పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. పలుమార్లు గడువును కూడా పొడిగిస్తూ వచ్చింది. ఇక చివరిసారి 2025 డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పకుండా లింక్ చేయాలని ఆదేశించింది. దీన్నిబట్టి చూస్తుంటే.. గడువును మరోమారు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంతకీ ఆధార్ & పాన్ కార్డులను ఎలా లింక్ చేసుకోవాలి. లింక్ చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?, అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే వచ్చే సమస్యలు
ముందుగా పాన్ కార్డును.. ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే వచ్చే సమస్యల విషయానికి వస్తే..
➤ఆర్ధిక వ్యవహారాల్లో గందరగోళాలు ఏర్పడతాయి.
➤ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు.
➤టీడీఎస్ ఎక్కువ శాతం కట్ అయ్యే అవకాశం ఉంది.
➤మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ మొదలైన షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అడ్డంకులు ఏర్పడతాయి.
➤బ్యాంకు ఖాతాల్లో పెద్ద లావాదేవీలు చేయలేరు, అవాంతరాలు ఎదురవుతాయి.
➤లోన్స్, క్రెడిట్ కార్డుల ప్రాసెస్ ఆగిపోయే అవకాశం ఉంది.
పాన్ కార్డు ఒకసారి డీయాక్టివేట్ అయితే.. ముక్యంగా పెద్దమొత్తాల్లో లావాదేవీలు చేయలేరు. కాబట్టి గడువు లోపల లింక్ చేసి ఉంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ ఇప్పటికే చాలాసార్లు అధికారికంగా వెల్లడించింది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండకూడదని.. పన్ను వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం ఈ పాన్ కార్డు లింకింగ్ విధానం అమలులోకి తెచ్చింది. కాబట్టి నిర్దిష్ట గడువు లోపల లింక్ చేయని పాన్ కార్డులు అన్నీ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేయడం ఇలా..
➤ఆన్లైన్లో పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలంటే.. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి, హోమ్ పేజీలో కనిపించే లింక్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
➤క్లిక్ చేసిన తరువాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
➤ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
మీ వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే.. పాన్ – ఆధార్ లింక్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.
రూ.1000 ఫైన్ ఎప్పుడు, ఎలా చెల్లించాలంటే?
2017 జులై 1 కంటే ముందు జారీ అయిన పాన్ కార్డులను.. ఆధార్ నెంబరుతో లింక్ చేయకపోతే.. అలాంటి వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
➤ఫైన్ చెల్లించడానికి.. ముందుగా ఈ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేసి.. పే ఆధార్ లింకింగ్ ఫీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
➤ఫీజు చెల్లించిన తరువాత.. లింక్ ఆధార్ సెక్షన్లోకి వెళ్లి.. లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
➤స్టేటస్ చెక్ చేసుకోవడానికి.. ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.