టెరాన్ కారు లాంచ్ చేసిన ఫోక్స్‌వ్యాగన్: రూ.51 వేలతో బుకింగ్స్!

ఫిబ్రవరి నెలలో కొత్త కార్ల లాంచ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే మారుతి సుజుకి కంపెనీ ఈవిటారా లాంచ్ చేయగా, నిస్సాన్ కంపెనీ గ్రావైట్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ సంస్థ టెరాన్ ఆర్-లైన్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలతో పాటు, ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేసిన టెరాన్ ఆర్-లైన్ కారు ప్రారంభ ధర రూ. 46.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు కోసం ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభమైపోయింది. కాబట్టి రూ.51 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్..

సెవన్ సీటర్ విభాగంలో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ ఆర్-లైన్ ఎంక్యూబీ ఈవీఓ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన మూడు వరుసల కారు. ఇందులోని 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ & ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం 7.3 సెకన్లు మాత్రమే. ఈ కారు టాప్ స్పీడ్ 224 కిమీ/గం అని తెలుస్తోంది.

ఫుల్లీ లోడెడ్ మోడల్!

టెరాన్ ఆర్-లైన్ కారు మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి వాటితో పాటు ముందు, వెనుక భాగంలో ప్రకాశవంతమైన లోగోలు పొందుతుంది. మొత్తం మీద ఇది ప్రీమియం జర్మన్ డిజైన్ కలిగి.. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది.

అప్డేటెడ్ ఫీచర్స్

విలాసవంతమైన క్యాబిన్, విశాలమైన లేఅవుట్ కలిగిన ఈ కారు.. పనోరమిక్ సన్‌రూఫ్, ఏర్గోనమిక్ ఫ్రంట్ సీట్లు పొందుతుంది. డ్యాష్‌బోర్డ్‌లో 15 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 10.25 ఇంచెస్ డిజిటల్ కాక్‌పిట్, అగ్మెంటెడ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఉన్నాయి. ముందు సీట్లు మెమరీ, వెంటిలేషన్, మసాజ్ ఫీచర్, లంబార్ సపోర్ట్ వంటి వాటితో 12 వే అడ్జస్టబుల్ అందిస్తాయి. యాంబియంట్ లైటింగ్ సిస్టమ్‌లో 30 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్

భద్రత విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ ఆర్-లైన్ కారు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు పొందుతుంది.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసెంట్, డీసెంట్ అసిస్ట్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల.. ప్రయాణికులు కొంత భద్రతను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో.. డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా కార్లనే వాహన వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

ప్రత్యర్థులు ఇవే..

ఈ కొత్త కారు ఇండియన్ మార్కెట్లోని.. స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్ వంటి వాటికి అమ్మకాల్లో ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. కాబట్టి అమ్మకాల్లో ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ప్రీమియం డిజైన్, ఫీచర్స్ కావాలనుకునే వారికి టెరాన్ కారు మంచి ఎంపిక అవుతుంది. కాగా కంపెనీ ఇప్పుడు దేశీయ విఫణిలో టైగన్, వర్టస్ వంటి మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి కూడా అమ్మకాల్లో ఆశాజనకంగానే ఉన్నాయి.