2026 మొదలై రెండు నెలలు పూర్తవుతోంది. ఇప్పటికే టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్, మారుతి సుజుకి ఈవిటారా, ఎంజీ మెజెస్టర్ వంటి ఎన్నో కొత్త కార్లు గత 60 రోజుల వ్యవధిలో లాంచ్ అయ్యాయి. కాగా మార్చి నెలలో కూడా దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ కథనంలో ఆ కార్ల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
రెనాల్ట్ డస్టర్
రెనో కంపెనీ 2026 డస్టర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది మార్చి 17న మార్కెట్లో లాంచ్ అవుతుంది. అదే రోజు సంస్థ ధరలను అధికారికంగా వెల్లడించనుంది. అంచనా ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 10 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా కంపెనీ ఇప్పటికే కొత్త కార్లను తన అధీకృత షోరూమ్‌లకు పంపించడం మొదలుపెట్టేసింది. ఇది చూడటానికి స్టాండర్డ్ డస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందుతుంది.
స్కోడా కుషాక్
ఇండియాలో అత్యధిక ప్రజాదరణ పొందిన కుషాక్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది కూడా మార్చిలో లాంచ్ అవుతుందని సమాచారం. కానీ ఎప్పుడు (డేట్) లాంచ్ అవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది. కుషాక్ 2026 మోడల్.. మునుపటి కుషాక్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందులో ప్రధానంగా కొత్త గ్రిల్, కొత్త ఫ్రంట్ ఫాసియా, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. దీని ధర రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండనుంది.
టయోటా ఎబెల్లా
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి టయోటా కంపెనీ ఎబెల్లా లాంచ్ ద్వారా అడుగుపెట్టనుంది. దీని ధరలను కంపెనీ మార్చిలో ప్రకటించనుంది. ఖచ్చితమైన తేదీ వెలువడలేదు. ఇది 49 కిలోవాట్, 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. దీని పరిధి (రేంజ్) 543 కిమీ / ఫుల్ ఛార్జ్ ఉంటుందని సమాచారం. ఖచ్చితమైన రేంజ్ వివరాలు తెలియాల్సి ఉంది.
నిస్సాన్ టెక్టన్
గ్రావిటే కారును లాంచ్ చేసిన తరువాత.. టెక్టన్ పేరుతో మరో కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది డస్టర్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకింగ్ భారతదేశం కోసమే కంపెనీ దీనిని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఇది 2027లో 7 సీటర్ రూపంలో లాంచ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. త్వరలో లాంచ్ కానున్న టెక్టన్ కారు ధరలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఆడి ఎస్‌క్యూ8
సాధారణ కార్లతో పాటు.. ఆడి కంపెనీ తన లగ్జరీ కారు ఎస్‌క్యూ8ను కూడా లాంచ్ చేయనుంది. ఇది మార్చి 17 లాంచ్ అవుతుందని సమాచారం. ఇది 2026లో లాంచ్ అయిన ఆడి మొదటి కారు అవుతుంది. దీని ధర రూ. 1.5 కోట్లు ఉంటుందని అంచనా. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ద్వారా మంచి పనితీరును అందించనున్న ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. బుకింగ్స్ త్వరలోనే స్వీకరించే అవకాశం ఉంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.