపు అందరూ ఇళ్ల బాట పడతారు. ఈ సమయంలో కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
అధిక ఛార్జీలు వసూలు చేస్తే..
పండుగ (సంక్రాంతి) సీజన్‌ను ఆసరాగా తీసుకుని.. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది రవాణా శాఖ హెచ్చరించింది. అంతే కాకుండా చట్ట విరుద్ధమైన వస్తువులను రవాణా చేయడం కూడా నేరమని పేర్కొంది. పర్మిట్ రూల్స్ అతిక్రమించడం, కాంట్రాక్ట్ క్యారేజిలను స్టేజ్ క్యారేజీలుగా నడపడం వంటివి చేయకూడదని బస్సు ఆపరేటర్లను హెచ్చరించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
సంక్రాంతి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ బస్సులపై ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకోమని స్పష్టం చేసింది. ప్రతి బస్సు.. రాష్ట్ర రవాణా నిబంధనలను అనుకూలంగా ఉండాలని హెచ్చరించింది. ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
భద్రత ముఖ్యం
గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవ్వడం, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సు యాజమాన్యానికి కీలక సూచనలు చేసింది. ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవడానికి ఇళ్లకు వెళ్లే సమయంలో విషాదం నెలకొంటే.. చాలా బాధాకరం. కాబట్టి ట్రావెల్స్ యాజమాన్యం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ట్రావెల్స్ యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బస్సు ప్రయాణానికి సిద్దమవ్వడానికి ముందే.. బ్రేక్స్ సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఇబ్బందులు బస్సులో ఉన్నాయా?, ఒకవేళా సమస్యలు ఉంటే వాటిని తప్పకుండా పరిష్కరించుకోవాలి. సమస్యలు ఉన్న బస్సును నడిపితే.. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే.. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఛార్జీల విషయానికి వస్తే..
కొంతమంది ప్రైవేట్ యాజమాన్యం.. పండుగ సీజన్ సమయంలో ప్రయాణికుల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేసిన సందర్భాలు గతంలో కూడా కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇది సాధారణ ప్రజలకు ఒకరకంగా ఆర్ధిక భారం కూడా. కాబట్టి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం కూడా.
రవాణాశాఖ ఆదాయం
2025-26 ఆర్ధిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ.. మొత్తం 5142 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించింది. ఇందులో రూ. 3611 కోట్లు లైఫ్‌టైమ్ ట్యాక్స్, రూ. 730 కోట్లు త్రైమాసిక పన్ను, గ్రీన్ ట్యాక్స్ రూ. 57 కోట్లు కాగా.. వివిధ ఫీజుల ద్వారా రూ. 408 కోట్లు వచ్చినట్లు సమాచారం. తనిఖీల ద్వారా రూ. 153 కోట్లు, సర్వీస్ ఛార్జీల ద్వారా రూ. 181 కోట్ల ఆదాయం లభించింది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.






