ఈ దేశంలో తినే తిండి, కట్టే బట్ట, పలికే మాట, పాడే పాట, ఆడే ఆట, చెప్పే కథ ఇలా ప్రతి దాని వెనుక కూడా ఒక బలమైన చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక నేపథ్యం దాగి ఉంది. ఇక్కడ ఉన్న అల్ఫసంఖ్యాక (ఆధిపత్య) వర్గాల జీవితంలో జరిగే ప్రతీది ఒక గొప్ప కార్యంగా.. మెయిన్ స్ట్రీం మీడియాలో చూపిస్తూ వాటినే అందరి సంస్కృతిగా ఆపాదిస్తూ, అధిక సంఖ్యాక (అణచివేయబడిన) వర్గాల ప్రజల జీవితాల్లోని సహజమైన కళారుపాలు, పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, రాజకీయాలు బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా అవి ఒక విలువలేనివిగా, ప్రాధాన్యత లేనివిగా సృష్టిస్తూ వచ్చారు. అయితే నేటికీ అదే కొనసాగుతూ ఉంది. ఈ విధమైన వివక్షను, అణచివేతను ధిక్కరిస్తూ దళిత, బహుజనుల సృజనాత్మక కళల్ని, సంస్కృతిని, బుద్ధుడు, అంబేడ్కర్, పెరియార్‌ల పొలిటికల్ & సోషల్ ఐడియాలజీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉద్భవించిన జ్ఞానఖడ్గమే నీలం కల్చరల్ సెంటర్ అనే సంస్థ.
పా. రంజిత్ నీలం సంస్థలు
నీలం అనే సంస్థని స్థాపించిన వ్యక్తి ,ప్రముఖ చలన చిత్ర దర్శకుడు పా. రంజిత్. ఈయన సినిమాలు (అట్టకత్తి, మద్రాస్, కాలా, కబాలి, సార్పట్ట పరంపర, తంగలాన్) అన్నీ కూడా నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. ఈ దేశంలో కుల పరమైన అవమానాలు, హత్యలు, దోపిడీ, వివక్ష, అణచివేత వీటికి వ్యతిరేకంగా చేసే ఉద్యమాలు, దేశ మూల నివాసుల రాజకీయ, సామాజిక & అస్థిత్వ పోరాటాలు పా. రంజిత్ తీసే చలన చిత్రాల్లో కథా వస్తువులుగా ప్రతిబింబిస్తాయి. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో రంజిత్ ఆలోచనల కొలిమిలో నుంచి పుట్టుకొచ్చినవే ఈ నీలం ప్రొడక్షన్స్, నీలం స్టూడియోస్, నీలం కల్చరల్ సెంటర్ సంస్థలు.
10ఏళ్లు పూర్తి
2015 సంవత్సరంలో నీలం కల్చరల్ సెంటర్ ప్రారంభించారు. ఈ ఏడాదితో అది దాదాపు 10 (పది) వసంతాలు పూర్తి చేసుకునుంది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు బీజం వేసింది. వానమ్ ఆర్ట్ ఫెస్టివల్, మార్గయిల్ మక్కల్ ఇసై ఇలాంటి మరికొన్ని ఈవెంట్స్ నీలం సంస్థ చేపట్టింది. వానమ్ ఆర్ట్ ఫెస్టివల్ అనే ఈవెంట్ 2018 లో మొదలుపెట్టడం జరిగింది. దళిత్ హిస్టరీ మంత్.. పేరుతో అంబేద్కర్ పుట్టిన నెల ఏప్రిల్‌లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహిస్తారు. అంబేడ్కర్ మరియు దళిత్ ఐడియాలజీతో వచ్చే వివిధ బాషల సినిమాలు, పెయింటింగ్స్, డ్రామాస్ అన్నింటిని అక్కడ ప్రదర్శిస్తారు.
వైభవంగా 6వ సీజన్
2020వ ఏడాది మార్గజియిల్ మక్కల్ ఇసై పేరుతో మరో కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సంవత్సరం 6వ సీజన్ అంగరంగ వైభవంగా జరిగింది. పక్కన రాష్ట్రాల అనేక బృందాలు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. గ్రామీణ జానపదం పాటలు, ర్యాప్ సాంగ్స్, ఒప్పారీ, గుస్సాడి, గానా, హిప్ హ్యాప్ లాంటి అన్నిరకాల సంగీతాలను ప్రదర్శించారు. ఇంకా పి.కె రోజీ ఫిలిం ఫెస్టివల్, నీలం బుక్ స్టోర్ & కల్చరల్ స్పేస్ లాంటి ఈవెంట్స్ కూడా చేపట్టారు. అంబేద్కర్ మరియు దళిత ఆలోచనలు కలిగిన పుస్తకాలు చదవడం, వాటిని గురించి మాట్లాడుకోవడం, చర్చించడం కోసం ఒక కేంద్రంలాగా ఏర్పాటు చేశారు.
నీలం కల్చరల్ సెంటర్ కేవలం ఒక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమ సంస్థగానే భావించాలి. దళిత, బహుజనుల జీవితంలో ఉండే అన్నీ కళలని, వాళ్ల సాంస్కృతిక కళా ఖండాలని, రాజకీయ, అస్థిత్వ పోరాట చరిత్రని సినిమాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు, చిత్రాలు, పాటలు వీటన్నింటి రూపంలో ఈ సంస్థ తీసుకొస్తుంది. సమానత్వం, స్వేచ్ఛను ప్రతిబింబించే విధంగా ప్రతి ప్రోగ్రామ్ ఉంటుంది.
త్వరలో తెలుగు రాష్ట్రాల్లోకి!
ప్రస్తుతం ఇది తమిళనాడు ప్రాంతం వరకు మాత్రమే పరిమితం అయింది. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నీలం కల్చరల్ సెంటర్ అడుగుపెట్టనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దళిత, బహుజనుల యొక్క భాగస్వామ్యం, ప్రమేయం లేని కారణంగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆ రచయితలు, నటులు, గాయకులు, సంగీతకారులు, పల్లెల్లో ఉన్న స్వచ్ఛమైన జానపదులు వారందరికి నీలం సంస్థ ఒక గొప్ప అవకాశంగా, పెద్ద వేదికగా మారనుందని, ఇంతకాలం మరుగున పడిన బహుజన కులాల కళారూపాలు ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తాయని ఆ సామాజిక వర్గాల వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు.
మొన్న జరిగిన మార్గయిల్ మక్కల్ ఇసై ఆరవ సీజన్‌లో తెలంగాణ నుంచి అందె భాస్కర్, కరుణాకర్ బహుజన పాల్గొని వారి కళాబృందంతో చెన్నైలో ప్రదర్శన ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఏఎస్ గంధం చంద్రుడుకి కూడా ఆహ్వానం అందింది. కుటుంబ సభ్యులతో పాటు ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. దీన్ని బట్టి చూస్తే నీలం కల్చరల్ సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంస్థ ఎంతోమంది కళాకారులకు చేయూతనిచ్చి పై స్థాయికి ఏదిగేలా చేసింది. వారికి జీవితాలను ఇచ్చింది. దీనంతటికి డైరెక్టర్ పా. రంజిత్ మూలకారకుడు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






